9, సెప్టెంబర్ 2010, గురువారం

గతిలేక కొంతమంది, గత్యంతరం లేక కొంతమందీ, దురాశతో కొంతమందీ...

మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా దేశంలోని అవినీతి మీద వెల్లడించిన అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా, చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువివ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన విషయాలూ అభిప్రాయాలు కొంతైనా మంచి పరిణామాలకు దారి తీస్తాయనే ఆశిద్దాం. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఒకసారి చూద్దాం.


1. దేశంలో మూడోవంతు మంది పూర్తి అవినీతిపరులుగా మారిపోగా దాదాపు సగం మంది అవినీతి మకిలి అంటించుకున్న వాళ్ళేనట! ఇరవై శాతం మంది ప్రలోభాలకీ పరిస్థితులకీ లొంగకుండా నిజాయితీ పరులుగానే ఉన్నారనేది శుభ పరిణామమే.


2. కొన్నేళ్ళక్రితం అవినీతికి పాల్పడిన వారికి సమాజంలో గౌరవం ఉండేది కాదు. ఒక రకమైన సామాజిక నిరసనా, సాఘీక నిరాదరణా ఎదురయ్యేవి. అయితే ఈ మధ్య కాలంలో అది కూడాలేకుండా పోయిందనీ, అవినీతి కి సాంఘీక ఆమోదం లభించడం అనేది ఒకింత చేదు నిజం.


3. మారుతున్న సామాజిక విలువలని కూడా CVC ప్రస్తావించారు. ఒకప్పుడు మనిషి సత్ప్రవర్తనని బట్టో, లేక సమర్ధతని బట్టో సమాజంలో గౌరవం లభించేది. అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఎంత ధనవంతుడు అనేది మాత్రమే గౌరవానికి కొలబద్దగా మారటం కూడా ఒక పెనుప్రమాదమని CVC అభిప్రాయ పడ్డారు.


ఇంతమంది ప్రజలు అవినీతికి అమోదముద్ర వెశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. పైన సిన్హా గారు చెప్పిన అభిప్రాయల ద్వారా గానీ ఇతరత్రా మన అవగాహన వల్ల కానీ గత్యంతరంలేని పరిస్థితుల్లో అవినీతి పరులుగా మారేవాళ్ళూ, గతిలేక అవినీతి పరులుగా మారేవాళ్ళూ చాలా మంది ఉన్నారనేది మనకందరికీ తెలిసిందే. వీరితో పాటు దురాశతో అవినీతి చేసే వాళ్ళూ బానే వున్నారు.


పై స్థాయిల్లో జరిగే రాజకీయ అవినీతి అతి ప్రమాదకరమైనదీ, పైగా అవినీతిని కింది స్థాయి వరకూ పెంచి పోషించేదీనూ. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే అవినీతి చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఉంది. పై స్థాయిలన్నీ అవినీతి మయమైనప్పుడు ఇలాగే జరుగుతుంది మరి అని సరిపెట్టుకోలేమనిపిస్తుంది. చాలా వరకూ అది నిజమే అయినా, ముఖ్యంగా అవినీతికి సమాజంలో అమోదం లభించడం గానీ, లేక కేవలం డబ్బు ద్వారానే ఒక మనిషికిచ్చే విలువ నిర్థారించబడడం కానీ ఇవి మనలో గూడు కట్టుకుంటున్న సామాజిక రుగ్మతనే సూచిస్తున్నాయి. దీన్ని నిర్మూలించడం అంత సులభమేం కాదు.


వారంలో 6 రోజులు పనిచెయ్యడానికి సిద్దమైన వాళ్ళందరూ కనీస జీవన ప్రమాణాలని అందుకునే పరిస్థితి నెలకొల్పితే గతిలేక చేసే అవినీతిని చాలావరకు అరికట్టవచ్చు. మిగిలిన అవినీతిని అరికట్టడానికి ఒక మార్గం దొరుకుతుంది.


అన్నిటికంటే ముందు రాజకీయ అవినీతిని అంతం చెయ్యాలి అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎలా? ధనవంతుడు కానివాడు రాజకీయాల్లో నెగ్గుకురాగలడనే విశ్వాసం లేదు కదా మనలో! ఏ పార్టీలు నింపుతాయి ఆ విశ్వాసాన్ని? ఏ నాయకులు కల్పిస్తారు ఆ మాత్రం నమ్మకాన్ని?


మనవంతుగా, మరీ సంఘసంస్కర్తలుగా అవతారమెత్తక్కరలేకుండా, వీలయినంతవరకూ ఎదుటి మనిషికి వారివారి ప్రవర్తనని బట్టి మాత్రమే గౌరవం ఇవ్వడం, మనకెదురయ్యే అవినీతి పరులకి గౌరవాన్ని ఇవ్వకపోవడం లాంటివి చెయ్యొచ్చేమో. ఈ సారి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు, ఎంతిస్తే వదిలేస్తాడు అని కాకుండా, మన వయొలేషన్ కి ఫైన్ ఎంత అని కూడా ఆలోచించొచ్చు. ఇంత డబ్బులిచ్చి ఈ పని చేయించాను, ఫలానా వాడు ఎంతబాగా (పైడబ్బులొచ్చే పోస్టు మరి) సంపాదించాడో అని పిల్లల ముందు మాట్లాడడం ఆపెయ్యొచ్చు. కొద్దిగా ఇబ్బందైనా వీలయినంతవరకూ లంచాలు ఇవ్వకుండా మన పనులు చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.

16 కామెంట్‌లు:

  1. మాధవ్ గారు, Thank you.

    అవునండీ అంత ఈజీ కాదు. కాకపోతే ప్రయత్నించి చూస్తే కనీసం సమస్య తీవ్రత అర్థం చేసుకోవడానికయినా పనికొస్తుందని ఆశ.

    రిప్లయితొలగించండి
  2. అన్నిటికంటే ముందు రాజకీయ అవినీతిని అంతం చెయ్యాలి అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎలా?
    ---------------
    రాజకీయ ప్రతినిధులుగా ఎలక్షనులలో నుంచునేవారు ఇంత కన్నా డబ్బులు ఎలక్షనులకు ఖర్చు పెట్ట కూడదు అని రాజ్యాంగ సవరణ చెయ్యాలి.
    దీనిని పాటించటానికి, వాళ్ళ ఆస్తులను ఫ్రీజు చేసి ఆ మొత్తమును మాత్రమే వారికి ఎలక్షనుల ముందు ఇవ్వాలి.ఎలక్షనులు అయిన తరువాత వాళ్ళ ఆస్తి వారికి ఇవ్వ వచ్చు.

    రిప్లయితొలగించండి
  3. @lakkaraaju
    ఎలక్షన్లో పోటి చేసేవారు ఒక పరిమితికి మించి ఖర్చు పెట్టకుదన్న నిబంధన ఇంతకూ ముందే ఉంది.

    వాళ్ళ ఆస్తులు ఫ్రీజ్ చేయగానే డబ్బు పంపిణీ ఎలా ఆగిపోతుంది.మన నాయకులు ఖర్చుపెట్టేది బ్లాక్ మనీ అంటే ప్రభుత్వ లెక్కలలో లేని ధనం కాబట్టి అదీ కుదరదు.మారాల్సింది ప్రజలు ప్రలోబాలకి లొంగకుండా వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేసేలా ప్రజలు మారితే తప్ప ఏమి చేయలేమేమో.

    రిప్లయితొలగించండి
  4. నిజమే మనకు వీలైనంత వరకు మనం చెయ్యకుండా, సమర్ధించకుండా ప్రయత్నం చెయ్యటం తప్పకుండా మొదటి దిశ గా అడుగు అనే అనుకుంటున్నా నేను కూడా. మంచి పోస్ట్.

    రిప్లయితొలగించండి
  5. మీ చివరి పేరాను అనుసరించవచ్చు. ముఖ్యంగా కేవలం డబ్బు వల్లనే సమాజంలో గౌరవం వస్తుందనే భావనను పిల్లల్లో కలుగకుండ చూడాలి.

    రిప్లయితొలగించండి
  6. భావన గారు,
    మీకు నా పోస్ట్ నచ్చినందుకు సంతోషంగా ఉందండీ. అవును మీరన్నట్టు మొదటి అడుగు పడితే మిగతావాటికి కూడా అవకాశం లభిస్తుంది.

    అజ్ఞాత, Thank you.

    రిప్లయితొలగించండి
  7. chalaa nijam ! e marpu kaina maname mundadugu veyalane varu gandhiji.
    i support ur post !!!
    :-)

    రిప్లయితొలగించండి
  8. అవినీతి ఒక విషవలయం.
    ఎక్కడ నుంచి ఛేదించాలనేది చెప్పడం కష్టమే.

    రిప్లయితొలగించండి
  9. @సావిరహే,

    అవునండీ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నిస్తూ, కొద్దిగా ఎదుటి వాళ్ళలో కూడా నిజాయితీ ఉందని నమ్మడానికి ప్రత్నించొచ్చు.

    రిప్లయితొలగించండి
  10. bonagiri గారు,
    విషవలయమేనండీ, కాకపోతే చేధించడానికి ప్రయత్నిస్తే చాలా కష్టంగా కనిపించొచ్చు. కానీ కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ పోతే తప్పకుండా అదుపు చేయవచ్చు.

    ప్రపంచం లో చాలా దేశాలు కొంతమేర ఫలితాలు సాధించాయి కదా! We just need to keep trying. we are getting there..

    రిప్లయితొలగించండి
  11. Weekend Politician గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    హారం

    రిప్లయితొలగించండి
  12. భాస్కర రామి రెడ్డి గారూ,

    థ్యాంక్సండీ. మీకు, మీ కుటుంబానికీ, హారం టీముకీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. first of all very nice post! Thank you WP.

    మాధవ్ గారు చెప్పినట్టు.. అనుకున్నంత ఈజీ కాని స్టేజి కి వచ్చేసింది వ్యవహారం.. అంటే చూసుకోండి దాని తీవ్రత ..

    పైన వ్రాసిన అన్ని వ్యాఖ్యలు అన్నీ సరైనవే.. ఈ వ్యవస్థ ని మార్చడం కష్టమే.. కానీ అది మన పిల్లలతోనే సాధ్యం అని అందరు గమనించాలి.. వాళ్ళ character building లోనే మన భావి సమాజం ఉంది..
    మన పిల్లలకి మనిషిని మనిషిలా గుర్తించే జ్ఞానాన్ని (వాడికి డబ్బు ఉందనీ ఉండకపోనీ) మనం ఇవ్వగలిగితే .. వచ్చే 50 years లో మార్పు రావొచ్చు.. కానీ.. ఇప్పుడు కష్టం అనుకుని ఈ పని ఇప్పటికైనా చెయ్యకపోతే .. ఇక గోవిందా గోవింద..

    రిప్లయితొలగించండి
  14. Shivudu గారు, నెనర్లు. అవునండీ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే.

    రిప్లయితొలగించండి