23, జనవరి 2012, సోమవారం

రష్డీ ఇండియాకి ఎందుకు రాకూడదు ?

సల్మాన్ రష్డీ రాసిన పుస్తకాల మీదా ఇంతకు ముందు వివాదాలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు పుస్తకం మీద వివాదం అవసరమా, లేదా అనేది వేరే విషయం అనుకోండి.


ఆయన ఇప్పుడు మన దేశంలోకి రావటానికి వీల్లేదని కొంతమంది ఫత్వా జారిచేశారంట. ఆయన పుస్తకాలమీద విమర్శలు చేసుకోండి.. కానీ, అసలు రానియ్యం, రావటానికి వీల్లేదు అనటానికి వీళ్ళెవరు? ఇటువంటి బెదిరింపులకి దిగేవాళ్ళని కట్టడి చెయ్యాలిగానీ శాంతి భద్రతలకి భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి రావొద్దని ప్రభుత్వాలు చెప్పడం సిగ్గు పడాల్సిన విషయం. బయటకొస్తే రేపులు జరుగుతున్నాయ్ కాబట్టి స్త్రీలెవ్వరూ బయటకి రావొద్దని చెప్పినట్టు లేదూ !


వివాదం మొదలయ్యి, కొంతమంది ఉన్మాదులు ఆయన్ని చంపడానికి బహిరంగంగా ఫత్వాలూ గట్రా జారీ చెయ్యడం జరిగాక ఆయనొక నాలుగైదు సార్లు ఇండియా వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు కొత్తగా సమస్య ఏంటి అనే సందేహం రాక మానదు. కాకపోతే దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తుంది కాబట్టి, మన ఉన్మాదులంతా ఇదే సందు ప్రభుత్వాలని డూ డూ బసవన్న ఆడించడానికి అని అతిగా రెచ్చిపోయారు. ఈ ప్రభుత్వాలేమో అలవాటుగా తలాడిస్తున్నాయి అని సరిపెట్టుకోబోయాం గానీ.. ఇంకా ప్రమాదకరమైన విషయాలే ఇందులో ఉన్నట్టనిపిస్తుంది. అసలు వివాదమే ఎన్నికల కోసం సృష్టించబడింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుత్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజమైతే, అది అత్యంత దురదృష్టకరం, గర్హనీయం.


సాధారణంగా పార్లమెంటులో  మాట్లేడేటప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతారో అంతే అధ్వాన్నంగా బయట మాట్లాడగల మన ఒవైసీ మహాశయుడు గారు, తమ వంతుగా కొన్ని బెదిరింపులు (నర్మగర్భంగానే అనుకోండి) చేసి అవతల పడేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు మన హైదరాబాద్ లో నానా వీరంగం సృష్టించారు. కాకపోతే, అలా చేసిన ఉన్మాదుల చర్యలని ఖండించి ప్రభుత్వాలు వాళ్ళకి ముందస్తుగా తలొగ్గలేదని సంతోషించాం. ఈ సారి మరీ తలదించుకునేలా ప్రభుత్వాలు ప్రవర్తించాయనడం లో తప్పులేదు. మీరేమంటారు?

17, జనవరి 2012, మంగళవారం

An ugly manifestation of వర్ణ(కుల) వ్యవస్థ

ఈ రోజు ఒక వార్తా పత్రికలో(AndhraJyothi) వచ్చిన వార్త ఇది. అసలేం జరిగింది, కధనంలో పోరపాట్లు ఎంతవరకూ ఉండొచ్చు అనేవి ఇంకా పెద్దగా తెలియదనుకోండి. కానీ, చాలా వరకు అక్కడ జరిగిందాన్ని అర్థం చేసుకోవచ్చు.

మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం ఏదుట్లలో బోనాల వేడుక ఘర్షణకు దారి తీసింది. అందరూ కలిసి బోనాలు నిర్వహించాలన్న విషయంపై దళితులు, అగ్రవర్ణాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా కొందరు రాళ్ల దాడికి పాల్పడడంతో పోలీసులతో పాటు ఇద్దరు గాయపడ్డారు. ఏదుట్లలో ప్రతి ఏడాది సంక్రాంతి, కనుమల సందర్భంగా కోటమైసమ్మకు బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి రోజు అగ్రవర్ణాలు, కనుమ రోజు దళితులు బోనాలు నిర్వహించడం చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తాము కూడా సంక్రాంతినాడే బోనాలు తీసుకెళ్తామని కొందరు దళితులు ఇటీవల తహసీల్దార్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరున ఏదుట్ల పంచాయతీ ముందు కులవివక్షపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి రోజే దళితులు, అగ్రవర్ణాలు కలిసి బోనాలు తీసుకెళ్లాలని తహసీల్దార్ తీర్మానించారు.


అయితే 15న సంక్రాంతి సందర్భంగా అగ్రవర్ణాల వారు బోనాలకు వెళ్లకుండా టెంకాయలతో మైసమ్మకు మొక్కు తీర్చుకున్నారు. కొందరు దళితులు బోనాలు తీసుకెళ్తామని పోలీసులకు తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య బోనాలతో బయలు దేరారు. కోటమైసమ్మ గుడికి సమీపంలో కొందరు వారిని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్థులను చెదరగొట్టేందుకు యత్నించారు. అదే సమయం లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకట్లో ఓ వైపు నుంచి రాళ్ల దాడి జరిగింది. దాడిలో పోలీసులతో పాటు రేమద్దులకు చెందిన రాములు, గోపాల్‌పేటకు చెందిన రఘు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దళితులు బోనాలను రోడ్డుపక్కనే ఓ అరుగుపై దించేసి వెళ్లిపోయారు. పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరిపారు. బోనాలను పోలీసు వాహనంలో తీసుకెళ్లి పాఠశాల భవనంలో భద్రపరిచారు. సోమవారం దళితులు బోనాలకు వెళ్లాల్సి ఉన్నా, తాము వెళ్లబోమంటూ వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉండడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

అందరూ ఒకే రోజు బోనాలు జరుపుంటే ఏంటి నష్టం? ఎందుకు జరుపుకోకూడదు ? ఇప్పుడక్కడ పోరాటాలు చేసి ఖండించి దళితులు కూడా సంక్రాంతి రోజే బోనాలు జరుపుకునేలా చేస్తే మనం బాగుపడిపోయినట్టేనా ?

దళితులతో కలిసి చేసుకునేట్టయితే మేమసలు బోనాలే చెయ్యం అని అగ్ర వర్ణాల వాళ్ళు అంటే ఏం చెయ్యాలి ?

అసలు మన మీదా మన మెదళ్ళమీదా ఈ అత్యంత దుర్మార్గమైన వర్ణ/కుల వ్యవస్థ ప్రభావం లేదా? పుట్టుకని బట్టే మనుషుల్ని అంచనా వేసే దురాచారం వేరు వేరు రూపాల్లో మనలో కూడా ఉందా ?

ఇటువంటి సంఘటనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందీ, ఆచరించాల్సిందీ ఏంటి?