22, మార్చి 2012, గురువారం

అయ్యా రవి శంకరు గారూ, మీరు కాస్త... ;)

ప్రభుత్వ పాఠశాలల్లో చదవే వాళ్ళ నుండే నక్సలైట్లు వస్తారనీ, హింసా ప్రవృత్తి ఉంటుందనీ సెలవిచ్చారట శ్రీ శ్రీ రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్ ) గారు. పైగా అసలు ప్రభుత్వాలు స్కూళ్ళు నడపగూడదనీ, స్కూళ్ళని పూర్తిగా ప్రైవేటు పరం చెయ్యాలని కూడా ఒక అభిప్రాయాన్ని ప్రవచించారంట.

ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన గొప్ప వారైతే అయ్యుండొచ్చు గానీ, మిగిలిన విషయాల్లో ఆయన ఆలోచనలూ, అభిప్రాయాలూ ఇంత అపరిపక్వంగా ఉన్నాయనేది చాలా నిరాశ కలిగించే విషయం.

ఆయన ప్రైవెటు రంగం గొప్పదనం గురించి బాకా ఊదాలనుకుంటే అది ఆయన హక్కు, మనం విమర్శించొచ్చు కానీ ప్రాధమిక విద్యా, ప్రాధమిక ఆరోగ్యం లాంటి వాటి నుంచి కూడా ప్రభుత్వాన్ని వైదొలగి ప్రైవేటు పరం చెయ్యమని చెప్పడానికి ఆయన ఎంచుకున్న లాజిక్ మాత్రం హాస్యాస్పదంగానూ, ఆలోచనారహితంగానూ, అవగాహనా లోపంగానూ కనిపించక మానదు.

ఆధ్యాత్మిక విషయాల్లో అంత పేరు ప్రఖ్యాతులు  ఉండీ, చాలామంది జనాలని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయ, ఆర్థిక విధానాల గురించి మాట్లేడే టప్పుడు, చాలా ఆలోచించి మాట్లాడాలని ఆశించడం అత్యాశ కాదనిపిస్తుంది.