30, ఆగస్టు 2010, సోమవారం

ఒకే ఒరలో అసమర్థతా, నియంతృత్వం - మీడియా గొర్రెలమంద స్వభావం

గత రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరిగిన కొన్ని విషయాలను చూస్తే ప్రజాస్వామ్య వాదులెవరికైనా ఆందోళన కలగడం సహజం. మీడియా తో పాటు సెకండ్ గ్రేడ్ రాజకీయ నాయకులూ కలిసి అసలు విషయాన్ని పక్కనబెట్టి ఈ విషయాలకు ప్రాంతీయ ఉద్యమాల రంగూ, కాంగ్రేస్ పార్టీ అంతర్గత కుమ్ములాట ముసుగూ తొడిగే ప్రయత్నం లో సఫలీకృతులవ్వడం మరింత బాధ కలిగించే విషయం. ఇంతకీ నన్నింతగా కలవర పెట్టిన అంశాలు ఏంటంటే,


1. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడి సంఘటన - ఒక ఉద్యమం నేపధ్యంలో ఒక ప్రాంతం వారిని నమ్మలేక పోవడమనే కారణంతో ఉస్మానియా పరిధిలోనే తెలంగాణా ప్రాంతంలోనే పనిచేసే అధ్యాపకులను తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించకుండా అడ్డుకొని తరిమి తరిమి కొట్టడం జరిగింది. ఇక్కడ ఉద్యమ నేపధ్యంలో వాదన జరుగుతుంది. అది వేరే విషయం. అయితే, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చట్టబద్దంగా చెయ్యాల్సిన పనిని చెయ్యలేని పరిస్థితి దాపురించింది. అంత సమస్య ఉంటే, ముందుగానే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలంగాణా వాదులకు వివరించి ఉండాల్సింది. అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళని ఆ విధుల నుంచి తప్పించాల్సింది. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయం సరైనదే అని భావించి ఉంటే, తన పని తను నిర్వహించగలిగి ఉండాలి.
 
ఇప్పుడు జరిగిందేంటి? ఒక ప్రజాప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వర్తించలేని దుస్థితి దాపురించింది. దీన్నేమంటారు? చేతగానితనం, అసమర్థతా అనరా? ఇది ఫెయిల్యూర్ ఆఫ్ కాన్ స్టిట్యూషనల్  మెషినరీ కాదా? ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు?
2. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన అకృత్యం - ఇక్కడ క్కొంతమంది ప్రజలు YSR విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అభిలషించారు. అది ఎంతవరకు అవసరం అనేది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలోని మామూలు ప్రజలు నిజంగానే కోరుకున్న న్యాయబద్దమైన కోరిక. సహేతుకమైన కారణం చూపించకుండా, ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిరసించిన ప్రజలను భయపెట్టడానికి పెద్దమొత్తంలో పోలీసులను మొహరించి, చివరికి అతి దారుణంగా స్త్రీలనూ, వృద్ధులనూ కూడా చావబాది అరెస్టులు చేశారు. ఇదేదో జగన్ వర్గాన్ని కట్టడి చేసే చర్యగా చూడాల్సి రావడం దురదృష్టకరం.
అతి ముఖ్యమైన విషయమేంటంటే, ప్రభుత్వాలు చట్టాలను తమ ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాలకోసం అతిక్రమించి, అదేమని అడిగే ప్రజలను అణిచివేయడం. అంటే, ఒక రకమైన నియంతృత్వం కాదా?
-----------------------------------
 
ఎంతసేపూ జగన్ ని వెనకేసుకు రావడానికో, వ్యతిరేకించడానికో లేక తెలంగాణా వాదానికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో మాత్రమే ఈ అంశాలను వాడుకోవడమేనా?
 
ప్రజాస్వామ్య విలువలకీ, రాజ్యాంగస్ఫూర్తికీ తూట్లు పొడిచిన ఇంత ముఖ్యమైన దృక్కోణాలని మీడియా ప్రజలముందుకు తేకుండా, రాజకీయ నాయకులు ప్రశ్నించకుండా, ఏవో మసాలా కబుర్లను అమ్ముతుంటే మన ప్రజాస్వామ్యం ఎటు పోతుందనుకోవాలి?


కొసమెరుపు:
పైగా మన మీడియా, గురువులకివ్వాల్సిన గౌరవం గురించీ యెదవ సొల్లు కవితలతో పాటు ఇచ్చిన కవరేజీ చాలా హాస్యాస్పదంగా ఉంది. అప్పటికి ఇలాంటి పనులు మిగతా వాళ్ళమీద జరితే పర్వాలేదు అన్నట్లు.


అసలన్నింటికంటే తమాషా ఏంటంటే, OU ఘటన మీద ముఖ్యమంత్రి స్పందన: చాలా ఆవేదన చెందుతున్నాను అని. ఎవడిక్కావాలి బోడి ఆవేదన? CM నుండి మనం ఏం వినాలి? ఈ సమస్య మీద ఒక వైఖరి లేదా తీసుకోబోయే చర్యలు. ఈ ఆవేదన ఏంటి? జరిగే అరాచకాలకి, మాములు ప్రజలూ ఆవేదనే, తన్నులుతిన్న వాళ్ళూ ఆవేదనే, CM కూడా ఆవేదనే :(   

4 కామెంట్‌లు:

  1. మొదటిది లా అన్డ్ ఆర్డర్ సమస్య. రెండోది లాఫుల్లీ అన్ లాఫుల్ ప్రవర్తన. రెంటికీ ప్రభుత్వమే భాధ్యత వహించాలి. రాష్టపతిపాలన విధించడానికి ఇంతకంటే కారణాలు అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  2. టపా బాగుంది. కొసమెరుపు ఇంకా బాగుంది .

    రిప్లయితొలగించండి
  3. మహేష్ గారు,

    నిజమేనండి. ఈ కారణాలు సరిపోతాయి. కనీసం ఈ విషయాల మీద వివరణ కూడా ఇవ్వక పోవడం, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు ప్రకటించక పోవడం మరింత బాధాకరం. Thank you for your comment.

    రిప్లయితొలగించండి
  4. క్రిష్ణ గారు,

    టపా నచ్చినందుకు సంతోషమండి. నెను కొసమెరుపులో చెప్పినట్లు, ఏదో మొక్కుబడి స్టేట్ మెంట్లు ఇవ్వడం ఒక అలవాటుగా మారిపోయింది.

    రిప్లయితొలగించండి