21, డిసెంబర్ 2011, బుధవారం

తెలంగాణా సమస్య(Part 2) - అసలేం జరుగుతుంది !!!

అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా 09 డిసెంబరు 2009 నుండీ పరిస్థితులు చాలా వేఘంగానూ, నిర్ణయాత్మకంగానూ మారాయి. ఎవరూ ఎవర్నీ నమ్మకపోవడం, ఎవరి వాదానికి వాళ్ళు 100% కమిటవ్వడం, పరిస్థితులు సంక్లిష్టంగా మారడం.. ఇదంతా అర్థం చేసుకోవాలంటే డిసెంబరు 2009 నాటి పరిస్థితుల్నీ తదనంతర పరిణామాలనీ చాలా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

07 డిసెంబరు 2009: అన్ని పార్టీలు తెలంగాణా ఏర్పాటుకి సైధ్ధాంతికంగా మద్దతు ప్రకటించాయి. కనీసం అభ్యంతర పెట్టడమైతే చెయ్యలేదు.
09 డిసెంబరు 2009: కేంద్ర ప్రభుత్వం, దాదాపుగా తెలంగాణా ఏర్పాటు చేసినంత ప్రకటన ఇచ్చింది.
10 - 23 డిసెంబరు 2009: సీమాంధ్ర ప్రతినిధుల రాజజీనామాలు(దాదాపు అన్ని పార్టీల వాళ్ళూ), సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రజారాజ్యం పార్టీ తన విధానాన్ని సమైక్యవాదిగా మార్చుకోవడం
23 డిసెంబరు 2009: విస్తృతమైన సంప్రదింపులు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం
24 డిసెంబరు 2009 - 05 జనవరి 2010: మళ్ళీ తెలంగాణా ఉద్యమం
ఫిబ్రవరి 2010 - జనవరి 2011: ఉద్యమంలోనూ, ఉద్యమాన్ని వ్యతిరేకించే వాళ్ళలోనూ కొంత స్తబ్దత, శ్రీక్రిష్ణ కమిటీ అభిప్రాయ సేకరణ చెయ్యటం
జనవరి 2011 నుండి: మళ్ళీ కేంద్రం ఎటూ తేల్చక పోవటం, ఉద్యమం ఊపందుకోవటం, ఆవేశాలూ, సమ్మెలూ, సవాళ్ళూ, ప్రతిసవాళ్ళూ ఇంతే కాకుండా అర్థం లేని రాజీనామాలూ వాటికి అంతకంటే అర్థంలేనీ, అర్థం కాని తిరస్కరణలు.

ఈ దశలన్నీ చూసినప్పుడు కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే:

1. డిసేంబరు 7 న ఏ అభ్యంతరమూ వెలిబుచ్చని సీమాంధ్ర ప్రతినిధులు మూడురోజుల తరవాత ఎందుకలా ప్రతిస్పందించారు?

డిసెంబరు 7 న పార్టీలన్నీ చెప్పిన దాని ప్రకారమైతే డిసెంబరు 9 ప్రకటన అంత ఆగ్రహం తెప్పించే విషయం కాదు. కాని తప్పకుండా సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో చాలా నిరసన వ్యక్తం అయ్యింది. నాదృష్టిలో ఆ నిరసన అసలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే, ప్రకటన చేసిన విధానం మీదే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఉన్న పరిస్థితుల్లో ఆప్రకటన రావడం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణా వాదుల పక్షపాతిగానూ, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకి విలువ ఇవ్వనట్టుగానూ కనిపించింది.

అలా అయితే మరి 7వ తారీఖున సీమాంధ్ర ప్రతినిధులు ఎందుకు ఒప్పుకున్నట్టు !! అసలప్పటికే దాదాపు అన్ని ముఖ్య పార్టీలూ తెలంగాణా ఏర్పాటుకి తమ మద్దత్తు ప్రకటించి ఉండటం ఒక రాజకీయ కారణమైతే, అసలు నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రజాభిప్రాయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటారు అప్పుడు చూసుకోవచ్చులే అనే అలసత్వం కారణం కావచ్చు.

2. చేసిన తప్పు దిద్దుకునే పనిలో భాగంగా విస్తృత స్థాయి చర్చలు జరగాలని కేంద్రం ప్రకటించింది. శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పాటు ఆ ప్రకటనకి కొనసాగింపే.

కమిటీ మాత్రమే కాదు ఇంకా ఈ ఈ పద్దతుల్లో విస్తృత చర్చలు చేస్తాము అని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి, కమిటీ రిపోర్టు తరవాత స్పష్టంగా స్పందించవలసింది కేంద్రమే. కనీసం ఒక రోడ్ మ్యాప్ అన్నా ఇవ్వాలి. ఏమీ చెయ్యకుండా సంవత్సరం పాటు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఇరువైపుల ప్రజల సహనానికి ఉండే హద్దుల్ని పరిక్షించటం కాకపోతే మరేంటి? సంతోషించాల్సిన విషయమెంటంటే, ఈ సహన పరిక్షలో రాష్ట్రప్రజలు చాలా వరకూ విజయం సాధించారనే చెప్పుకోవచ్చు (ఇరుప్రాంతాల వారు కూడా).

3. ఆసలు ఈ విషయం మీద తమకంటూ ఒక విధానం ఏర్పరుచుకున్న పార్టీలు ఏవేవి? అసలు తమ తమ పార్టీలని ఒక విధానం వైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు ఏవి?

వీటికి సమాధానాలు ఆలోచించగలిగితే జరుగుతున్న పరిస్థితులని సరిగ్గానే అంచనా వెయ్యగలం అనిపిస్తుంది.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

తెలంగాణా సమస్య(Part 1) - ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?


తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకడుగుతున్నారు? దేశం మీద ఈ అంశం ప్రభావం ఎలా ఉంటుంది? సమైక్య రాష్ట్రం మీదగానీ, రెండు ప్రత్యేక రాష్ట్రాల మీదగానీ దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది? అసలీ సమస్య ఇంత జఠిలంగా ఎందుకు తయారయ్యింది? ప్రాంతాల వారీగా కాకుండా అసలు ఈ విషయం మీద వివిధ పార్టీల ఆలోచనా విధానం ఏంటి? తప్పో రైటొ ఇప్పుడున్న పరిస్థితి నుండి మార్గాంతరాలేంటి? ప్రత్యేక రాష్ట్రం వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు?

అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ? నాకు వీలయినంత వరకూ నిష్పక్షపాతంగా(?) ఈ విషయం మీద నా ఆలోచనలు రాద్దామంటే, ఒక టపా సరిపోయేట్టులేదు. సరే వీలయినంతవరకూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకూ వరసగా టపాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు చెప్పి మంచి చర్చ చేస్తారని ఆశిస్తున్నాను.

ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?

అసలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక వాదనలూ, విశ్లేషణలూ చూస్తే స్థూలంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కి కారణాలు 5. ఈ కారణాలన్నిటినీ పరిశీలిస్తే, అర్థమయ్యేదేంటంటే, ఇందులో కొన్నేమో గణాంకాల ఆధారంగానూ, డాక్యుమెంట్ల ఆధారంగానూ విశ్లేషణ చెయ్యడానికి వీలయ్యేవీ, మరికొన్నేమో అలా వీలు కానివీ. ఇందులో కొన్ని ఎక్కువా కొన్ని తక్కువా అనేదేమీ లేదు నాదృష్టిలో. అన్నీ బలమైన కారణాలే. వీటిల్లో నిజానిజాల్నీ, అపోహలనీ బేరీజు వేద్దాం.

ఎవరికి వీలయిన గణాంకాలు వాళ్ళు తీసుకొచ్చి, మధ్యలో ఒక కారణం నుంచి ఇతర కారణాల వైపు చర్చని దారి మళ్ళిస్తూ కలగాపులగం చెయ్యటం అనేది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. మళ్ళీ మనమెందుకు అదే చెయ్యటం!! మనం అన్ని కారణాలనీ ఒక్కొక్కదాన్నీ విడివిడిగా, సరళంగా విశ్లేషిద్దాం.

1. తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం

ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన కారణమా కాదా అనేది కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, ముందు వెనకబాటుతనం ఉంది అని నిరూపణ అవ్వాలి, తరవాత వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడం వల్లే అని నిర్ధారింపబడాలి. ప్రభుత్వం వారి లెక్కలు గానీ లేదా అదే పనిగా ఈ విషయం కోసమే నియమించబడ్డ శ్రీక్రిష్ణ కమీటీ లెక్కలుగానీ చూస్తే 1956 తరవాత జరిగిన అభివృధ్ధిలో ఈ ప్రాంతం వెనకబడి లేదనేది కనిపిస్తుంది. స్థూలంగా వెనకబాటుతనం ఉన్నా అది అన్ని ప్రాంతాలలోనూ ఉంది. 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది.

2. ఆర్థికాంశాల్లోనూ, పరిపాలనాంశాల్లోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యం చెయ్యబడుతూ ఉంది

ప్రభుత్వ పరంగా జరిగిన కేటాయింపులూ, ఇతరత్రా వివరాలు చూస్తే ఈ కారణం కూడా పెద్దగా నిలబడలేదనే చెప్పొచ్చు. నీటి లభ్యత మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో ప్రైవేటు ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతవాసులకి మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువ ఉద్యోగాలు లభించిన మాట వాస్తవమే అయినా, అది ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధం లేని విషయమే. నీటి వనరుల విషయంలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఫలితాలు సాధించడం కంటే, ఈ ప్రాంతానికి వీలైన ఇతర రంగాల్లో నిధులు పెట్టి మంచి ఫలితాలు సాధించడమే మంచిది కదా ! ప్రకాశం జిల్లా గానీ, లేదా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గానీ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్నీ నిర్లక్ష్యం అనలేము కదా !

3. 1956 లో ఒకే రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చేసిన ఏర్పాట్లేవీ చిత్తశుద్దితో అమలు జరగలేదు కాబట్టి ఇక ముందైనా మధ్యేమార్గంగా చేసే ఏర్పాట్ల మీద ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం లేదు.

శ్రీక్రిష్ణ కమీటీ ప్రకారం చూసుకున్నా మరే ఇతర ఆధారాల ప్రకారం చూసినా ఒప్పందాలు సరిగ్గా అమలు చెయ్యబడలేదు అనేది మాత్రం స్పష్టం. అసలు ఆ ఒప్పందాల్లోని షరతులే తప్పు కాబట్టి అవి అమలు జరక్కపోయినా తప్పేంలేదు అనే వాదన అర్థ శతాబ్దం తరవాత ఇప్పుడు చెయ్యడం మాత్రం అర్థంలేని పని. ఒకవేళ ఇప్పుడేదైనా పకడ్బందీ ఏర్పాటు చేద్దామన్నా ఈ ప్రాంత ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిధ్ధంగా లేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే కదా !

కేవలం ఒప్పందాల అమలులో లోపాలవల్లే తెలంగాణా కోసం ఇంత పోరాటం చేస్తున్నారా ? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత పోరాటం ఎందుకు జరుగుతున్నట్టు ? మిగతా ఏవైనా కారణాలుండే ఉండాలిగా. అయితే వాటిని ఇదమిధ్ధంగా తేల్చడం గణాంకాలూ, డాక్యుమెంట్ల తో అయ్యేపని కాదు. కానీ అవేమీ తక్కువ చేసి చూడాల్సిన అంశాలేం కాదని నేను అనుకుంటున్నాను.

4. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకీ, ఆశలకీ, సమర్ధతకీ సరైన అవకాశాలు దొరకడం దుర్లభం అనే భావన

పైన చెప్పబడిన మొదటి రెండూ అంశాల ప్రకారం చూస్తే, ఈ భావన కలగడం ఎలా సాధ్యం ! కానీ ఈ భావనా, అభద్రతా చాలా బలంగానే ఉంది ఈ ప్రాంతంలో. ఏమై ఉండొచ్చు ? తెలంగాణా మీద మిగిలిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల అవకాశాలూ తగ్గి ఇటువంటి భావన ప్రబలే అవకాశం ఉంది. మొదటి రెండూ అంశాల్లో కూడా గణాంకాల ప్రకారం అంతా సవ్యంగానే ఉన్నా, ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇంత బలంగా ఉందంటే, బహుశా గణాంకాల్లోని న్యాయం ప్రజలకి అనుకున్నంతగా అందలేదేమో !!

5. ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది. పరిపాలనాపరంగా బానే ఉండి మిగిలిన వారికి నష్టం లేనప్పుడు ఎందుకివ్వకూడదు?

ఇదికూడా ఒక రకంగా బలమైన వాదనే. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉందనేది నిజమే. ఇక తేలాల్సింది, పరిపాలనా పరంగా బానే ఉంటుందా మిగిలిన వారికి ఏమైనా నష్టాలున్నాయా అనే రెండు విషయాలు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం ప్రకారం మంచిదేగానీ, ఒక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే దానికి పరిష్కారం కాదు. స్థానిక సంస్థలని రాజ్యాంగ ప్రకారం నడిపితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే ఆ పని సమైక్య రాష్ట్రంలో ఇప్పటివరకూ అనుకున్నంతగా జరగలేదు. అదట్లా ఉంచితే, దాదాపుగా 4 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పరిపాలనా పరంగా గానీ, వనరుల పరంగా గానీ బానే ఉంటుందనిపిస్తుంది.

ఏమీ నష్టం లేకుండానే మిగిలిన ప్రాంతాల్లో అంత వ్యతిరేకత ఎందుకుంటుంది? ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అటువంటి అవకాశాలు కల్పించడంలో సమైక్య రాష్ట్రం విఫలమవ్వడం వల్ల హైదరాబాదుని ఒక్కసారిగా ఒదులుకోవడం మిగిలిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా నష్టమే, అభ్యంతరకరమె. మిగిలిన అంశాల విషయానికొస్తే, నీటి విషయంలోగానీ, హైదరాబాదు నుండి సమైక్య రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్థిక వనరులనన్నిటినీ కోల్పోవడమంటే అది మిగిలిన ప్రాంతాలకి తప్పకుండా నష్టం కలిగించే అంశమే. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసిందేంటంటే, రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ మాత్రమే మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ అభివృధ్ధి జరుగుతున్నా ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం. కేవలం హైదరాబాదు మాత్రమే అభివృధ్ధి చెందడం అనేది తప్పైనా, ఇప్పుడు మనమున్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే.

ఇవి కాకుండా ఇంకేవైనా కారణాలు నేను గమనించలేకపోయున్నా, ఈ కారణాలని అర్థం చేసుకోవడంలో పొరపాట్లున్నా మీ అభిప్రాయాలు చెప్పండి.


హిందూయిజం అంటే ??


ఇదేమీ బాగా ఆలోచించి ఆ ఆలోచనలని చర్చకి పెట్టే టపా కాదులెండి. ఈ కింది ఫోటో చూడగానే మనసుకి అనిపించింది రాస్తున్నానంతే. వెయ్యి సంవత్సరాల నుండీ ముస్లీములు హిందువులని అణగదొక్కారనీ, హిందువులు ముస్లీంల మీద ఆధిపత్యం కోసమే ప్రయత్నిస్తున్నారనీ, ఈ దేశం హిందువులది మాత్రమే అనీ, కాదు అందరిదీ అనీ రకరకాల వాదనలు చేసే వాళ్లంతా ఇదొక్కసారి చూస్తే తమ వాదనలని సరిచూసుకునే అవకాశం దొరుకుతుందనే ఆశ, అంతే. ముఖ్యోద్దేశ్యం మాత్రం ఈ ఫోటోని అందరితో పంచుకోవడమే.





సుప్రీం కోర్టు చెప్పినట్టు, హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమే అంతకంటే ఇంకేమీ కాదు.

మిత్రుడు సీతారం ఫేస్ బుక్ లోనుండి తీసుకున్నాను ఫొటొ. Thank you Sitaram RNV. You made my day :)

19, సెప్టెంబర్ 2011, సోమవారం

పిల్లి అంతరంగం - గోడెందుకెక్కాల్సొస్తుందంటే...

గోడకి ఇరువైపులా ఉన్న గొర్రెలు అవతలి వైపు వాటిని తోడేళ్ళని ప్రగాఢమైన నమ్మకంతో దూసుకెళ్ళిపోతా ఉంటాయి.

ఇంతలో ఒక పిల్లి, బాబూ ఈ వైపు కూడా తోడెళ్ళున్నాయి అలాగే ఆవైపు కూడా కొన్ని తోడేళ్ళున్నాయి మనం జాగ్రత్తగా ఆలోచించి రెండు వైపులా ఉన్న గొర్రెల్ని కాపాడుకోవాలి, అని చెప్తే..

చస్స్.. ఇవన్నీ అయ్యేపనులు కాదు, అవతలి వైపు తోడేళ్ళున్నాయా లేదా సూటిగా చెప్పు అంటాయి.

ఉన్నాయి కాబట్టి, సత్వర పరిష్కారం ఏంటంటే, అవతలి వైపు వాటినన్నిటినీ వధిస్తే ఇటువైపున్న అమాయక గొర్రెలం మనమంతా హాయిగా ఉండొచ్చు అని తీర్మానించినంత పని చేశాయి. అవతలివైపు గొర్రెలు కూడా ఉన్నాయి మొర్రో అని పిల్లి నెత్తినోరూ బాదుకుంటుంటే..

కొన్ని తెలివైన గొర్రెలొచ్చి.. అవతలి వైపు తోడేళ్ళొచ్చి మనలో కొన్ని గొర్రెల్ని తిన్నాయా లేదా ? అని అడిగాయి.

అవును అంది పిల్లి పాపం.

అవతలి వైపు గొర్రెలుంటే ఆ తోడేళ్ళు ఇటెందుకొస్తాయే తెలివిలేని పిల్లీ. అవతలివైపువన్నీ తోడేళ్ళే అని నీలాంటి మేతావి బుర్రలకి అర్థంకాదులే నోర్మూసుకోని చెప్పింది చెయ్ అంటాయి.

పాపం పిల్లి ఏం చెయ్యాలి ? గోడెక్కితేనే కదా నిజం తెలిసేది ? సరే, నిజం తెలుకుందామని పిల్లి గోడెక్కింది. అంతే.. రెండూ వైపులా ఉన్న తోడేళ్ళు విషయం పసిగట్టి, అదుగో ఆ పిల్లి చూశావా ఎవరు గెలిస్తే ఆవైపు దూకటానికి వీలుగా గోడెక్కింది అని గొర్రెల్ని నమ్మించబూనుకున్నాయి.

పిల్లి ఏం చెయ్యాలి ? కనీసం కొన్ని గొర్రెల్నయినా గోడెక్కించాలి ? అప్పటి వరకూ.. ఏ వైపైతే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయే ప్రమాదంలో ఉందో ఆ వైపు మద్దత్తు తెలుపుతూ వ్యవహారాన్ని కొద్దిగా ఆలస్యం చెయ్యాలి. నాకు రెండూ వైపులా తెలుసు కాబట్టి నేను చెప్పేదే న్యాయం అని పిల్లి నమ్మిందనుకోండి.. దానర్థం.. పిల్లి కూడా తోడేలుగా రూపాంతరం చెందుతున్నట్టు. గొర్రెలు గోడెక్కి చూసేదాకా తన ప్రయత్నాలు అలాగే కొనసాగించడమే న్యాయం.

అదండీ పాపం.. మన పిల్లి గారి పిచ్చి లాజిక్కు  ;)   

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నరేంద్ర మోడీ.. నరేంద్ర మోడీ.. so.. what's the deal !!

నరేంద్ర మోడి, ఈ పేరే ఒక సంచలనం. చాలా మంది దృష్టిలో హీరో గానో, లేకా అతి దుర్మార్గుడిగానో ముద్ర వేసుకున్నాడు అనడంలో సందేహమే లేదు. దేశ రాజకీయాలనీ, భావోద్వేగాలనీ అత్యంత ప్రభావితం చెయ్యగల అతికొద్ది పేర్లలో ప్రస్తుతం ఇది అతి ముఖ్యమైన పేరు. గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళనీ, అంతే గుడ్డిగా సమర్ధించేవాళ్ళనీ ఇంత మందిని తయారు చెయ్యగలిగాడంటే ఖచ్చితంగా ప్రతిభావంతుడే. నిజా నిజాలూ ఏంటి అనేదాని మీద బోలెడు వాదనలూ దృక్కోణాలూ.. వీటి మధ్యలో మనమేం అర్థం చేసుకోవాలి? నేను చదివిన దాన్నిబట్టీ అర్థం చేసుకున్నదాన్నిబట్టీ ముఖ్యంగా నాకు అర్థమయ్యిన విషయాలేంటంటే:

  1. 2002 లో జరిగిన మారణకాండ కి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ప్రోత్సాహం అందించాడనీ, కావాలనే ఒక వర్గానికి వత్తాసు పలికాడనీ ఉన్న ఆరోపణల్లో కొంత క్రెడిబిలిటీ ఉందనిపిస్తుంది.
  2. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా అభివృధ్ధి సాధించాడు. (కొన్ని గణాంకాలూ, మీడియా అభిప్రాయాలూ అన్నింటికంటే ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు చూసిన మీదట ఏర్పడిన అభిప్రాయం )
  3. సమర్ధవంతమైన, బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్న రాజకీయవేత్త (వ్యక్తిగతంగా డబ్బు కోసం అవినీతికి పాల్పడడు అని జరుగుతున్న ప్రచారంలో కూడా కొంత క్రెడిబిలిటీ కనిపిస్తుంది)

ఇంక మోడీ గురించి అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు వేరు వేరు దృక్పధాల్లో వ్యక్తం చేస్తున్నారు. కొంత మందేమో మాకు మొదటి దాంట్లో మోడీ ప్రవర్తన ఎంతమాత్రం సమ్మతంకాదు కాబట్టి మిగిలిన రెండూ అంశాలతో మాకు పనిలేదు అనే వాళ్ళు. ఇంకొందరేమో..ఏదో 2002 లో జరిగి పోయింది. మిగిలిన రెండు అంశాల్లో బానే ఉన్నాడుగా దాన్ని బట్టి చూద్దాం అంటారు.
పై రెండు వాదాలతో పెద్దగా పేచీ లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. పరిస్థితులనిబట్టీ , అవగాహననిబట్టీ, దృక్పధాలు మారుతుంటాయి. అది వాళ్ళ అభిమతానికే వదిలేయవచ్చు. నాకొచ్చిన చిక్కల్లా పై రెండూ కాకుండా వేరే వాదనలు చేసే వాళ్ళతోనే..
  • మొదటిదాంట్లో మోడీ చేసింది సరైనదే. మాకు ఆవిషయం మీదే మోడీ గొప్ప అంటారు.
  • మొదటి కారణం వల్ల మాకు మోడీ నచ్చడు కాబట్టి, అసలు మోడీ ఇతర సుగుణాలని గుర్తించటం మాట అటుంచి చూడటానికీ, వినటానికీ కూడా మేం ఒప్పుకోం అంటారు. అసలవి లేనే లేవని వాదిస్తారు. వీళ్ళ వాదనలోని డొల్లతనాన్ని మోడీకి ఒకరకమైన మద్దత్తుగా ఉపయోగించాలనుకునే వాళ్ళూ ఉన్నారనుకోండి.

ఇంత గందరగోళం మధ్య స్పష్ఠత రావాలంటే ఆలోచించాల్సినవిషయాలు చాలా ఉన్నాయి. ఏ సమర్ధతా లేకుండానే ప్రజలు ప్రతిసారీ మోడీని గెలిపిస్తున్నారా? గెలిపిస్తున్నారు అంటే, ప్రజలు 2002 మారణకాండ విషయంలో మోడీ పాత్ర లేదని నమ్మినట్టేనా ? మారణకాండ విషయంలో మోడీ వైఖరికి ప్రజలు మద్దత్తు ఇచ్చారనా ? మారణకాండ విషయంలో తప్పు జరిగినప్పటికీ, మిగిలిన విషయాల్లో మోడీ ప్రతిభా పాటవాలకి విలువిచ్చి గెలిపిస్తున్నారనా ? మారణకాండ విషయంలో వ్యతిరేకించినా, మోడీ లా మెరుగైన పరిపాలన అందించేవాళ్ళు లేకపోవడం వల్ల, అటువంటి ప్రత్యామ్నాయం దొరికేవరకూ ఇదే మంచిది అనుకొనా?
గుజరాత్ లో ప్రజలు మతాల వారీగా పూర్తిగా విడిపోయుండటం వల్లే ఇది జరుగుతుందా ? నా దృష్టిలో ఇది ఇంతకాలం సాధ్యం కాకపోవచ్చు. మతాలవారీ ఉన్మాదం కొన్ని సందర్భాలలో ఉంటుందనేది వాస్తవమే అయినా, ఇంత దీర్ఘకాలం అది అలాగే నిలిచిఉంటుందనేది నమ్మడమంటే నాకైతే, ఈ దేశ ప్రజల్ని అవమానించడమే అనిపిస్తుంది.
పై ప్రశ్నల్లో మనకీ, మన వాదనలకీ ఏది అనుకూలంగా ఉంటే దాన్ని నమ్మటం సహజంగా చాలా మందికి ఉండే బలహీనతే. అందులో తప్పులేదు. ఆ బలహీనతని అధిగమించేలా ప్రజని చైతన్య పరచడం సరిగ్గా చెయ్యగలిగే నాయకుల్ని తాయారు చేసుకోలేకపోవడం మనందరి ఫెయిల్యూర్. సరే.. నేను చెప్పాలనుకుంటున్న దాన్ని సూటిగా చెప్పాలంటే:
మోడీ వ్యతిరేకులకి:
  • ఒకవేళ 2002 మారణకాండలో మోడీ వైఖరి గనుక చాలా మంది ఆరోపించినట్లుగా ఉండి ఉన్నట్టయితే, ఒక సమాజంగా మనం దాన్ని నిర్ద్వందంగా గర్హించాల్సిందే. అదే సమయంలో మోడీ అందించే పరిపాలనకి ధీటైన ప్రత్యామ్నాయం మేమివ్వగలం అని మోడీని వ్యతిరేకించేవాళ్ళు ప్రజల్లో విశ్వాసం నింపగలగాలి. అప్పటివరకూ మోడీ చేసే పరిపాలన గురించి నిష్పక్షపాతంగా సద్విమర్శలు చేస్తూ, 2002 లో మోడీ చేసింది ఎంత ప్రమాదకరమైనదో, అటువంటి వాటిని ఎందుకు వ్యతిరేకించాలో ప్రజలకు వివరించాలి.
  • మోడీ చేస్తున్న పరిపాలననీ అభివృధ్ధినీ లేదన్నట్టుగా ప్రవర్తించడం మానుకోవాలి.

 మోడీని సమర్ధించే వారికి:

  • 2002 ని వదిలేసి, పరిపాలన విషయంలో బావుంది కదా, దాని మీదే మోడీ ని అంచనా వేద్దాం అనేది సరైన ఆలోచన కాదు. ఒకవేళ అలా జరగాలంటే, మోడీ నిజాయితీగా, 2002 లో తన మీద ఆరోపించబడుతున్న విధమైన ఆలోచనలు, దుశ్చర్యలూ తప్పు అని నమ్మి దాన్ని ప్రజలకి నమ్మకంకలిగేలా పశ్చాత్తాపం ప్రకటించగలిగితే, అప్పుడు కుదురుతుంది.  
  • జరిగిన అభివృధ్ధి మాటున 2002 ఘాతుకాలని సమర్ధించే ప్రయోగాలు మానుకోవాలి.
------------------------------------------------------------------
మారణకాండకి వత్తాసు పలికిన విషయంలో నేనైతే మోడీకి బద్దవ్యతిరేకిని. వ్యతిరేకించినంత మాత్రాన మోడీలో ఉన్న మిగతా మంచి లక్షణాలని చూడలేక కళ్ళుమూసుకోవడం మాత్రం నా వల్ల అయ్యే పనికాదు. మిగతా అంశాల్లో బానే ఉన్నాడుకదా అని, 2002 ప్రవర్తనని ఉదారంగా మర్చిపోవడమూ లేదా అసలదేమీ జరగలేదన్నట్టు నటించడమూ నావల్ల అయ్యే పనికాదు.

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

అన్నా హజారే ఉద్యమం-అసలు కారణాలు-గుణపాఠాలు

ఈ ఉద్యమం అవసరం లేదనీ,సరైన దారిలో నడవట్లేదనీ, రాజకీయ నాయకులు దీన్ని కూడా ఎలాగోలా నీరుగారుస్తారనీ అనేక సందేహాలూ, దీని వల్లైనా కొంత మేలు జరుగుతుందనే ఆశల మధ్య దేశాన్ని ఉర్రూతలూగించిన ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు మనం గానీ మన రాజకీయ వ్యవస్థ గానీ అర్థం చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల పొరపాట్లున్నా మొత్తం మీద ఈ ఉద్యమం చాలానే మంచి ఫలితాల్ని సాధించిందనేది కాదనలేని విషయం. ఈ ఉద్యమాన్నీ, కారణాలనీ, ఫలితాలనీ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఒక విజయంగానో లేకా ఒక అనుకోని పరిణామంగానో మాత్రమే చూస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.

ఈ ఉద్యమం సాధించిన మంచి ఫలితాలు:
  1. అవినీతి మీద ప్రజల్లో ఉన్న ఏవగింపూ, ప్రజల దృష్టిలో ఈ సమస్యకున్న ప్రాధాన్యతా చాలా ఎక్కువ అనేది స్పష్టంగా బయటకొచ్చింది  
  2. వివిధ కారణాల వల్ల సామాజిక చైతన్యం అంతగా కనపరచని అనేక మందిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది 
  3. జాతీయ స్థాయిలో అవినీతి అనే సమస్యని ఎదుర్కోవడానికి ఎంచుకోవలసిన మార్గాలూ, సత్వర చర్యలూ ఏంటనే చర్చ ప్రారంభమయ్యింది
  4. ఒక పటిష్ఠమైన లోక్ పాల్ చట్టం తయారవ్వడం ఖాయంగా కనిపిస్తుంది
 ఈ ఉద్యమం ఇంతగా సఫలమవ్వడానికి ముఖ్య కారణం ప్రజల మద్దత్తు. జనలోక్ పాల్ బిల్లు కోసమే ఇంత మద్దత్తు వచ్చిందా ? హజారేకి మద్దత్తు తెలిపిన ప్రజలందరూ నిజంగా జనలోక్ పాల్ బిల్లు అవినీతిని అంతం చేసే ఏకైకమార్గంగా నమ్ముతున్నారా ? ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజా స్పందనకి కారణాలేంటి ? ఎన్నో మంచి ప్రయత్నాలకి అనుకున్నంతగా స్పందించని ప్రజలు ఈ ఉద్యమానికి ఎందుకు ఇంతలా స్పందించారు ? ఉద్యమం నడిపేవాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ఠ వల్లే ప్రజలకి నమ్మకం కుదిరిందా ? అవినీతి విషయంలో పరిష్కారాల మీదా వాటిల్లో హజారే బృందం సూచించినదే అత్యుత్తమమైనదనే అవగాహన మద్దత్తుదారులకి ఏర్పడిందా ?
అనూహ్యమైన ఈ స్పందన కేవలం లోక్ పాల్ చట్టం, అదీ హజారే బృందం సూచించిన జనలోక్ పాల్ కోసమే అని నాకైతే అనిపించట్లేదు. ఈ స్పందన ఎన్నో లోతైన విషయాల్ని సూచిస్తుందనిపిస్తుంది.

ప్రజాస్పందనకి అసలు కారణాలు:
  1. రాజకీయ నాయకుల మీదా, పార్టీల మీదా ప్రజల్లో ఉన్న అపనమ్మకం  
  2. పై స్థాయిల్లో జరిగే అవినీతిని అంతం చేసే ఒక శక్తివంతమైన నియంత(దాదాపుగా) అవసరం అనే నిస్పృహ
  3. సుప్తచేతనావస్థలో ఉన్న మధ్యతరగతి సామాజిక చైతన్యానికి సరైన అవకాశాలు లేకపోవడం
  4. విలువల్లేని రాజకీయాలూ, వినే లక్షణం లేని పరిపాలనా వ్యవస్థ మీదా ప్రజల్లో గూడుకట్టుకున్న నిరసన
  5. నత్తనడక నడిచే న్యాయ వ్యవస్థ మీద ఉన్న కసి.
ఇలాంటి అనేక లోతైన కారణాల బాహ్య స్వరూపమే ఈ ఉద్యమానికి లభించిన స్పందన. అంతిమంగా ఏం జరిగిందనేదాన్ని కాసేపు పక్కనబెట్టి, ఉద్యమం దాని తీరుతెన్నులూ పరిశీలించినప్పుడు కొన్ని పొరపాట్లూ ప్రమాదకర పోకడలూ మౌలికమైన తప్పులూ కనిపించాయనడంలో తప్పులేదు.

ఉద్యమం లో పొరపాట్లు:
  1. ప్రజాస్వామ్యంలో మనకేంకావాలో మనమేం అనుకుంటున్నామో చెప్పే హక్కు ప్రజలకెప్పుడూ ఉంటుంది. దాన్నెవరూ కాదనలేరు. కాకపోతే, తాము చెప్పిందే జరిగితీరాలనీ, తామే దేశప్రజలందరి ఆలోచనలకీ ప్రతినిధులమనే స్థాయికి ఉద్యమం వెళ్ళుండకూడదు.
  2. అసలు జన లోక్పాల్ గురించీ, అవినీతిని కట్టడి చేసే మార్గాల గురించీ జరిగే పోరాటం కాస్తా రాజకీయ వ్యవస్థకీ, పౌర సమాజానికీ జరుగుతున్న యుద్ధంలా మారుండకూడదు
  3. ఎన్నో లోపాలుండవచ్చు కానీ, మనకందరికీ అత్యంత విలువైనది మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది విస్మరించకూడదు.
ప్రభుత్వం వైపు నుంచి తప్పులు/పొరపాట్లు:
  1. హజారే బృందంతో కలిసి చట్టాన్ని డ్రాఫ్ట్ చెయ్యబోవడం. తరవాత పార్లమెంటరీ వ్యవస్థ గొప్పదనం గురించి గొతు చించుకున్న ప్రభుత్వానికి ఈ బుద్ధి ముందే ఉండాల్సింది.
  2. హజారేని అరెస్ట్ చెయ్యడం, ప్రజాస్వామ్యం గురించీ రూల్ ఆఫ్ లా గురీంచీ తమకవసరమైనప్పుడు మొసలి కన్నీరు కార్చే ప్రభుత్వానికి ఈ పని చేసేటప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ ?
రాజకీయ వ్యవస్థ ఫెయిల్యూర్:
  1. అసలు ఇంతమంది రాజకీయ వెత్తలుండీ ఇంత అత్యవసరమైన సమస్య కళ్ళముందున్నప్పుడు, ఏదో ఒక రాజకీయ శక్తే ఈ ఉద్యమం ఎందుకు చెయ్యలేదు ? 
  2. తీరిగ్గా వచ్చి హజారే ఆరోగ్యం, పార్లమెంట్ సార్వభౌమత్వం గురించి చెప్పడం కాకుండా అన్ని పార్టీలూ కలిసి లోక్ పాల్ చట్టం గురించి మంచి ప్రతిపాదనని ఎందుకు ప్రజల ముందు పెట్టలేక పోయారు? 
  3. ప్రజల్లో రాజకీయ వ్యవస్థ మీదా, నాయకుల మీదా ఇంత అపనమ్మకం, అసహనం, వ్యతిరేకతా ఉందనే విషయాన్ని ఎందుకు గమనించలేక పోయారు ?
పౌర సమాజం ఆలోచించుకోవాల్సిన విషయాలు:
  1. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం ఉన్నా ఎందుకు మనల్నెవరూ పట్టించుకోలేదు ? వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తేతప్ప మన అభిప్రాయాల్నీ ఆలోచనల్నీ రాజకీయ పార్టీలు ఎందుకు గమనించ లేక పోయాయి ?
  2. మనమసలు ఈ వ్యవస్థలో పాల్గొంటున్నామా ? రాజకీయాల్ని నిందిస్తూ తప్పించుకు తిరుగుతున్నామా లేదా ?
  3. ఆర్థికంగానూ, విద్య పరంగానూ మనం పొందిన ఉన్నతిని, మేధోపరంగానూ, సామాజికంగానూ ఈ దేశానికి అందిస్తున్నామా లేదా ?
  4. మనకి సరైనది అనే విషయాలకొచ్చేసరికి పద్దతులూ, చట్టాలూ అన్నీ వదిలేసి Mob Justice మాత్రమే సరైనది అనేలా ఆలోచించినప్పుడు మనం మేధోపరంగా ఏ స్థాయిలో ఉన్నట్టు ?
ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ వ్యవస్థ నేర్చుకోవలసిన గుణపాఠాలు చాలానే ఉన్నాయి. వాటిని సరైన రీతిలో నేర్చుకోలేక పోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థకీ ప్రమాదమే. ఏదో సాధించామనో, ఇంత చేసినా ఏమీ జరగలేదనో ఆలోచన చెయ్యకుండా సరైన రీతిలో దేశ రాజకీయాల్ని అర్థం చేసుకొని అందులో భాగస్వాములవ్వాల్సిన అవసరాన్ని పౌర సమాజం ఇంకా గుర్తించక పోతే అప్పుడొస్తుంది ప్రజాస్వామ్యానికీ, పార్లమెంటరీ వ్యవస్థ కీ అతిపెద్ద ప్రమాదం.
 .

19, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు - సుశాలమ్మ

రాజశేఖర రెడ్డి చనిపోయిన మొదట్లో కొంతమంది గ్రామీణ మహిళలతో మాట్లాడినప్పుడు నున్ను బాగా ఆలోచింపజేసిన ఒక సందర్భం ఇది.

నేను మాట్లాడిన వారిలో అందరూ పేదలు లేకపోతే నిరుపేదలైన వాళ్ళే. దాదాపుగా నిరక్షరాస్యులే అనుకోవచ్చు. అన్ని పధకాలూ అందుతున్నాయా? మీ దృష్టిలో ఎలాంటి పధకాలైతే మీకు బావుంటుంది? ఏ విషయాల్లో మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు లాంటి ప్రశ్నలడుగుతూ విషయాలు అర్థం చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమది.

పింఛన్లూ ఇంకా ఇతర పధకాలూ సరిగ్గా అమలవ్వట్లేదనీ, YSR ఉన్నప్పుడు బాగా అమలయ్యేవనీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడున్నాయనకూడా అన్నీ చేస్తాను, చేస్తున్నాము అనే చెప్తున్నారు కదా ఏంటి ఇబ్బంది అని అడిగితే, అలాగే చెప్తున్నారు గానీ మా చేతికి మాత్రం అందట్లేదు అన్నారు.

సరే వీళ్ళు చెప్తున్నదాంట్లో కొంత నిజమూ కొంత వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతని తెలియజేసే ఉద్దేశ్యమూ ఉందని నాకు అనిపించి.. సరే మరి ఎలా చేస్తే పధకాలు సరిగ్గా అమలవుతాయి అని అడిగా. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తే అవుతాయన్నారు.

మరి సోనియాగాంధీ చెయ్యనంటుంది కదా, ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో అది ఆలోచిద్దాం అన్నాన్నేను. అప్పుడొచ్చింది ఒక బుల్లెట్లాంటి సమాధానం:

ఏందబ్బాయ్ నువ్వు చెప్పేది ? ఏందామి జేసేది బోడి.. ఆమిని జేసిందే మేవయితే ! ఆమినిజేసినోళ్ళం ఆయబ్బాయిని జెయ్యలేమా ?

ఈ ప్రజాస్వామ్యంలో తన సత్తా ఏంటో, తనేం చెయ్యగలదో ఎంత స్పష్టంగా చెప్పిందీ! తన శక్తి గురించీ తన పాత్ర గురించిన స్పృహ ఏంత స్పష్టంగా ఉందీమెలో !!

నేను: నీ పేరెంటమ్మా ?
సుశాలమ్మ: సుశాలమ్మ
నేను: ఉపాధి హామీ పనులందుతున్నాయా?
సుశాలమ్మ: అందుతున్నాయి. మా వూళ్ళో చానా మంది యెల్తన్నారు
నేను: ఎన్నిరోజులెళ్ళావ్ ఈ యేడు?
సుశాలమ్మ: నాకుండదు. 60 సం. దాటిన నాబోటి ముసలొళ్ళకి కాదు అది వయొసోళ్ళకే. మా కోడళ్ళు కొడుకులూ యెల్తన్నారు.
నేను: అక్కడ పనిజేసే వాళ్ళ వస్తువులూ, పిల్లల్ని చూసుకోటానికి నీ లాంటి ముసలోళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు పని రూలు ప్రకారం. నీ లాంటోళ్ళని తీసుకొని వెళ్ళి ఈ సారి అడుగు.

వోటెయ్యండి బాబూ అని చెప్పినప్పుడు.. ఆన్ లైన్లో వోటేసే పద్దతి పెట్టాలి. అన్నీ ఇంత కష్టంగా ఉంటే ఎవరేస్తారు? నేనొక్కణ్ణీ వేసినా రాజకీయ రాజకీయ పార్టీలు వోట్లు కొనుక్కుంటారు. మనమెంత చించికున్నా మనం మార్చలేము ఈ దేశాన్ని.అసలు ప్రెసిడెన్షియల్ సిస్టం పెట్టాలి మన దేశంలో. ప్రపోర్షనల్ రిప్రసెంటేషన్ ఉండాలి.. లాంటి సమాధానాలిచ్చిన ఎంతోమంది నాకు ఒక్కసారిగా గుర్తొచ్చారు.

వివిధ కారణాలతో వోట్లెయ్యకుండా ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్ని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళ ని చూసినప్పుడు కలిగే అసహనం, నిరుత్సాహం ఒక్కసారిగా పెనుగాలికి కొట్టుకుపోయింది. మన ప్రజాస్వామ్యానికి ఇంకేం భయం లేదు. సుశాలమ్మ లాంటి పౌరులున్నారు.. ఇంక మన పని మనం ధైర్యంగా చెయ్యడమే మిగిలింది అనిపించింది. రాజ్యాంగ నిర్మాతలు సామాన్య ప్రజల మీద పెట్టిన నమ్మకాన్ని వీళ్ళు వమ్ము కానీయరు. ఈ సుశాలమ్మే మన ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు అనిపించింది.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే ఊరికి వెళ్ళినప్పుడు:


నేను: సుశాలమ్మా.. ఏంది సంగతులు ?
సుశాలమ్మ: అంతా బాగానే ఉందయ్యా. ఉపాది హామీ పనిస్తన్నారు నాక్కూడా
నేను: ఒహ్హో.. సామాన్యురాలివిగాదు.. ఏమన్నారు?
సుశాలమ్మ: మాక్కూడా ఇవ్వమని అడిగాం.. రూల్స్ లేవన్నారు. వస్తువులూ పిల్లల్నీ కనిపెట్టుకునుటానికి మాక్కూడా ఇవ్వాలి పని. అది రూలు అంటేనూ.. ఆయన నవ్వి..అబ్బో సుశాలమ్మో నీ రూల్స్ తో మేం పళ్ళేములే గానీ పనే ఇస్తాంలే అని పనిలో పెట్టుకున్నాడు.
నేను: నాయకురాలివయిపోయావ్ అయితే వూళ్ళో :)
సుశాలమ్మ: ఊరుకోబ్బాయ్.. ఇప్పుడుకే మా మనవళ్ళు కోడల్లు జోకులు జేత్తన్నారు నామీద
నేను: ఏమని ?
సుశాలమ్మ: సోనియాగాంధీ అని పేరు బెట్టారు నాకు.
నేను: ఛస్స్.. ఆ పేరు నీకెందుకు. సోనియాగాంధీ నే ఉంచాలో ఊడబెరకాలో డిసైడ్ చేసేది నువ్వయితె. నేజెప్తాలే ఆళ్ళకి నువ్వంతకంటే పవర్ ఫుల్లని :))

అవును, మన ప్రజాస్వామ్యానికి ఈ సుశాలమ్మే పెద్ద దిక్కు. జై హో సుశాలమ్మ..


8, ఆగస్టు 2011, సోమవారం

వాళ్ళ సరదా వాళ్ళిష్టం మధ్యన నా ఏడుపేంది? నేనంత కూల్ కాదు మరి, ప్చ్..

హైదరాబాద్ లో టమాటా ఫెస్టివల్ జరుపుకున్నారంట కుర్రాళ్ళు. స్నేహితుల దినం సందర్భంగా.. జీవితం మళ్ళీదొరకదని ఈ మధ్యే తెలుసుకున్న పిల్లగాళ్ళు వీళ్ళంతా. మనకున్న పిచ్చి చాలదన్నట్టు ప్రపంచంలోని పిచ్చినంతా ఈ ఉన్న ఒక్క జీవితంలోకి ఎక్కించేసుకోవాలనే సరదా వీరిది పాపం. అసలు జీవితమనేదే ఒకటుందని తెలియని కోట్ల మంది ఉన్న సమాజంలోని వనరుల్ని వాడుకుని మెరుగైన జీవితం అనుభవిస్తున్న అతికొద్దిమందిమి మాత్రమే తామనే స్పృహ వీళ్ళకి లేనట్టుంది.


సంస్కృతీ, తొక్క లాంటి వాటి గురించి పక్కనబెడితే.. అసలు తినే పదార్ధాలని కొంతమంది సరదాలకోసం వాడుకోవడం పబ్లిగ్గా కొన్ని టన్నుల టమాటాలను వ్యర్ధం చెయ్యడం మన సమాజంలో చెయ్యతగిన పనేనా ?

బానే ఉంది టమాటా రైతులకి ఇది మంచిదేగా అనుకోనూ వచ్చేమో. అలా అయితే మొత్తం సమాజం ఎలా ఉన్నా నాకనవసరం అని కొంతమంది సరదాగా దేశంలో ఉన్న ధాన్యమంతా తీసుకొచ్చి ఒక ఆట ఆడుకుంటే ?

ఇది చిన్న సరదానే కావచ్చు కానీ, చాలా లోతైన ప్రశ్నల్ని లేవనెత్తే అంశమే. సంబంధిత అధికారులు దీని మీద సరిగ్గా స్పందించుంటే బావుండేది. ఇది సరైన చర్య కాదు అని చెప్పే సందేశం ఇచ్చి ఉంటే బావుండేది అనిపిస్తుంది. మాలూలు జనాలమీదకి కాలుదువ్వే అధికార యంత్రాంగం తలుచుకుంటే ఏదో ఒక సెక్షన్ దొరకదూ.. కనీసం ఇది తప్పూ అని చెప్పడానికి !!

ఈ మధ్య ఎవడుజూసినా యూతో యూతో అని వెరెత్తి పోవడం ఒక ఫ్యాషనైపోయింది. మరి మన యూతేమో పరమ బూతులా ఉంది. ఒక పక్క అవినీతి, తెలంగాణా సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగాలూ, విద్య, వ్యవసాయం, న్యాయ వ్యవస్థ, అధిక ధరలు ఇన్నిటిమీద దేశం అట్టుడికి పోతుంటే అవేమీ తమకి పట్టనట్టు బీరు దినాలూ, టమాటా తద్దినాలు జరుపుకుంటున్న మన యూతు బూతుని చూస్తుంటే ఇదేనేమో కూల్ యూతంటే అనిపిస్తుంది మరి.

అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. జనాలు ఇట్లా తయారవుతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు ! సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా...

PS: Image taken from Sakshi news paper..

25, జులై 2011, సోమవారం

కొంచెం దూరాలోచన చేస్తే బాగుంటుందని...;)



ఈ వారాంతం బోల్డు మంది పిల్లలతో కలిసి హ్యారీ పోట్టర్ సినిమా చుశాను. అదేంటి రాజకీయాలు పక్కనబెట్టి వారాంతంలో ఇలా మస్తీ చేస్తున్నారా అనుకోకండి. నా లెక్కలు నాకున్నాయి మరి :)

రాజకీయాలంటే కొంచెం ముందుచూపుండాలి కదా.. ఇప్పటి వోటర్లు ఎలాగూ తెలివి మీరి పొయ్యారు.. ఇహ మనం కొంచెం దూరాలోచన చెయ్యాల్సిందే కదా..

ఈ సినిమాల మీద అంతగా ఆసక్తి లేకపోయినా పిల్లలకోసం వీటిని భరించే పేరెంట్స్ మనవల్ల ఫుల్లు హాప్పీస్.. హాయిగా వాళ్ళకిష్టమైన సినిమా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసే వాళ్ళ తో కలిసి చూసినందుకు ఫ్యూచర్ వోటర్స్ ఫుల్లు హాప్పీస్..

Jokes apart, the movie was good. This part is too good for a movie than the earlier sever parts. The fight between Mrs. Weasly and Bellatrix should have been taken better.. Mcgonnagal and Snape fight was too good. Neville disposing off the last Horcrux with the sword is like a cricket shot. The final dual between Harry and Voldemort is picturized very well. All I can say is... I am going to watch it again :)

22, జులై 2011, శుక్రవారం

నా యెదవతనంతో పోల్చుకుంటే నీ యెదవతనం ఒక లెక్కా !!

ఏందో ఈ తెలంగాణా వాదులూ, సమైక్య వాదుల పరిస్థితి చూస్తుంటే ఏదో సినిమాలో ఉండే ఈ డైలాగ్ తెగ గుర్తొచ్చేస్తుందీ మధ్య.

తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లో ఎన్ని సమస్యలున్నాయో, ఒకే రాష్ట్రంగా కలిసి ఉండడంలో ఎవరెవరికి ఏ ఏ ఇబ్బందులున్నాయో ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. బానే ఉంది. ఈ మొత్తం వ్యవహారం లో భావోద్వేగాలు శృతి మించాయనేది తెలిసిన విషయమే.

సామాన్య ప్రజల దగ్గరినుండీ నాయకుల వరకూ మొత్తం అందరూ ఒక రకమైన ఉన్మాదానికి లోనయ్యారనేది మరీ బాధాకరం. ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్న ఈ పరిస్థితుల్లోనుండి బతికి బయట పడాలంటే ఏంచేయాలనేది అందరూ ఆలోచించ వలసిన విషయం. రాజకీయ పార్టీలూ నాయకులూ ఆ పని చెయ్యట్లేదు. పోనీ కనీసం మేధావి వర్గం అన్నా చేస్తుందా అంటే అదీ లేదు. సరే మనోళ్ళు బ్లాగుల్లో బరికేస్తారేమో అనే ఆశ కూడా గల్లంతే. ఎక్కడ చూసినా ఎవరిక్కావలసింది వాళ్ళు గుడ్డిగా సమర్ధించుకోవడం, అవతలి వాళ్ళనీ దుమ్మెత్తి పోయడమే కనిపిస్తుంది. కావాలంటే చూడండి..

తెలంగాణా వాదులు భాగో అన్నప్పుడూ, నాలుకలు కోస్తాం అన్నప్పుడూ సమైక్య వాదులంతా తెగ గింజుకుని పదజాలాల గురించి బాధపడిపోతారు. తెలంగాణా మద్దత్తుదారులు నోరు మెదపరు, మెదిపినా పై పై మాటలు చెప్పి అందులో ఆవేదన అర్థం చేసుకొమ్మని కాకమ్మ కథలు చెప్తారు.

అసలు తెలంగాణా వాళ్ళకి కష్టపడే గుణంలేదు, మేమొచ్చాకే వీళ్ళకి నాగరికత అబ్బింది అని సీమాంధ్రులు వాగినప్పుడు తెలంగాణా వాదులేమో రోడ్లమీదా, మీడియాలోనూ శివాలెత్తి పోతారు. సీమాంధ్ర మద్దత్తు దారులేమో లోలోన సంతోషిస్తూ పళ్ళికిలిస్తూ పైకి గభీరంగా వేరే విషయాలు మాట్లాడుతారు.

వేర్పాటు వాదులు అన్నప్పుడో, ఏ కాశ్మీర్ సమస్యతోనో పోల్చినప్పుడు తెగ బాధ పడిపోతారు. బ్రిటీష్ వలస వాదంతో సీమాంధ్రులని పోల్చినప్పుడు మాత్రం అవ్. కదా అని నోరెళ్ళ బెడతారు. సీమాంధ్రులూ అంతే వేర్పాటు వాదం అనేప్పుడు ఏనొప్పీ ఉండదు, వలస వాదం అన్నప్పుడు రోషం పొడుచుకొస్తుంది మరి.

దాడులు చేస్తాం తరిమి కొడతాం అని ఒకళ్ళంటే, సాయుధ ముఠాలు తయారు చేస్తాం ఆత్మాహుతి దాడులు చేస్తాం అని ఒకళ్ళంటారు. మళ్ళీ మనం మామూలే.. ఒకసారి మౌనం మరోసారి ఆగ్రహం.. మనదేప్రాంతం అనేదాన్ని బట్టి.. ప్రాంతీయాభిమానం మరి !

ఇలా మన వెధవతనం పెంచుకుంటూ పోటీ పడుతున్నంతకాలం ఈ సమస్య తీరదు. కాకపోతే..మొత్తం అందర్నీ కలిపి వెధవతనం జాయింట్ విన్నర్స్ అని ఆ ఢిల్లీ వాళ్ళు జమకట్టేస్తారు :( అయినా పర్లేదులే.. ఆ ఢిల్లీ వాళ్ళ యెదవతనంతో పోల్చుకుంటే మన వెధవతనమూ ఒక వెధవతనమేనా !!!!

24, మే 2011, మంగళవారం

భారతీయులు మేల్కొనే ఉన్నారు. మీరు నిద్రపుచ్చకండి, సరేనా..:) (Updated with more comments from FB)

హిందువులు మేల్కోవాలి అనే టపా ఒకటి చూశాను. అర్చక, పౌరోహిత వృత్తులలో మనుషుల కొరత ఉంది దాన్ని ఎలాగోలా సరిచెయ్యాలి అనే అసలు విషయం తప్ప మిగతా టపా అంతా చాలా అసందర్భంగానూ, అర్థరహితంగానూ అనిపించింది. అదే విషయం ఆ టపాలో వ్యాఖ్యానిస్తే బ్లాగు రచయిత నా వ్యాఖ్యని ప్రచురించలేదు.

ఇదే టపా మీద కత్తి మహేష్ గారి ఫేస్ బుక్ లో ఒక మంచి చర్చ జరిగింది. ఆ చర్చని యదాతధంగా ఇక్కడ ప్రచురిస్తున్నాను. మీ అభిప్రాయాలు కూడా చెప్పండి.
---------------------------------------------------------------------------------------------
 
Kishore Kvn: ఇది బ్రాహ్మణుల కోసం బ్రహ్మణులు వ్రాసింది. కొన్ని చోట్ల మేము చాల గొప్పవాళ్ళం అంటాడు. ఇంకో చోట అన్యాయం అయిపోయాం అంటాడు. మేము గోప్పవాల్లమే కాని, అన్యాయం అయిపోయాం అంటాడు ఇంకో చోట. అందరికి వేప కాయ అంత ఉండే వెర్రి, మాకు వెలక్కాయ అంత ఉంటుంది. అదే... ఇందులోనూ కనిపిస్తోంది. నేను కూడా బ్రాహ్మనుడినే.. పుట్టుకతో. అది నా కూడా రావడం మానేసింది. బ్రాహ్మణ వ్రుత్తులకి ఇప్పుడు సాంఘిక గౌరవం లేదు. పురోహితులకి సంపాదించే అవకాశం ఉన్నా కూడా, ఎవరూ పిల్లనివ్వడం లేదు. గుళ్ళో అర్చకత్వం లాభసాటి గ లేదు.

గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సంఘం మలిచిందే అని సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు, మా వాళ్ళందరికీ మీరు తెలివైన వాళ్ళు, చదివితే వంట బడుతుంది అని సంఘం మాకు చెప్తూ వచ్చింది. అందుకే ఇంజినీరు అవాలన్నా, ఇంకోటవ్వాలన్నాడబ్బొకటే ఇబ్బంది. పరిణామ క్రమం లో పురోహితులుంటారు, అర్చకులు ఉండరు. గుళ్ళో దీపం పెట్టక పోయినా ఆయన అనుకున్నంత ఇబ్బంది ఏమి లేదు. మార్పు అనేది సాంఘిక లక్షణం. బ్రహ్మ విష్ణు వెనక్కేల్లిపోయి, షిర్డీ సాయి బాబా, అయ్యప్ప అంటూ కొత్త దేవుళ్ళు రాలేదూ? దానికి బ్రాహ్మడే అర్చకుడవక్కర్లేదు. ఏమిటో మీ చాదస్తం.
 
ఇప్పుడు కుండలు చేసే కుమ్మరికి, చెక్క పని చేసే వడ్రంగికి, కంసాలికి, క్షురకులకి ఇలా ఏ వృతుల వారికి కూడా దాని మీద ఆధార పడే పరిస్థితి లేదు. అందరూ చదువుకుని పట్నాలకి పోయి వేరే ఏదో పని చేసుకుంటున్నారు. గతం లో బ్రాహ్మలూ.. క్యాలెండరు తయారు చేసి, ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు పంటలు వెయ్యాలో, అధిక మాసలతో గణించి చెప్పి సంఘానికి సాయ పడుతూ వచ్చారు. జనానికి చదువులూ చెప్పారు. అలాగే, వైశ్య, కాపు, కమ్మ, మాల, మాదిగా, పాకీ ప్రతి వాళ్ళు సంఘం లో ఉంటూ సంఘానికి సాయపడ్డారు. సమాజం మారిపోయింది. చాతుర్వర్ణ వ్యవస్థ కి, మనువు సిధాంతాలకి ఇప్పుడు అర్థం లేదు. కూలి పని చేసినా, IT ప్రాజెక్ట్ చేసినా.. మనమందరం మనుషులం. అంతే.

Sai Rama Raju Kalidindi: ఆ ఆర్టిక‌ల్ నేను పూర్తిగా చదవలేదు, కానీ కొద్దిగా అర్ధం అయ్యింది. బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణత్వాన్ని వాళ్ళే వదిలేసారు, ఇంక వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? నాతో పాటు సమానంగా కూర్చుని చికెన్‌బిర్యానీ తింటూ మా బ్రాహ్మణులని ఎవరు గౌరవిస్తున్నారండీ అని ...ఒక వ్యక్తి అడిగాడు, ఎందుకు గౌరవించాలి నువ్వు నీ కుల ధర్మాన్ని వదిలేసి నాతో సమానంగా ఉన్నప్పుడు నిన్ను నాకంటే ఏ విషయంలో ఉన్నతుడుగా చూడాలో నువ్వే చెప్పు అంటే సమాధానం లేదు. ఈ రోజు కైనా వాళ్ళు సమాజ శ్రేయస్సు గురించి పాటు పడితేనే వాళ్ళకి మిగిలిన గౌరవమైనా దక్కుతుంది, లేకపోతే వాళ్ళు పుట్టు బ్రాహ్మణులుగానే ఉండిపోతారు.

Kishore Kvn: ఒక దళితుడికైన, బ్రాహ్మణుడి కైనా ఇదే వర్తిస్తుంది. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. సంఘం లో ఒక వర్గం ఆధిపత్యం సింగపూర్ లోను మలేషియా లోను అమెరికాలోను కూడా తప్పట్లేదు. అదే మనకీ ఉంది. మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు. వేసవి లో మామిడి పళ్ళు మాత్రమే అమ్ముతాడు. మిగిలిన కాలాల్లో కూర గాయాలు అమ్ముతాడు. దేనికి గిరాకి ఉంటె ఆ పని చేసుకోవాలి. మన సివిల్ ఇంజినీర్లు అందరూ కంప్యుటర్ ప్రోగ్రామింగ్ చేయ్యట్లేదూ? ఇదీ అంతే.

Mahesh Kumar Kathi బ్రాహ్మణులు తాము థియరైజ్ చేసి సామాజిక మూసకు తామే బలయ్యారు...

Kishore Kvn: Mahesh, మార్పు ని అంగీకరించ లేకపోతే ఎవరికైనా ఇదే జరుగుతుంది. బ్రాహ్మణులు theoritise చేసిన సిస్టం - అప్పటి సమాజానికి అదే కర్రెక్టేమో. అన్ని సేవలు అందరికి అందడం కోసం ఏర్పరిచిన పద్ధతి లో నాకు లోటు కనపడదు. అంటు రోగాలు వ్యాపించ డానికి అవకాశం ఉన్న పనులు చేసే కొన్ని వృత్తుల వారికి immunity ఉంటుంది. వారిని మిగిలిన వారికి దూరంగా quarantine చేసి ఉంచారు. సమాజ శ్రేయస్సు కోసం చేయబడింది. కాల క్రమం లో అది కాస్తా వెర్రి తలలు వేసి, అంటరాని తనంగా మారింది. అది సమాజం లో ఉన్న అజ్జ్ఞానం. దాన్ని తీసుకెళ్ళి బ్రాహ్మణుల తప్పు అనడం సరి కాదేమో? బ్రాహ్మణులకి కూడా వారి సేవలు అవసరమే. వారికి హరిజనుల మీద కక్షతో చేసింది కాదు.

Sreekumar Chinchapattana Gomatham ఒక బ్రాహ్మడు, క్షత్రియుడైన రాముడికీ, యాదవుడైనా కృష్ణుడికీ అర్చనలు, పూజలు చేస్తూ, మిగతా కులాలందరి వాళ్ళకీ భక్తీ, ముక్తి మూటగట్టి పెట్టినప్పుడు, వాళ్ళు లొట్టలేసుకుంటూ తినే చికెన్ తిని, ఆ దేవుళ్ళు తాగే సురాపానం సేవిస్తే తప్పేంటో నాకు ఎప్పుడూ అర్ధం కాదు :-)

ఆర్టికల్ లో నంబర్లు ఎంతవరకు నిజమో తెలీదు కానీ, మా ఇంట్లో మా తాతల వరకు (అమ్మ వైపు, నాన్న వైపు) అర్చకత్వం, పౌరోహిత్యం చేసిన వాళ్ళే. మా నాన్న తరం వచ్చే సరికి ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. బ్రతుకు తెరువు ముఖ్యం. ఎలా బ్రతుకుతున్నామన్నది కాదు. అయినా... బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు బ్రాహ్మడు కానీ, పుట్టుకతోనో, చచ్చో బ్రాహ్మణత్వం మూటకట్టుకోరు ఎవరూ. కానీ ఏంటో... రాజకీయాల్లో, సినిమా రంగం లో మాత్రం ఓ రెండుమూడు కులాల వాళ్ళే కనిపిస్తున్నారు, పుట్టుకతోనే మహా నటులు, మహా నాయకులూ అయిపోయి.

Sreekumar Chinchapattana Gomatham: ఇక థియరైజ్ విషయానికొస్తే, బ్రాహ్మలతో పాటు, బలవంతులని కూడా సమానంగా తప్పు పడతాను నేను. అది ధనబలో, కండబలమో... ఏదో ఒకటి. ఆ రెండు చేతులు కలిస్తేనే మోగాయి చప్పట్లు.

Phanindrakumar Machavaram: haha simple ga meeru ela valagurinchi matladukuntunnarantene vallu gola kakda ani ardamavuthudni and vallani takuva chesi matladukodamlo meeku anadam vudani ala kastapaduthunnaru.. etopic matladam valla meeku vallaki evariki use ledhu and w...ho support or comment on them also useless enni years daaatina eppatikina elantivi maravu marchaleru and marchalanukodam valle e dhesam entha chandalamgavundi...maarpu oka stage varaku correct mare athi chesthe elane vuntundi

Syamprasad Meka: @Kishore KVN , Nice discussion. I appreciate most of the points. Let me add a different perspective to one of your comments.

You said, "అప్పటి సమాజానికి అదే కర్రెక్టేమో. అన్ని సేవలు అందరికి అందడం కోసం ఏర్పరిచిన పద్ధతి లో నాకు లోటు కనపడదు. ..."

అప్పటి సమాజానికి కూడా అది కరెక్ట్ కాదేమో కూడా ! ఏం అప్పటి సమాజ లో తప్పులుండవా? ఉండకూడదా? ఉంటాయనే ఊహని మనం భరించలేమా? అప్పటి సమాజం, వాళ్ళకున్న తెలివితేటలూ, అవగాహనా, మామూలుగా ఉండే అనేక రాజకీయ కారణాల పరిధిలో ఏర్పరుచుకున్న పద్దతి అది. అంతే. దానికి లేనిపోని లాజిక్కులు అల్లి తప్పనో, రైటనో, కుట్రనో, యుగధర్మమనో మసిబూయడం సరైనది కాదని నా అభిప్రాయం.

You also Said "అంటు రోగాలు వ్యాపించ డానికి అవకాశం ఉన్న పనులు చేసే కొన్ని వృత్తుల వారికి immunity ఉంటుంది. వారిని మిగిలిన వారికి దూరంగా quarantine చేసి ఉంచారు.సమాజ శ్రేయస్సు కోసం చేయబడింది"

వాళ్ళకి తోచిన పద్దతి వాళ్ళు పెట్టుకున్నారు. మీరంతా ఈ పనులే చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఈ పనులు చెయ్య కూడదు అని నిర్దేశించడం అప్పటి వ్యవస్థలో కూడా తప్పే కదా? సమాజ శ్రేయస్సు కోసమే అయ్యుండొచ్చు, కాకపోతే ఆ శ్రేయస్సు పొందే సమాజంలో పాపం ఆ పనులు చేసే వాళ్ళు లేరనుకుంటా! That is where the problem centers around.

Mahesh Kumar Kathi: జరిగిన వాటిని ఏదో ఒక రకంగా సమర్థించుకుంటూ పోతుండటంతోనే మార్పు వేగం మందగిస్తుంది. చరిత్ర మళ్ళీమళ్ళీ తిరగ దోడాల్సిన పరిస్థితి వస్తుంది. రగిలిన గాయలను గుర్తుచెయ్యడమే కాకుండా, గాయం చేసిన గొంతుల్ని నిలదియ్యాలనే కోరికల్ని రేపుతుంది. అదే ఘర్షణకు మళ్ళీమళ్ళీ ప్రేరేపిస్తుంది. ఒప్పేసుకుందా,..తప్పుల్ని అచ్చంగా ఒప్పేసుకుందాం. కొత్తగా చరిత్రను తిరగరాద్దాం.

Syamprasad Meka: మహేష్ గారు, మనకి సంబంధం లేని ఎప్పటివో సంగతులు కాబట్టి ఒప్పుకోవడాలూ, ఒప్పుకోక పోవడాలు అవసరం లేదండీ. కాకపోతే, నిజాయితీగా ఆలోచించ గలగడం, అర్థం చేసుకోవడం ముఖ్యం.

అప్పటి వ్యవస్థలో లోపాలకీ, మంచికీ మనం కేవలం వారసులమేకానీ బాధ్యులం కాదు. ఆ వ్యవస్థలో...ని విభజనకి ప్రతినిధులుగా మనం ఆలోచించడం మానుకుంటే మార్పులూ, పరిష్కారాలు అవే వస్తాయి. దురదృష్టవశాత్తూ, అప్పటి వ్యవస్థకీ దాంట్లోని విభజనలకీ ప్రాతినిధ్యం వహించకుండా అలోచించేవాళ్ళు సరిపోయినంత మంది ప్రస్తుతానికి లేరు. That is where we need to start :)


Kiran Chakravarthula: ప్రశ్నలు అడిగినంత దాకా బాగానే సాగి అక్కడక్కడా విపరీతవాదంగా (extremism) పరిణమించింది తాడేపల్లి వారి బ్లాగు టపా. ఆలోచించవలసిన విషయాలు కొన్నైనా ఉన్నాయందులో. (మహేశ్ గారు అడిగిన ప్రశ్న) అందులోని ప్రధానమైన విషయమేంటంటే... బ్రాహ్మణులు కులవృత్తికి ద...ూరమైతే మనగలగటానికి (హైందవ) సమాజం యిప్పటికిప్పుడు సిద్ధంగా లేదని గ్రహించి హిందువులే యేదో ఒకటి చెయ్యాలని. బ్రాహ్మణుల కులవృత్తిలోకి తదితరులను తీసుకురావటం కూడా ఒక భాగం కావచ్చునేమో (నా దృష్టిలో) కానీ తాడేపల్లి వారు అందులో ప్రాథమికమైన యిబ్బందులున్నాయంటారు. నాస్తికులు, మతవర్జ్యులు (మతాన్ని విడచినవారు = apostasists) యేమైనా అనవచ్చు గాక - ఇది వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు - హైందవ సమాజానికి ఒక హెచ్చరికగా, (ఆధ్యాత్మిక, దైవిక, మానుష్య కర్మలను చేయించటానికి పురోహితుల అవసరం ఉన్నవాళ్ళకు) రాబోయే "విపత్తు"ను పరిచయం చేసేందుకు ఉద్దేశించబడిన వ్యాసమది. పోప్/ఇమాం/రబ్బై/దిగంబరులు/సిఖ్ గురు/బౌద్ధ సన్యాసి వారి వారి మతస్థులకు యిచ్చే సందేశం (అది మఱో విశ్వాసానికి అవమానమో, ద్వేషమో రగిలించనంత వఱకూ) నాకెంత అనవసరమో హైందవేతరులకు యిదీ అంతే!

<< ఒక బ్రాహ్మడు, క్షత్రియుడైన రాముడికీ, యాదవుడైనా కృష్ణుడికీ అర్చనలు, పూజలు చేస్తూ, మిగతా కులాలందరి వాళ్ళకీ భక్తీ, ముక్తి మూటగట్టి పెట్టినప్పుడు, వాళ్ళు లొట్టలేసుకుంటూ తినే చికెన్ తిని, ఆ దేవుళ్ళు తాగే సురాపానం సేవిస్తే తప్పేంటో నాకు ఎప్పుడూ అర్ధం కాదు :-) >>

రాముడు, కృష్ణుడు చేసారు కనుక చంపుకుంటూ పోయినా తప్పని మీకు అర్థం కాదంటారు మొత్తానికి?

<< మీరంతా ఈ పనులే చెయ్యాలి, మిగిలిన వాళ్ళు ఈ పనులు చెయ్య కూడదు అని నిర్దేశించడం >>

"ఈ పనులు చేసేవాళ్ళు ఒక వర్గం, ఆ పనులు చేసేవాళ్ళు మఱొకటి, ఫలానావి చేసేవాళ్ళు ఇంకొకటి, తక్కినవాళ్ళంతా ఒకటి" అని వర్గీకరించారేమో కానీ పై రకమైన నిర్దేశం కాదు. It's the other way round. (తాము నమ్మినదే సరియైనదిగా భావించి కాదని వాదించదలచిన వాళ్ళకి నేను చెప్పేదేమీ లేదు.)

Kishore Kvn: ‎@syamprasad- I'm just trying to find reasoning in ancient Hindu culture in positive perspective. అప్పట్లో జరిగింది అది తప్పు అయితే తప్పే. Almost 2000-3000 years ago started, know one knows exactly how did it all start. చరిత్ర లో వాస్తవాల వక్రీకరణ లు, ఏక పక్షం గ ఉండటం ఎక్కువని నేను చరిత్ర పెద్దగ చదవ దానికి ఇష్టపడను.

Syamprasad Meka: <<"ఈ పనులు చేసేవాళ్ళు ఒక వర్గం, ఆ పనులు చేసేవాళ్ళు మఱొకటి, ఫలానావి చేసేవాళ్ళు ఇంకొకటి, తక్కినవాళ్ళంతా ఒకటి" అని వర్గీకరించారేమో కానీ పై రకమైన నిర్దేశం కాదు. >>

పుట్టుకను బట్టి చేసే పనుల్ని నిర్దేశించడం, దాన్ని అతిక్రమిస్తే సమాజ అమోదం లేకపోవడం, పూర్వ జన్మల కర్మల ఫలితంగా ఒక వర్ణం లో జన్మించారు కాబట్టి ఆ వర్ణ ధర్మాన్నే పాటించమనడం దేన్ని సూచిస్తుంది?

In simple,
Division of labour by worth is OK, by birth is NOT OK.
For organizing the society, Division of labour is OK, but division of labourers is NOT OK.

These are basic things in any age. Practically it might not have happened properly in the past. That's fine as long as we in the present are ready to understand it and address it. But trying to unneccessarily justify the wrongs of past with funny logic and new interpretations just increases the trust deficit in the society.

Kiran ChakravarthulaI am with you in saying that attributing caste to birth is one folly that happened and has been happening ever since. I don't know when that came into existence. It's definitely not the original idea. It probably started off with parents te...aching their skills to children and soon continued on with selfishness or some other reason warranting exclusivity of the same, eventually leading to keeping the trade within the family.

Syamprasad Meka: ‎@KiranChakravarthula, As you said, we do not know how things got transformed and when. One fundamental thing I am still trying to understand is... Varna system itself is divisive rite? I know according to Bhagavadgita, there are qualities... attributed to varnas. But the basic karma principle of people acquiring the qualities of a particular varna based on their past lifes is still dividing people on birth. Isn't it? Anyway, what is wrong even if there is a problem in the original idea itself. After all those ideas are thousands of years ago. They are bound to be faulty, no issues as long as we are open to the possibility.

Kiran Chakravarthula: Right! :-) Prejudice is bad to start with, or at any point further down the line

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వ్యవస్థ లోనే గెలుపు - Lakshmi's Victory

వ్యవస్థతో పోరాటం అనే టపాలో, తన వ్యక్తిగత విషయంలో అడ్డదారులు తొక్కకుండా ఎంత కష్టమైనా వ్యవస్థ తో పోరాడి కొంత వరకైనా విజయం సాధించి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్న చేతన్ గురించి రాశాను. ఈ కధలో, సమాజం కోసం చేసే పనిలో ఎన్ని కష్టాలెదురైనా వ్యవస్థ మీద నమ్మకంతో పోరాడి గెలుపు సాధించిన లక్ష్మి గురించి రాస్తున్నాను. చదివి మీ స్పందననీ ఆలోచనల్నీ చెప్పండి.
-------------------------------------------------------------------------

లక్ష్మి 1997 లో ఒక NGO ని స్థాపించి మానసిక వికలాంగుల కోసం పనిచేస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థ తరుపున ఒక స్పెషల్ స్కూలూ, వొకేషనల్ ట్రైనింగ్ సెంటరూ ఇంకా అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూలులో దాదాపుగా ఒక వంద మంది ఉంటారు. వాళ్ళందరికీ వారి వారి సామర్ధ్యాన్ని బట్టి వేరు వేరు తరగతులూ, శిక్షణపొందిన ట్రైనర్లూ ఉన్నారు. చాలా మంది స్నేహితులూ, శ్రేయోభిలాషుల సహకారంతో మొదలుపెట్టబడిన ప్రయత్నం అది. కొన్నేళ్ళ తరువాత కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చి కొంత గ్రాంటు కూడా రావడం మొదలయ్యింది. ఆ స్కూలుకి 2006 లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక బస్సుని స్పాన్సర్ చేయడంతో ఎంచక్కా ప్రతిరోజూ అందరినీ స్కూలుకి తేవడానికీ తిరిగి ఇంటిదగ్గర దిగబెట్టదానికీ చాలా అనువుగా ఉంది.

ఆ బస్సుని రిజిస్ట్రేషన్ చెయించినప్పుడు RTA వారు పొరపాటున దానిని కమర్షియల్ వాహనంగా రిజిష్టర్ చేశారు. అయ్యో ఇదేంటి ఇది స్కూల్ బస్సుకదా? మేము డాక్యుమెంటేషన్ సరిగ్గానే ఇచ్చాము కదా! టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో కూడా స్కూలు బస్సు అనే రాశారు కదా ఇప్పుడిలా రాశారేంటి అని మార్చమని అడిగారు. మీది స్పెషల్ స్కూలు కదా, ఇటువంటి వాటికి ఖైరతాబాదు RTA లో కమీషనరు కి ఒక లెటర్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు మినహాయింపు ఇచ్చేస్తారు అన్నారు

సరే అని లెటరు పెడితే, ఈ మధ్య రూల్స్ మారి పోయాయి. ఇలా ఎక్జెంప్షన్ ఇవ్వట్లేదు. మీరు కమర్షియల్ వాహనాన్నే స్కూలు వాహనంగా మార్పు చెయ్యమని అత్తాపూర్ లోని DTC కి అప్లికేషన్ పెట్టండి వాళ్ళు మార్పు చేస్తారు అన్నారు ఖైరతాబాదు RTA వాళ్ళు.

సరే వాళ్ళకి రూల్స్ ప్రకారం ఇబ్బందులున్నాయేమోలే మార్పు చేస్తామన్నారు కదా అని అత్తాపూర్ వెళ్ళి ఆ అప్లికేషన్ కూడా పెట్టారు. అత్తాపూర్ DTC వారు మేము అసలు అలా చెయ్యవచ్చా అని వివరాలు అడుగుతూ మళ్ళీ ఖైరతాబాద్ RTA వారికే ఒక లెటర్ రాసి వారినుండి సమాధానం రాగానే చేస్తాం పొమ్మన్నారు.

కొన్నాళ్ళ తరువాత వెళ్తే RTA నుండి ఇంకా సమాధానం రాలేదని చెప్పారు. సరే కనుక్కుందాం అని మళ్ళీ ఖైరతాబాదు వెళ్ళి RTA వారిని కనుక్కుంటే, వాళ్ళు మీది స్కూలు అనే గుర్తింపు ప్రత్రమూ, ఆడిట్ రిపోర్టులూ తెమ్మన్నారు. సరే అని ఆడిట్ రిపోర్టులూ, గ్రాంట్ ఇచ్చే కేంద్ర మంత్రిత్వ శాఖ వారి గురింపు పత్రమూ తీసుకెళితే, ఇది పనికిరాదు మామూలుగా స్కూళ్ళకి గుర్తింపు ఇచ్చే DEO నుండి పత్రం కావాలన్నారు. వాళ్ళకి సంబంధం లేదు దీనితో ఇది మామూలు స్కూలు కాదు ప్రత్యేకమైన పిల్లల కోసం పనిచేసే స్కూలు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ఆఫీసు చుట్టూ కొన్నాళ్ళు తిరిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేదు.

సరే మొదట పొరపాటుగా రిజిస్ట్రేషన్ చేసిన RTO దగ్గరికే వెళ్ళి విషయమంతా చెప్తే బావుంటుందని అక్కడికెళ్ళి విషయం చెప్తే వాళ్ళు, సరే ఈ మూడు సంవత్సరాలకీ కమర్షియల్ లెక్కన టాక్సు చెల్లించండి అప్పుడు స్కూలు బస్సుగా మార్పుకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు.

సరే ఇలాకాదని ఇంకొంచెం పై అధికారి దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తే ఒకరోజేమో అసలు మన ఫైలే కనిపించట్లేదన్నారు. ఆ అధికారి కోపగించుకోవడంతో మొత్తానికి రెండో రోజుకి ఫైలు దొరికిందిగానీ ఆ అధికారి కూడా ఇన్నిరోజులకీ కమర్షియల్ టాక్సు చెల్లించాల్సిందే అన్నారు.
ఇంక ఈ విషయం మీద తిరగడానికి ఆఫీసులూ అధికారులూ ఎవరూ మిగల్లేదు. మరేం చెయ్యాలి? ఇన్నిరోజులూ విషయాన్ని నానబెట్టిందీ వాళ్ళే, మళ్ళీ తిరిగి ఇన్నిరోజులకీ డబ్బు చెల్లించమంటుందీ వాళ్ళే! సరే ఇహ లాభం లేదని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పరిశీలనలో ఉండగానే ఇంకో చిక్కొచ్చి పడింది. అధికారులు ఒకరోజు బస్సుని దారి మధ్యలో ఆపి తనిఖీ చేసి కమర్షియల్ టాక్సు చెల్లించలేదని సీజ్ చేశారు. బస్సు లేకపోతే ఈ వందమందీ మానసిక వికలాంగుల పరిస్థితేంటి? తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాలకీ నాలుగు లక్షల పైన చెల్లించి బస్సు విడిపించుకొన్నారు.

ఈ విషయాన్ని కూడా మానవ హక్కుల సంఘంలో ఉన్న ఫిర్యాదుకి జత చేసి కేసు కొనసాగించారు. చివరికి మానవ హక్కుల సంఘం ఉన్నత స్థాయి అధికారుల్ని పిలిపించి ఇదేమి పాలన, ఇదెక్కడి చోద్యం అని నిలదీసింది. మాదే పొరపాటు అని వాళ్ళు ఒప్పుకొని బస్సుని స్కూలు బస్సుగా గుర్తించడానికి అంగీకరించారు. 4 వారాల్లోపు ఆ 4 లక్షల డబ్బూ తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలివ్వబడ్డాయి. మొత్తానికి ఇంకొద్దిగా కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బు తిరిగి రాబట్టుకొని రిజిస్ట్రేషన్ లోని పొరపాటుని కూడా సరి చేయించగలిగారు.

వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: ఈ కధలో అధికారులూ ఉద్యోగులూ ఎవరూ పూర్తిగా చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఒక్కళ్ళు కూడా మంచిపనికోసం, రూల్స్ ని తెలుసుకొని పాటించే సాహసం చెయ్యలేదు. అదే, ఎవరైనా ఏదో ఒక విధంగా రూల్స్ ని దొడ్డిదారిలో అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఇదే వ్యవస్థ భలే వేఘంగా పనిచేస్తుంది కదూ! ఈ కధలోని లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వచ్చింది కష్టపడింది అందులో ఆవిడ విజయమేంటి అనుకునే వాళ్ళుండొచ్చు. సరైన పద్దతి అవసరం లేదు అనుకుంటే ఆవిడ ఎంత సులువుగా ఈ గండం నుండి గట్టెక్కగలిగేదో నాకు బాగా తెలుసు కాబట్టే నేనీ కథ రాశాను. ఎంత కష్టమైనా పోరాడి చివరికి వ్యవస్థతో చెయ్యల్సిన పనిని చెయ్యించడంలో ఈమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకం.

19, ఫిబ్రవరి 2011, శనివారం

వ్యవస్థతో పోరాటం - Chetan's Fight

అబ్బే ఈ దేశం బాగుపడదు. సమాజం మరీ స్వార్థ పూరితమైపోయింది. ఈ జనాలు, ఈ రాజకీయాలు ఇంతే. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు లాంటి వాటిని వినీ వినీ విసుగొస్తుంది కదూ. నాకు బాగా తెలిసిన ఒక మూడు వేరు వేరు అనుభవాలని టపాలుగా రాస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. ఇందులో మొదటిది చేతన్ కథ.
----------------------------------------------------------------------------------


2004 లో సంగతి ఇది. రోజూ ఉత్సాహంగా పని చేసి, సాయంత్రానికి చక్కగా అప్డేట్ ఇచ్చే చేతన్ ఒకరోజు అసలేమాత్రం సమాచారం లేకుండా మధ్యహ్నమే వెళ్ళిపోయాడు. ఏంటి విషయం, ఏమైనా సమాచారం ఇచ్చాడా అని మిగిలిన వాళ్ళని అడిగితే ఏదో ఫొన్ వచ్చిందనీ హడావిడిగా వెళ్ళాడనీ చెప్పారు. అరే ఏదైనా సమస్యొచ్చిందేమో కనుక్కోలేదా అని వెంటనే ఫొన్ చేశాను.. చేతన్, ఎక్కడున్నారు మీరు? ఈజ్ ఎవ్రీ థింగ్ ఆల్రైట్ అని? అప్పుడు తెలిసింది పాపం మా చేతన్ ప్రేమించి పెళ్ళడదామనుకుంటున్న అమ్మాయికి యాక్సిడేంట్ అయిందని. యాక్సిడెంట్ చేసినతనే హస్పటల్ లో చేర్పించాడట. కొంచెం ధైర్యం చెప్పి అవసరమైతే ఫొన్ చెయ్యమన్నాం.


మూడు నెలలపాటు హాస్పిటల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయి చనిపోయింది. ఆ మూణ్ణెల్లూ చేతన్ మాత్రం సెలవుపై వెళ్ళకుండా తనికిష్టమైన టైములో పనిచేసుకునే వెసులుబాటు అడిగాడు. నాకర్థమయ్యింది.. అదే బెటర్ తనకి కూడా వర్క్ కొంతవరకూ ఉపశమనం కలిగిస్తుందని. టైముకి ఆఫీసులకి వచ్చే చాలా మంది రోజంతా చేసే దానికంటే చాలా ఎక్కువే పనిచేశాడు. ఫగలు మాత్రం దాదాపుగా హస్పిటల్ దగ్గరే గడిపేవాడు.


మూడు నెలలపాటు హాస్పిటల్లో వైద్యం అంటే మాటలా? ఖర్చు లక్షల్లో అయ్యింది. ఎం ఎస్ అయ్యింతర్వాత కొద్ది నెలలు మాత్రమే అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడ ఉండడం ఇష్టంలేక ఇండియాకి వచ్చిన మా చేతన్ దగ్గర అంత డబ్బు లేదు కానీ, అదృష్టవశాత్తూ అమెరికాలో ఉన్నప్పటి క్రెడిట్ కార్డు ఉండబట్టి ఒక మూడు లక్షలు పైనే వైద్యానికి సర్దుబాటు చేసుకోగలిగాడు. నెల నెలా ఇక్కడ ఉద్యోగంతో అక్కడి అప్పు తీర్చడమంటే ఎంతకష్టం? కానీ అమెరికా నుండి వచ్చేశాం కదా అని లైట్ తీసుకునే చాలా మందిలా కాకుండా రెండేళ్ళు కష్టపడి ఆ అప్పు మొత్తం తీర్చేశాడు.


ఇదంతా వ్యక్తిగతం. తనకొచ్చిన అనుకోని పరిస్థితులూ, మనుషులతో ఉండే సంబంధాలమీద నిబద్ధతా, నిజాయితీ లాంటివి పుష్కలంగా ఉన్న ఒక మంచి వ్యక్తిగా చేతన్ అంటే నాతో పాటు మా ఆఫీస్ లో చాలా మందికి ఎంతో గౌరవం.


అసలు విషయానికి వస్తే, యాక్సిడెంట్ చేసినతను ఒక పెద్ద బ్యాంకు ఛైర్మన్. పలుకుబడిలోనూ, పరిచయాల్లోను, డబ్బులోనూ మన చేతన్ కి అసలేమాత్రం అందనంత స్థాయి. ఇక్కడినుంచే చేతన్ అసలు పోరాటం మొదలైయ్యింది. పోలిస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు ఫిర్యాదుకూడా తీసుకోకుండా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయినా అన్ని పోలీస్ స్టేషన్ లూ, తిరిగి తిరిగి, పై స్థాయి అధికారుల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళి ఫిర్యాదు నమోదు చేయించగలిగాడు. అప్పటికీ అవతలి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ.. ఈ కేసు తో వీళ్ళు మనల్నేమి చయ్యగలరులే అనే నమ్మకం అయ్యుండొచ్చు.


మొత్తానికి పోలీసులు చార్జ్ షీట్ పెట్టారు. కారు నడిపిన పెద్ద మనిషి స్థానంలో డ్రైవరు ఉన్నాడు చార్జ్ షీట్లో. శిక్ష ఏంటి? ఎవరికి? అనేదాన్ని పక్కన బెడితే అసలు తప్పు చేసిన వాడు బాధ్యత ఎందుకు తీసుకోడు? ఎంత డబ్బున్న వాడైతే మాత్రం!?


పోనిలే కేసు కోర్టుకి వెళ్ళిందికదా, చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో అని చేతన్ ఒక లాయర్ ని పెట్టుకొని పొరాటం మొదలు పెట్టాడు. అక్కడినుంచీ ఎడతెరిపిలేని వాయిదాలూ, ఆలస్యాలతో కేసు రెండు సంవత్సరాలు సాగింది. బతుకు పోరాటానికే వ్యవధి సరిపోని మామూలు మనుషులు ఎంతకాలం ఇట్లా తిరగ్గలరు? అంటే కాగితం మీద ఉన్న న్యాయం చేతికందాలంటే కేవలం డబ్బున్న వాడికే సాద్యమా?


ఇంతా చేస్తే, ఒక వాయిదా కి నువ్వు రానవసరం లేదులే, ఈ రోజూ ఎలాగు వాయిదానే అని చెప్పాడు చేతన్ తరపు లాయరు. తరువాత కనుక్కుంటే, ఆరోజు చేతన్ రాలేదు కాబట్టి కేసు మూసేశారట! మరీ సినికల్ గా ఆలోచిస్తున్నాననుకునేరు. ఈ కోర్టుల వ్యవహారోల్లో రెండు వైపులా లాయర్లు కుమ్మక్కవడం నిజంగానే జరుగుతుంది.


సరే, ఇప్పుడేం చెయ్యాలని చేతన్ కనుక్కుంటే, ఇలా మూసేసిన కేసులని మళ్ళీ మూడు నెలల్లోగా తిరిగి తెరిపించే వెసులుబాటు ఉండటం ఆ గడువు ముగియడానికి ఇంకా కొద్దిరోజులే ఉండడంతో చేతన్ మరో లాయర్తో మళ్ళీ కేసు ఓపెన్ చేయించాడు.


మళ్ళీ ఒక సంవత్సరం పాటు వాయిదాలు జరిగి కేసు విచారణకొచ్చింది. సాక్షులు ఎవరంటే, ఆ దారిలో పోతూ యాక్సిడెంట్ చూసిన ఒక ప్రత్యక్ష సాక్షీ, హాస్పిటల్ లో వైద్యం చేసిన డాక్టరూ. ముందుగా ప్రత్యక్ష సాక్షి ని ప్రవేశ పెట్టాలంటే, పోలీసుల దగ్గర అతని పేరు, బంజారా హిల్స్ లోని ఒక బస్తీ పేరు మాత్రమె ఉన్నాయి. చేతన్ ఎలాగోలా కష్టపడి ఆ సాక్షిని కలిసి సహాయం అర్థిస్తే, పాపం అతను రోజు కూలీ చేసుకునే వ్యక్తి. తన కూలీ మానుకొని కోర్టు చుట్టూ తిరగడం అయ్యేపని కాదు. చేతన్ ఎన్ని రోజులు కోర్టుకి వస్తే అన్ని రోజుల కూలీ డబ్బులు ఇస్తాను, నాకోసం ఏమీ అబద్దం చెప్పొద్దు, మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి అని అతనిని ఒప్పించి సాక్ష్యం ఇప్పించాడు.


అవతలి వైపు వాళ్ళు ఒక కొత్త వాదన మొదలెట్టారు. ఆ అమ్మాయి చనిపోయింది ప్రమాదం జరిగిన మూడు నెలలకి కాబట్టి ఆమె మాములుగా ఆమెకుండే ఏదైనా అనారోగ్యంతొ చనిపోయుండొచ్చుకదా అని. సాక్ష్యం ఇవ్వడానికి రావలసిన డాక్టర్ తో మాట్లాడేదాకా చేతన్ స్థిమితంగా లేడనే చెప్పొచ్చు. డాక్టర్ గారు చాలా మంచి వారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్లే మూడు నెలల పోరాటం తరువాత చనిపోయింది అని.


తీర్పు చెతన్ కి అనుకూలంగా వచ్చింది. అవతలి పార్టీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పింది కోర్టు. ఆరోజు చేతన్ మొహంలో సంతృప్తి నాకు ఇంకా గుర్తుంది. డబ్బులు రాక పోయినా పర్వాలేదు కానీ మనం కేసు గెలిచాం. యాక్సిడెంట్ చేసిన వాడు ఎంత బలవంతుదైనా సరే బాధ్యత తీసుకోవలసిందే అని నిరూపించాం అన్నాడు.


అనుకున్నట్టుగానే అవతలి వాళ్ళు హై కోర్టుకి అప్పీలు చేశారు. ఏదో ఒక రోజు, అలసిపోరా వీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ మొత్తం కథలో, అద్భుతమైన మంచి జరిగింది ఇక్కడే. హైకోర్టు మళ్ళీ కేసుని సాగదీయకుండా, వెంటనే సగం పరిహారం చెల్లించి కేసు కొనసాగించుకోమ్మని రూలింగ్ ఇచ్చింది. సగం పరిహారం కోర్టు ద్వారా చెల్లించ బడింది. కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అవును 2004 నుండి..but chetan is continuing his fight..


వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: మన వ్యవస్థలో ఇన్ని లోపాలున్నాయి నిజమే. కానీ ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా? కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా? వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే ఈ వ్యవస్థ బాగు పడే అవకాశం అసలేమాత్రం ఉండదు. చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది. అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం. వచ్చే వందేళ్ళలో మనం నిర్మించబోయే నవీన భారతావనికి ఇలాంటివాళ్ళే పునాది రాళ్ళు.