25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వ్యవస్థ లోనే గెలుపు - Lakshmi's Victory

వ్యవస్థతో పోరాటం అనే టపాలో, తన వ్యక్తిగత విషయంలో అడ్డదారులు తొక్కకుండా ఎంత కష్టమైనా వ్యవస్థ తో పోరాడి కొంత వరకైనా విజయం సాధించి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్న చేతన్ గురించి రాశాను. ఈ కధలో, సమాజం కోసం చేసే పనిలో ఎన్ని కష్టాలెదురైనా వ్యవస్థ మీద నమ్మకంతో పోరాడి గెలుపు సాధించిన లక్ష్మి గురించి రాస్తున్నాను. చదివి మీ స్పందననీ ఆలోచనల్నీ చెప్పండి.
-------------------------------------------------------------------------

లక్ష్మి 1997 లో ఒక NGO ని స్థాపించి మానసిక వికలాంగుల కోసం పనిచేస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థ తరుపున ఒక స్పెషల్ స్కూలూ, వొకేషనల్ ట్రైనింగ్ సెంటరూ ఇంకా అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూలులో దాదాపుగా ఒక వంద మంది ఉంటారు. వాళ్ళందరికీ వారి వారి సామర్ధ్యాన్ని బట్టి వేరు వేరు తరగతులూ, శిక్షణపొందిన ట్రైనర్లూ ఉన్నారు. చాలా మంది స్నేహితులూ, శ్రేయోభిలాషుల సహకారంతో మొదలుపెట్టబడిన ప్రయత్నం అది. కొన్నేళ్ళ తరువాత కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చి కొంత గ్రాంటు కూడా రావడం మొదలయ్యింది. ఆ స్కూలుకి 2006 లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక బస్సుని స్పాన్సర్ చేయడంతో ఎంచక్కా ప్రతిరోజూ అందరినీ స్కూలుకి తేవడానికీ తిరిగి ఇంటిదగ్గర దిగబెట్టదానికీ చాలా అనువుగా ఉంది.

ఆ బస్సుని రిజిస్ట్రేషన్ చెయించినప్పుడు RTA వారు పొరపాటున దానిని కమర్షియల్ వాహనంగా రిజిష్టర్ చేశారు. అయ్యో ఇదేంటి ఇది స్కూల్ బస్సుకదా? మేము డాక్యుమెంటేషన్ సరిగ్గానే ఇచ్చాము కదా! టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో కూడా స్కూలు బస్సు అనే రాశారు కదా ఇప్పుడిలా రాశారేంటి అని మార్చమని అడిగారు. మీది స్పెషల్ స్కూలు కదా, ఇటువంటి వాటికి ఖైరతాబాదు RTA లో కమీషనరు కి ఒక లెటర్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు మినహాయింపు ఇచ్చేస్తారు అన్నారు

సరే అని లెటరు పెడితే, ఈ మధ్య రూల్స్ మారి పోయాయి. ఇలా ఎక్జెంప్షన్ ఇవ్వట్లేదు. మీరు కమర్షియల్ వాహనాన్నే స్కూలు వాహనంగా మార్పు చెయ్యమని అత్తాపూర్ లోని DTC కి అప్లికేషన్ పెట్టండి వాళ్ళు మార్పు చేస్తారు అన్నారు ఖైరతాబాదు RTA వాళ్ళు.

సరే వాళ్ళకి రూల్స్ ప్రకారం ఇబ్బందులున్నాయేమోలే మార్పు చేస్తామన్నారు కదా అని అత్తాపూర్ వెళ్ళి ఆ అప్లికేషన్ కూడా పెట్టారు. అత్తాపూర్ DTC వారు మేము అసలు అలా చెయ్యవచ్చా అని వివరాలు అడుగుతూ మళ్ళీ ఖైరతాబాద్ RTA వారికే ఒక లెటర్ రాసి వారినుండి సమాధానం రాగానే చేస్తాం పొమ్మన్నారు.

కొన్నాళ్ళ తరువాత వెళ్తే RTA నుండి ఇంకా సమాధానం రాలేదని చెప్పారు. సరే కనుక్కుందాం అని మళ్ళీ ఖైరతాబాదు వెళ్ళి RTA వారిని కనుక్కుంటే, వాళ్ళు మీది స్కూలు అనే గుర్తింపు ప్రత్రమూ, ఆడిట్ రిపోర్టులూ తెమ్మన్నారు. సరే అని ఆడిట్ రిపోర్టులూ, గ్రాంట్ ఇచ్చే కేంద్ర మంత్రిత్వ శాఖ వారి గురింపు పత్రమూ తీసుకెళితే, ఇది పనికిరాదు మామూలుగా స్కూళ్ళకి గుర్తింపు ఇచ్చే DEO నుండి పత్రం కావాలన్నారు. వాళ్ళకి సంబంధం లేదు దీనితో ఇది మామూలు స్కూలు కాదు ప్రత్యేకమైన పిల్లల కోసం పనిచేసే స్కూలు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ఆఫీసు చుట్టూ కొన్నాళ్ళు తిరిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేదు.

సరే మొదట పొరపాటుగా రిజిస్ట్రేషన్ చేసిన RTO దగ్గరికే వెళ్ళి విషయమంతా చెప్తే బావుంటుందని అక్కడికెళ్ళి విషయం చెప్తే వాళ్ళు, సరే ఈ మూడు సంవత్సరాలకీ కమర్షియల్ లెక్కన టాక్సు చెల్లించండి అప్పుడు స్కూలు బస్సుగా మార్పుకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు.

సరే ఇలాకాదని ఇంకొంచెం పై అధికారి దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తే ఒకరోజేమో అసలు మన ఫైలే కనిపించట్లేదన్నారు. ఆ అధికారి కోపగించుకోవడంతో మొత్తానికి రెండో రోజుకి ఫైలు దొరికిందిగానీ ఆ అధికారి కూడా ఇన్నిరోజులకీ కమర్షియల్ టాక్సు చెల్లించాల్సిందే అన్నారు.
ఇంక ఈ విషయం మీద తిరగడానికి ఆఫీసులూ అధికారులూ ఎవరూ మిగల్లేదు. మరేం చెయ్యాలి? ఇన్నిరోజులూ విషయాన్ని నానబెట్టిందీ వాళ్ళే, మళ్ళీ తిరిగి ఇన్నిరోజులకీ డబ్బు చెల్లించమంటుందీ వాళ్ళే! సరే ఇహ లాభం లేదని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పరిశీలనలో ఉండగానే ఇంకో చిక్కొచ్చి పడింది. అధికారులు ఒకరోజు బస్సుని దారి మధ్యలో ఆపి తనిఖీ చేసి కమర్షియల్ టాక్సు చెల్లించలేదని సీజ్ చేశారు. బస్సు లేకపోతే ఈ వందమందీ మానసిక వికలాంగుల పరిస్థితేంటి? తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాలకీ నాలుగు లక్షల పైన చెల్లించి బస్సు విడిపించుకొన్నారు.

ఈ విషయాన్ని కూడా మానవ హక్కుల సంఘంలో ఉన్న ఫిర్యాదుకి జత చేసి కేసు కొనసాగించారు. చివరికి మానవ హక్కుల సంఘం ఉన్నత స్థాయి అధికారుల్ని పిలిపించి ఇదేమి పాలన, ఇదెక్కడి చోద్యం అని నిలదీసింది. మాదే పొరపాటు అని వాళ్ళు ఒప్పుకొని బస్సుని స్కూలు బస్సుగా గుర్తించడానికి అంగీకరించారు. 4 వారాల్లోపు ఆ 4 లక్షల డబ్బూ తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలివ్వబడ్డాయి. మొత్తానికి ఇంకొద్దిగా కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బు తిరిగి రాబట్టుకొని రిజిస్ట్రేషన్ లోని పొరపాటుని కూడా సరి చేయించగలిగారు.

వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: ఈ కధలో అధికారులూ ఉద్యోగులూ ఎవరూ పూర్తిగా చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఒక్కళ్ళు కూడా మంచిపనికోసం, రూల్స్ ని తెలుసుకొని పాటించే సాహసం చెయ్యలేదు. అదే, ఎవరైనా ఏదో ఒక విధంగా రూల్స్ ని దొడ్డిదారిలో అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఇదే వ్యవస్థ భలే వేఘంగా పనిచేస్తుంది కదూ! ఈ కధలోని లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వచ్చింది కష్టపడింది అందులో ఆవిడ విజయమేంటి అనుకునే వాళ్ళుండొచ్చు. సరైన పద్దతి అవసరం లేదు అనుకుంటే ఆవిడ ఎంత సులువుగా ఈ గండం నుండి గట్టెక్కగలిగేదో నాకు బాగా తెలుసు కాబట్టే నేనీ కథ రాశాను. ఎంత కష్టమైనా పోరాడి చివరికి వ్యవస్థతో చెయ్యల్సిన పనిని చెయ్యించడంలో ఈమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకం.

13 కామెంట్‌లు:

  1. ఎక్కడ దొరుకుతారండీ ఇలాంటి వాళ్ళంతా మీకే కనిపిస్తారేమో? చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. బాగుంది... Inspiring..
    మన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న వ్యవస్థ ఇది. దీనిలో ఒక న్యాయమైన కోరిక, అందునా మానసిక వికలాంగుల బస్సు కోసం ఇంత పోరాటం అవసరమవటం.. మన దురదృష్టం.
    నిజానికి ప్రతి లెవెల్ లోనూ కుదిరినంత/దొరికినంత దండుకునే స్వభావాలు, రూల్స్ ని ఇతరులని ఇబ్బంది పెట్టేందుకు మాత్రం ఘనం గా ఉపయోగించుకునే స్వభావాలూ .. హ్మ్..

    మామూలు ప్రజలు ప్రాణాలమీదకొచ్చే విషయాలకి తప్ప పోరాటం చేసే ఓపిక/ఆసక్తి ని కోల్పోయారేమో.. ఇలాంటి పోరాటానికి సమయం, సహనం, మనోస్థైర్యం.. ఎంతో కావాలి.. Congratulations to her!

    ఇలాంటి విజయాలు చుట్టుపక్కల వ్యక్తులకి దక్కటం చూడటం వల్ల వ్యవస్థ లోనూ, వ్యక్తుల్లోనూ వస్తుందని అనుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత & SNKR గారు, ధన్యవాదాలు. :)

    క్రిష్ణప్రియ గారు,

    నా బ్లాగుకి స్వాగతం :) మీ నుండి కామెంటు రాబట్టిన క్రెడిట్ నా రాతలకన్నా లక్ష్మి గారికి దక్కడమే సముచితం. కాబట్టి మీ congratulations తో నా Thanks కూడా కలిపి ఆవిడకి అందజేస్తాను :)

    I appreciate your opinion and the nice points you mentioned in your comment.

    రిప్లయితొలగించండి
  4. నాకు బయటవాడిగా ఉంటూనే ప్రభుత్వ వ్యవస్థలో (insider-outsider) పనిచేసే అవకాశం అనుభవం ఉంది.Let me try to provide some insight on such issues.

    ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్స్ లో ఉన్న పేపర్లకన్నా, నోట్ షీట్ (వివరణ పత్రం)కున్న ప్రాముఖ్యత ఎక్కువ. అందులో ఫైల్ లో ఉన్న విషయంపై నిర్ణయాలు తీసుకోవడానికి లేక తీసుకోకపోవడానికీ గల కారణాల్ని వివరిస్తారు.అది రాయటం డీలింగ్ క్లర్కుల పని. రాయించడం డీలింగ్ ఆఫీసర్ పని. క్లర్కులు ఆఫీసర్ attitude ని preferences ని అవసరాల్ని బట్టి మాత్రమే వివరణలు రాస్తారు. ఇలాంటి విషయాల్లో మనం పట్టీపట్టనట్టు ఉండాలి అనేది ఆఫీసర్ ధోరణి అయితే క్లర్కు "may be considered" లాంటి vague recommendations note sheet లో రాస్తాడు. ఆఫీసర్ సానుకూల ధోరిణిలో ఉంటే "may be considered for approval" అని రాస్తాడు. ఒక్క పదంతో ఆఫైల్ ని పనికొచ్చేది పనికిరానిదిగా డిసైడ్ చేస్తారు. వివరణ ఎంత బలంగా ఉన్నా ఆఖర్న ఉన్న ఒక్క పదంతో ఆఫీసర్ సంతకం పెడతాడా లేదా అనది తేలుతుంది. ఒకవేళ మొదటి రిమార్కుతో ఫైల్ వస్తే process లో ఉంది అని చూపించడానికి ఆఫీసరు తన పొట్టిసంతకం పెట్టి "put up" అంటాడు. అంటే మళ్ళీ ఫైల్ ప్రోసెస్ చెయ్యమని అర్థం. ఇలా వాళ్ళకు కుదరదు లేదా చేస్తే ఏంలాభం లేదు లేదా చేస్తే మనకేమైనా అవుతుంది/రిస్కు అనుకుంటే ఫైల్ అలా సాగతీస్తూనే ఉంటారేతప్ప...విషయం ముందుకుసాగదు. నిర్ణయాలు జరగవు. ఇలా కొన్ని సంవత్సరాలు చేసేస్తారు ఒకే ఆఫీసులో. ఇక ఎన్నో ఆఫీసులకు తిరగాల్సిన పనైతే సామాన్యుడు గోవిందే!

    నిజానికి ఇలాంటి రూల్సు ఉన్నది ఆఫీసర్ల బాధ్యతాయుతంగా పనిచెయ్యడానికి. కానీ వాటిని (సరిగ్గా)పనిచెయ్యకపోవడానికి కారణాలుగా చూపించే వ్యవస్థ తయారయ్యింది. నేను పనిచేసిన ప్రాజెక్టు డైరెక్టర్ ఒకాయన క్లర్కు "కుదరదు" అని నోట్ షీట్ రాసి పంపితే తనని పిలిచి, "ఇది ఎలా కుదురుతుందో ఈసారి రాయి" అని చెప్పి రాయించేవాడు, if he feels the file deserves an approval. అలాంటి ఆఫీసర్లూ ఉన్నారు. అలాంటి దార్లూ ఉన్నాయి. కానీ ఏంచేద్దాం వ్యవస్థ మషినరీకి కొన్ని అలవాటుగా మారిపోయాయి. వాటిని అప్పుడప్పుడూ కదిలించి తుప్పు వదిలించే లక్ష్మిలాంటి వాళ్ళు ఎప్పుడూ అవసరమే.

    రిప్లయితొలగించండి
  5. మహేష్ గారు,

    చాలామంచి వివరాలు అందించారు. It would be very helpful to have these insights.

    రిప్లయితొలగించండి
  6. నమస్కారం,
    " సరైన పద్దతి అవసరం లేదు అనుకుంటే ఆవిడ ఎంత సులువుగా ఈ గండం నుండి గట్టెక్కగలిగేదో నాకు బాగా తెలుసు కాబట్టే నేనీ కథ రాశాను. "
    నిజమే. "ఇవ్వాల్సినవి" ఇచ్చేస్తే ఒక్క పూటలో మన పనులు జరిపించుకోవడం పెద్ద పనేం కాదు. అయితే తాము చేయాల్సిన పని చేయడానికే చేతులు చాచడం దౌర్భాగ్యం.
    మీ ముందటి టపా "చేతన్ గారి గురించి" ఇప్పుడు "లక్ష్మి గారి గురించి" చదివిన తరువాత ఒకటి అనిపించింది. నిజానికి వీళ్ళిద్దరూ పోరాడినట్టే ఈ సమాజం లో ప్రతి ఒక్కడూ వ్యవస్థతో న్యాయం కోసం పోరాడటానికి సిద్ధం గానే ఉంటాడు. అయితే ఆ ఊపు ఎంత కాలం కొనసాగిస్తారన్నదే అసలు సమస్య. ఏదో ఒక స్థాయిలో రాజీ పడిపోతారు.

    తుది వరకు పోరాడిన ఈ ఇద్దరూ, వాళ్ళని మాకు పరిచయం చేసిన మీరు అభినందనీయులు.
    చేతన్ గారు తన పోరాటం (ఇంకా కొనసాగుతున్నందున) లో విజయం సాధించాలని మన:పూర్తిగా కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. WP,

    ur blog is good. i like the topics u r writing and the clarity thoughts. your blog will not become popular because the posts are taxing on the readers brain. we need something light and enjoyable

    రిప్లయితొలగించండి
  8. SHANKAR.S గారు,

    నమస్కారం. మీ అభినందనలు తప్పకుండా వాళ్ళకి అందజేస్తానండీ. మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. ఈ ధారావాహికలో రాయాల్సింది ఇంకొక్క కథ ఉంది. త్వరలో రాస్తాను.అదికూడా చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

    @అజ్ఞాత,
    Thank you :)

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మి గారికి అభినందనలు.
    అధికారులు చట్టప్రకారం నడుచుకుంటున్నామని భ్రమలో ఉంటారు(?)
    కాని పరిస్థితులను గమనించరు.

    రిప్లయితొలగించండి
  10. "ఈ ధారావాహికలో రాయాల్సింది ఇంకొక్క కథ ఉంది. త్వరలో రాస్తాను.అదికూడా చదివి మీ అభిప్రాయం చెప్పగలరు. "
    ఏది సార్ ఆ కథ? జనాలకి స్ఫూర్తి నిచ్చే గాధల్ని వదిలేసి అనవసర పోస్టులపై దృష్టి సారిస్తున్నారేంటి?

    రిప్లయితొలగించండి
  11. SHANKAR.S గారు,

    ఆ కధలో కొత్త మలుపులు వచ్చాయండీ. అవి ఒక దారికొచ్చాక రాద్దామని ఆపాను.

    ఇంక అనవసర విషయాలకొస్తే, ఏదో మామూలుగా చర్చ చేస్తారనే ఆశతో ప్రయత్నించానండీ. కానీ మీలాంటి, నాలాంటి వాళ్ళకి నచ్చని రీతిలో చర్చ సాగిపోతుంది. దానికి తోడు నిన్నట్నుండి నా బ్లాగల్ ప్రొఫైల్ లో ఏదో సమస్య కామెంట్ మోడరేషన్ కూడా పోయింది.

    రిప్లయితొలగించండి