19, అక్టోబర్ 2010, మంగళవారం

వృత్తి ధర్మాన్ని మంటగలిపిన డాక్టరు-మానవత్వాన్ని పంచిన స్వీపరు

నిన్న వార్తల్లో రెండు వేర్వేరు సంఘటనలు మనసుని కలిచి వేసేవి ఉన్నాయి. ఒక దాంట్లోనేమో, ముగ్గురు అక్క చెల్లెళ్ళను (పెద్ద పాప కి మూడేళ్ళనుకుంటా!) జమ్మూ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిన తండ్రి. రాం పాల్ అనే సదరు తండ్రి ని వెదికి ఎలాగొ పోలీసులు చివరికి పట్టుకోగలిగారనుకోండి. ఇతగాడు చెప్పేదెమిటంతే, ఆ పిల్లల తల్లి ఒక వివాహేతర సంబంధం కారణంగా కొన్నళ్ళ క్రితం ఎటో వెళ్ళిపోయిందట. ఇతగాడు పిల్లల్ని పెంచలేనని వదిలించుకున్నాడట. పిల్లల్ని తిరిగి స్వీకరించడానికి ఇతగాడు ససేమీరా అంటున్నాడు. ఇక ఆ మహ తల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి పిల్లల్ని ఒక అనాధాశ్రమంలో ఉంచి తదుపరి చర్యల కోసం పాపం అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఆ స్టేషన్ లో స్వీపర్ గా పనిచేసే గురుదేవ్ సింగ్ ఈ పిల్లల్ని గమనించి, చేరదీసి, అధికారులకు తెలియచేసి, ఆ రాత్రంతా నిద్రపోకుండా వారికి సేవలు చేసారు. వృత్తిధర్మాన్నేకాదు మానవత్వాన్నికూడా నిలబెట్టిన ఇటువంటివాళ్ళే ఆదర్శప్రాయులు.


ఇక రెండో వార్త విషయానికి వస్తే, డాక్టరుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవం, ధనం బాగా సంపాదించుకున్న ఒక పిశాచి విశృంఖలత్వం మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అచేతనావస్తలో ఉన్న ఒక రోగితో లైంగిక వాంఛ తీర్చుకున్నాడట కామాంధుడైన ఈ ముంబై డాక్టరు. పవిత్రమైన వృత్తి ధర్మాన్నీ, మానవత్వాన్నీ మంట గలిపాడు.


ఈ రెండు వార్తలూ చదివింతర్వాత బాధతో నిండిన హృదయం, ఆలోచనలోతో నిండిన మనసూ తప్ప, పరిష్కారం సూచించే మెదడు  మాత్రం తాత్కాలికంగా పని చేయడం మానేసింది.

4, అక్టోబర్ 2010, సోమవారం

అయోధ్య తీర్పు - సహేతుకమైన నిర్ణయం? కొన్ని ప్రమాద సూచికలు?

తీర్పు వచ్చేసింది. భారతీయులంతా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారనే నిరాశావాదులకి కళ్ళు తెరుచుకునేలా ప్రజలు స్పందించారు. అసలు తీర్పు సంగతి అటుంచితే, మన సమాజం 1992 నుండి 2010 లోకి వచ్చేసింది అనేది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.


[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]


అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు. 


అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!


ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!