బస్సు తో తంటాలు:
అసలే ఊరికి దూరం అవడంతో, మా కాంప్లెక్స్ కి దగ్గర్లోనే కేంద్రీయ విద్యాలయా ఉండడంతో చాలా మంది పిల్లల్ని అక్కడే చెర్పించారు. ఆటోల్లో పిల్లల్ని కుక్కి కుక్కి పంపే అవస్థ చూసి మా కమిటీ వాళ్ళు కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక బస్సుని 'నో ప్రాఫిట్ నో లాస్' పద్దతిలో నడపడానికి ఏర్పాట్లు చేసి, అబ్బో.. సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.
సరే ఇంకేముంది ఏర్పాట్లన్నీ చక చకా జరిగి పోయాయి. ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చి 33 సీట్లున్న మా బస్సుకి దాదాపు 45 మంది పిల్లల ఆదరణ లభించింది. కొంత మంది పిల్లల భద్రత గురించి పాపం చాలా ఎంక్వయిరీ చేశారు. బస్సు డ్రైవర్ కీ, కండక్టర్ కీ మార్గ నిర్దేశాలూ జాగ్రత్తలూ తయారు చేసేసారు. పిల్లల లెక్క చూసుకోవడం, తలుపులు, కిటికీలూ సరిగ్గా మూయడం లాంటివన్న మాట. ఇంకొంత మందైతే కాంప్లెక్స్ దాటగానే మైన్ రోడ్డు మీద వేరే వాహనాలొస్తాయికదా, ప్రమాదాలు నివారించడం ఎలాగో చర్చించాల్సిందే అన్నారు.
అన్ని ఇళ్ళలోని పిల్లలకీ వీలుగా ఉండడంకోసం ఒక రూట్ మ్యాప్ (అంటే కాంప్లెక్స్ లోపల ఎలా గిరికీలు కొట్టాలనే స్పెసిఫికేషన్ అన్న మాట) కూడా తయారు. ప్రత్యేకంగా ఈ బస్సు సంగతి చూసుకోవడానికి ఇద్దరితోనో ముగ్గురుతోనో ఒక సబ్ కమిటీ కూడా వేసేశారు. ఇంకజూస్కోండి పొద్దున్నే హడావిడి, పాపం ఆ సబ్ కమిటీ సభ్యులంతా మోటార్ సైకిళ్ళ మీద బస్సు ముందో వెనకో ఒకటే చక్కర్లు. పాపం అంతా సజావుగా జరిపించాలనే తపన వాళ్ళది! నాకెలా తెలుసు వాళ్ళ ఉద్దేశ్యం అనుకుంటున్నారు కదూ! మరదే.. తెలిస్తుందంతే, మీరు నమ్మాల్సిందే.
ఒక్క రోజు అనుభవం నేర్పిన పాఠాలు ఏంటంటే ఈ రూట్ మ్యాప్ మొదట్లో వుండే పిల్లల్ని ముందుగానే తయారు చేసి బస్సెక్కించాల్సి వసుంది. చివర్లో ఎక్కే పిల్లలకేమో సీట్లు దొరకవు. పైగా కొన్ని లేన్లలో బయటే పార్క్ చేసిన కార్ల వల్ల బస్సుని గిరికీలు తిప్పడం కష్టమయి పోతుందని మా డ్రైవర్ ఇబ్బంది పడడం. ఈ మధ్యలో మా సుపుత్రుడు చివర్లో ఎక్కే వాడి ఫ్రెండ్ కోసమని పక్క సీట్లో పుస్తకాల సంచీ పెట్టి బ్లాక్ చేశాడు. వెధవ్వేషాలెయ్యొద్దని చెప్పి ఎలాగో తీసేయించాం లేండి.
ఈ గుణ పాఠాల పుణ్యమాని రెండో రోజుకి రూట్ మ్యాప్ ని పక్కన పడేసి మైన్ స్ట్రీట్ లో మాత్రమే బస్సు వెళ్ళేట్టూ, అన్ని లేన్స్ వాళ్ళూ, వాళ్ళ లేన్ చివర్లో ఎక్కేట్టు మార్పు చేసేశాం. రెండు మూదు రోజుల తరవాత గమనిస్తే, అందరూ బస్సు ఎక్కడ వుంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించడం మొదలెట్టారు. ఒక వారం పొయ్యాక, చాలా మంది బస్సు స్టార్టింగ్ ప్లేస్ కే వెళ్ళి ఎక్కిస్తున్నారు. కారణం ఏంటంటే పిల్లలకి సీట్లు దొరకడానికన్న మాట.
[50 మంది పిల్లలకి 30 సీట్లున్న బస్సుంటే, సహజంగానే క్యూ పద్దతులూ గట్రా హుష్ కాకి అవుతాయి. పోనీ రెండు ట్రిప్పులు తిప్పడం లేక రెండు బస్సులు వెయ్యడం లాంటి వాటికి మా అసోసియేషను ఆర్ధిక వనరులు సరిపోవు. మన సమాజంలో పరిస్థితి కూడా అదేకదా!]
పారిశుధ్యం, మన్నూ, మశానం :
కాంప్లెక్స్ లోపలి గార్డెన్ చూసుకోవడానికి ఒక కాంట్రాక్టూ, రోడ్లూ అవీ ఊడ్చడానికి ఒక కాంట్రాక్టూ ఇచ్చేసి అవుట్ సోర్సింగ్ ద్వారా కాలనీ ప్రజల జీవన్ ప్రమాణాలు మెరుగు పరిచే కార్యక్రమం కూడా బానే అమలవుతుంది లేండి.
ఈ మధ్యే ఒక మంచి ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతుంది మా కమిటీ వాళ్ళలో. అదేంటంటే, మన వాళ్ళు కొంత మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు, వాటిని రోడ్ల మీదికి వాకింగ్ అనే హార్మ్ లెస్ పేరుతో తిప్పుతున్నారు. వచ్చిన చిక్కేంటంటే, పాపం అవికూడా ప్రాణులే కదా! రోడ్లు ఖరాబు చేస్తున్నాయి. ఎలా చెప్పాలి, కుక్కల హక్కు దారులకి మార్గాంతరం ఏం చూపించాలి అని!
ఒకరిద్దరు మాత్రం, ఆ.. ఏంటి, మనం పాశ్చాత్య దేశాల్లో చూడట్లేదా, వాళ్ళ లాగా వీళ్ళని కూడా చేతులకి డిస్పోసబుల్ కవర్లు తొడుక్కోమని చెప్పేయడమే, లేకపోతే ఈ అవుట్ సోర్సింగులూ ఇవన్నీ ఎందుకు దండగ అన్నారు. ముందు కాలనీలోని సూపర్ మార్కెట్టు వాడిని అటువంటి కవర్లు అందుబాటులో వుంచమని చెప్పి, తరువాత వీళ్ళకి చెప్తే బెటర్ అనె దిశ లో సాగుతున్నాయి ఆలోచనలు. (నిజమే కదా అమెరికా వాడి దగ్గరుండే మంచి లక్షణాలు మాత్రం వదిలేసి, వాడి దగ్గరుండే అవలక్షణాలు మాత్రమే పట్టుకొచ్చేస్తున్నారు మనవాళ్ళు)
సారాంశం:
నేను గమనించిన విషయాలు అర్థం చేసుకునే ప్రక్రియలో రాశానే గానీ మా వాళ్ళంతా స్వతహాగా చాలా మంచి వాళ్ళండోయ్. కాకపోతే ఇంతమంది కలిసి పనులు చేయడంలో ఉండే ఇబ్బందులూ, సౌకర్యాలూ, అసౌకర్యాలూ తెలుస్తున్నాయంతే. అందరూ చదువుకున్న వాళ్ళూ, రీజనబుల్ వాళ్ళూ ఉన్న ఒక చిన్న కాంప్లెక్స్ లోనే ఇంత క్లిష్టంగా ఉంటే ఒక 100 కోట్లమంది అనేక రకాల నేపధ్యాల వాళ్ళు ఉండే దేశాన్ని నడపడమంటే మాటలా!!!