31, డిసెంబర్ 2010, శుక్రవారం

శ్రీ క్రిష్ణ కమిటీ ఏం చెప్పొచ్చు !!

తెలంగాణా వస్తుందనీ, రాదనీ, ఇది ఒట్టుట్టి కమిటీ అనీ రక రకాల ఊహాగానాలూ, రాజకీయ ఎత్తుగడలూ జనవరి 6 న రిపోర్టు బహిర్గతం అయ్యే వరకూ సాగుతూనే ఉంటాయి.


సరే కమిటీ ఏం చెప్పడానికి అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ కమిటీ ఒక నిర్ణయాన్ని వెలువరించదు. కొన్ని పరిష్కార మార్గాలనీ, వాటి లోటు పాట్లనీ చెప్పి ప్రభుత్వ నిర్ణయానికి కావలిసిన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. తద్వారా ఏదో ఒక పరిష్కార మార్గం వైపుకినడిపించగలిగే అవకాశం ఉంది. స్థూలంగా ఉన్న పరిష్కార మార్గాలు 3:
  1. తెలంగాణా ఇవ్వడం
  2. సమైఖ్యాంధ్రప్రదేశ్ ని కొనసాగించడం
  3. కొన్ని అంశాల (రాయలసీమ, హైదరాబాదు, నీటి వనరులు, ఉద్యోగులు etc.. )పరిష్కారం తరువాత తెలంగాణా ఇవ్వడం
నా దృష్టిలో 3వ మార్గం వైపుగా కమిటీ రిపోర్టు ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణా ఇవ్వడానికి అంగీకరిస్తూనే, కొన్ని కీలక మైన అంశాలని ఏవిధంగా, ఎంత సమయంలోపు ఎలా పరిష్కరించాలో సూచించి ఆ తరువాత తెలంగాణా ఇవ్వొచ్చు అనే పరిష్కారం వైపు కమిటీ రిపోర్టు మొగ్గు చూపే అవకాశం ఉంది.


2009 డిసెంబరు 10వ తారీఖున ఒక కాంగ్రేస్ వాది కాంగ్రేస్ పార్టీకి సమర్పించిన ఒక నివేదికని నా ఆంగ్ల బ్లాగులో పొందు పరిచాను. చూడాలంటే ఇక్కడ నొక్కండి.

27, నవంబర్ 2010, శనివారం

KCR కాంగ్రేస్ ని బలపర్చమని చెప్పడంలో మర్మం ఏంటి?

మామూలుగా అందర్నీ దుమ్మెత్తిపొసి, భూస్థాపితం గావించే KCR కాంగ్రేసుని బలోపేతం చెయ్యమని ఎందుకు చెప్పాడని అందరికీ సందేహం వచ్చింది. దీని మీద రకరకాల విశ్లేషణలు మీడియాలోనూ, బ్లాగుల్లోనూ వచ్చాయిగానీ నాకయితే సరైన సమాధానం దొరకలేదు. ఏమై ఉంటుంది?


KCR కి కావలిసింది తెలంగాణా రాష్ట్రం. మరట్లాంటప్పుడు కాంగ్రేసుని బలోపేతం చేయడం KCR కి ఎందుకు పనికొస్తుంది?


మీకేమైనా అర్థమయితే చెప్పండి ప్లీజ్..

18, నవంబర్ 2010, గురువారం

జయహో జయలలిత: శభాష్ సుబ్రమణ్య స్వామి: పాపం మన్మోహన్


2G స్కాము లో చివరికి రాజా తన పదవి వదులుకోవడం కొంతవరకూ సంతోషించవలసిన విషయమె. అసలన్ని ఆరోపణలు వస్తున్నా ఇంత కాలం పదవిలో ఉండగలగడం మాత్రం చాలా ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో మాత్రం కరుణానిధీ, రాజా వంటి వాళ్ళ మొక్కవోని దీక్షా, పట్టుదలా మొదలైన వాటిని బహుశా భవిష్యత్తులో పాఠ్యాంశాలుగా చేర్చవచ్చేమో!
 


సొంత పార్టీలో మాత్రం, కాంగ్రేస్ ఈ మధ్య కొంచెం బానే స్పందిస్తున్నట్టు అనిపిస్తుంది. శశి థరూర్, అశోక్ చవాన్, సురేష్ కల్మాడి విషయంలో జాప్యం లేకుండా తీసుకొన్న నిర్ణయాలు కొంతవరకూ అభినందిచదగ్గవే. కానీ సంకీర్ణ రాజకీయాల వల్ల రాజా విషయంలో చాలా జాప్యమూ, తాత్సార ధోరణీ కనపడిందనేది బహుశా కరడుగట్టిన కాంగ్రేస్ అభిమానులు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఏంటి ఒప్పుకునేది నా పిచ్చిగానీ, అట్టా ఒప్పుకుంటే అసలు వాళ్ళు కరడుగట్టిన కాంగ్రేస్ గుడ్డెద్దులెలా అవుతారు?


ఇంతా చేస్తే పాపం అనిపించేది మన్మోహనుడి విషయమే. మిగతా విషయాలెలా ఉన్నా, వ్యక్తిగత నిజాయితీలో ఉత్తముడుగా ఉన్న ప్రధాని కూడా ఈ విషయంలో పరిస్థితుల ప్రభావం వల్ల సుప్రీం కోర్టు చేతిలో మొట్టికాయలు తినవలసి రావడం.. వ్యవస్థకి మంచిదే గానీ ఆయనకి మాత్రం కొంచెం ఎక్కడో మండే విషయంలాగే ఉంది. అయినా ఈ పెద్దొళ్ళ మంటలన్నీ, వాళు రిటైర్ అయ్యాకా, పుస్తకాలు రాశాకగానీ మనకి వెలగవు.


ఈ మొత్తం విషయంలో సుబ్రమణ్య స్వామి గారి పాత్రని మాత్రం ఎంత పొగిడినా తక్కువే. మీడియా పాత్ర కూడా తక్కువేంగాదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి లేక పార్టీ మాత్రం జయలలిత and AIADMK. ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలూ, రాజాని తీసెయ్యమనీ, ప్రధానిని తప్పుకొమ్మనీ పై పై రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటే, నిజంగా ఆ పని చేయటానికి ప్రభుత్వానికి కావలిసిన ధైర్యాన్ని ఇచ్చి చాలా బాధ్యాతయుతంగా వ్యవహరించారు.


In general.. I think the recent trend of showing at least some accountability in cases of high profile corruption is a good sign. I think it is definitely a signal that is announcing the arrival of Indian middle class..on to the political spectrum. What do you think?  

12, నవంబర్ 2010, శుక్రవారం

పెద్ద పెద్ద విప్లవాలొద్దు, మనలో ఒక చిన్న మార్పు చాలు

మన రాజకీయాల్లోనూ, వ్యవస్థలోనూ ఉన్న ఎన్నో సమస్యలూ వైవిధ్యాల గురించి అలోచనలూ భావ సంఘర్షణలూ రోజూ ఎదురవుతూనే వుంటాయి మనకు. అవినీతి, అవగాహనా రాహిత్యం, రకరకాల వివక్షలూ, అతిగా ఊహించుకుని చూసే ఆభిజాత్యాలూ ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో..


నా దృష్టిలో అనేక సమస్యలకు కారణాలుగా కనిపిస్తూ, పరిష్కారాలకు అడ్డంకిగా అనిపిస్తున్న అతి ముఖ్యమైన విషయాలుగా కనిపించేవి:
  1. రాజకీయ అవినీతి
  2. సమాజంలో నాయకత్వ లోపం
  3. రాజకీయాలకీ, వ్యవస్థకీ ప్రజలు వీలైనంత దూరంగా ఉండడం
  4. మన వ్యవస్థ పనితీరులో పారదర్శకత లోపించడం
  5. ఇంతపెద్ద వ్యవస్థలో మార్పు మనవల్ల అయ్యే పనేనా అనే నిస్పృహ
ఇవేకాకుండా ఇంకా అనేక సమస్యలు ఉనాయి. అయితే పరిష్కారాలు మాత్రం ఎదో అలా కొంతమంది మేధావులు చెప్పే చిట్కాల్లా సులువుగా ఉండవు. అసలు నాదృష్టిలో సులువుగా కనిపించే మార్గం అంత నమ్మదగినదిగా అనిపించదు. అనేకనేక సమస్యలకి పైన మనం చెప్పుకున్న సమస్యలు మూలకారణాలైవుంటాయి. వీటన్నింటి పరిష్కారానికి చాలా వరకు దోహద పడగలిగే మార్పులేవైనా వుంటే వాటిని ముందుగా చేసుకొంటే వ్యవస్థలో మార్పు కొంత వేగంగా జరిగె అవకాశం ఉంది.


నా దృష్టిలో స్థానిక ప్రభుత్వాలని (Local Governments ) బలోపేతం చేయడం అటువంటి మార్గాలలో అతి ముఖ్యమైనది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఈ దిశగా అవసరమైన చర్యలు మొదలు పెట్టాం గానీ అనుకున్నంత పురొగతి సాధించలేదు. అందుకే రాజ్యాంగం నిర్దేశించినట్టు మొత్తం 29 అంశాల మీదా నిధులూ, విధులూ, అధికారాలు స్థానిక ప్రభుత్వాలకి నిజంగా అప్పగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా సమర్ధించడం చాలా అవసరం.
     
మనమొక్కళ్ళమే ఇంత పెద్ద వ్యవస్థని మార్చగలమా అనే సందేహాల్ని కాసేపు పక్కనబెడితే, మన పరిధిలో వీలైనంత వరకూ స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కృషిచేసే ప్రయత్నాలకు మద్దత్తు నివ్వడం, స్థానిక ప్రభుత్వాల పని తీరులో వీలయినంత పార్టిసిపేషన్ చెయ్యడం చేస్తే భావితరాలు ఖచ్చితంగా మెరుగైన భారత దేశాన్ని చూడగలుగుతారు.  ప్చ్ .. డౌటే అంటారా? బానే వుంది చూద్దాం అంటారా? 

19, అక్టోబర్ 2010, మంగళవారం

వృత్తి ధర్మాన్ని మంటగలిపిన డాక్టరు-మానవత్వాన్ని పంచిన స్వీపరు

నిన్న వార్తల్లో రెండు వేర్వేరు సంఘటనలు మనసుని కలిచి వేసేవి ఉన్నాయి. ఒక దాంట్లోనేమో, ముగ్గురు అక్క చెల్లెళ్ళను (పెద్ద పాప కి మూడేళ్ళనుకుంటా!) జమ్మూ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిన తండ్రి. రాం పాల్ అనే సదరు తండ్రి ని వెదికి ఎలాగొ పోలీసులు చివరికి పట్టుకోగలిగారనుకోండి. ఇతగాడు చెప్పేదెమిటంతే, ఆ పిల్లల తల్లి ఒక వివాహేతర సంబంధం కారణంగా కొన్నళ్ళ క్రితం ఎటో వెళ్ళిపోయిందట. ఇతగాడు పిల్లల్ని పెంచలేనని వదిలించుకున్నాడట. పిల్లల్ని తిరిగి స్వీకరించడానికి ఇతగాడు ససేమీరా అంటున్నాడు. ఇక ఆ మహ తల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి పిల్లల్ని ఒక అనాధాశ్రమంలో ఉంచి తదుపరి చర్యల కోసం పాపం అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఆ స్టేషన్ లో స్వీపర్ గా పనిచేసే గురుదేవ్ సింగ్ ఈ పిల్లల్ని గమనించి, చేరదీసి, అధికారులకు తెలియచేసి, ఆ రాత్రంతా నిద్రపోకుండా వారికి సేవలు చేసారు. వృత్తిధర్మాన్నేకాదు మానవత్వాన్నికూడా నిలబెట్టిన ఇటువంటివాళ్ళే ఆదర్శప్రాయులు.


ఇక రెండో వార్త విషయానికి వస్తే, డాక్టరుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో గౌరవం, ధనం బాగా సంపాదించుకున్న ఒక పిశాచి విశృంఖలత్వం మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తుంది. అచేతనావస్తలో ఉన్న ఒక రోగితో లైంగిక వాంఛ తీర్చుకున్నాడట కామాంధుడైన ఈ ముంబై డాక్టరు. పవిత్రమైన వృత్తి ధర్మాన్నీ, మానవత్వాన్నీ మంట గలిపాడు.


ఈ రెండు వార్తలూ చదివింతర్వాత బాధతో నిండిన హృదయం, ఆలోచనలోతో నిండిన మనసూ తప్ప, పరిష్కారం సూచించే మెదడు  మాత్రం తాత్కాలికంగా పని చేయడం మానేసింది.

4, అక్టోబర్ 2010, సోమవారం

అయోధ్య తీర్పు - సహేతుకమైన నిర్ణయం? కొన్ని ప్రమాద సూచికలు?

తీర్పు వచ్చేసింది. భారతీయులంతా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారనే నిరాశావాదులకి కళ్ళు తెరుచుకునేలా ప్రజలు స్పందించారు. అసలు తీర్పు సంగతి అటుంచితే, మన సమాజం 1992 నుండి 2010 లోకి వచ్చేసింది అనేది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.


[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]


అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు. 


అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!


ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!

29, సెప్టెంబర్ 2010, బుధవారం

సున్నీ వక్ఫ్ బోర్డ్ Vs. రామ జన్మభూమి న్యాస్


రేపు రాబోయే తీర్పు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తీర్పు తదనంతరం తలెత్తే అవకాశం ఉన్న దుష్పరిణామాల దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అభినందనీయమే. ప్రధాన పార్టీలన్నీ, తీర్పు ఏవిధంగా వున్నా గౌరవిస్తామనీ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలనీ, ఆవేశకావేశాలకు దూరంగా ఉండాలనీ ప్రజలకు పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. అన్ని పార్టీలూ ఇటువంటి వైఖరి తీసుకోవడం, మొత్తంగా మన రాజకీయ వ్యవస్థ పరిణతిని సూచిస్తుందనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. 1992 లోని మనకీ 2010 లోని మనకీ ఎంతో తేడా ఉంది అనేదానికి ఇంతకంటే ఉదాహరణలింకేం కావాలి?


మన జనాలంతా రేపేదో భయంకరమైన ఉన్మాదంలోకి వెళ్ళి పోతారేమో అనిపించే కధనాలు మీడియా కొంచెం తగ్గిస్తే బావుండేది కదూ? కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహం చూస్తుంటే, రేపేమీ జరగక పోతే బాధ పడేట్టున్నారు. ఒకటీ అరా అక్కడక్కడా జరిగే చెదురు మదురు సంఘటనలని ఎక్కువ చేసి చూపి, మొత్తం సమాజాన్ని ఉన్మాదులుగా చిత్రీకరించేంత దుస్సాహసానికి ఒడిగట్టరనే ఆశిద్దాం.


అయోధ్యలోని మందిరం లేక మసీదు మాత్రమే ఈ దేశం లోని హిందువులకూ, ముస్లీములకూ తమ సగర్వమైన అస్థిత్వాన్ని చాటి చెప్పే ఏకైక మార్గం కాదు. భారతీయులుగా మన జీవితాల్లోనూ, హిందూయిజం లోనూ, ఇస్లాంలోనూ అంతకంటే విలువైనవెన్నో వున్నాయి.