26, ఆగస్టు 2010, గురువారం

MPలకి జీతాలివ్వాలా? ఇస్తే ఎంతివ్వాలి?


మన MP ల జీతాలు 16000 నుండి 50000 కి పెంచారు. దాని మీద కొంత వ్యతిరేకతా కూడా వినిపించింది. చాలా మంది ఎందుకు వీళ్ళకి జీతాలు పెంచాలి? ఎలాగూ ఆడ్డదిడ్డంగా తినేస్తున్నారుగా? ఇప్పుడేమైనా ఆపేస్తారా? అని అనుమాన పడుతున్నారు. అసలు పార్లమెంటుకే వెళ్ళరు, వెళ్ళినా పార్లమెంటులో అరుచుకోవడం తప్ప వీళ్ళు చేసేదేముంది అని అనేవాళ్ళు కూడా కొందరున్నారు. అసలు ప్రజాసమస్యలిన్నుంటే వాటిని గాలికి వదిలి తమ సొంత జీతాలకోసం పాకులాడటమేంటనే ధర్మసందేహం కూడా చాలా మందికి కలిగుండొచ్చు..నాకేమనిపిస్తుందంటే,


  1. ఆసలు MP ల జీతాలు ఇంకా పెంచాలి. ఆదే మోస్తరు ప్రభుత్వోద్యొగులకి ఎంత వుందో కనీసం అంత జీతాలు ఇస్తే నష్టమేంటి? వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే కాదా అనేది చాలా అసందర్భం.
  2. సేవ చెయ్యడానికి వచ్చినోళ్ళకు జీతాలెందుకు అనేది బేసిక్ ప్రశ్న. అయితే.. ఎవరినైనా ఉచితంగా సేవ చెయ్యమని ఒక సమాజంగా మనమెందుకడగాలి? వాళ్ళు చేసే పనికి న్యాయమైన వేతనం ఇస్తే తప్పేం లేదు కదా!
  3. జీతభత్యాల వ్యవహారాన్ని నిర్ణయించే పద్దతి మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంది(ఇప్పుదున్నపరిస్థితుల్లో వేలైనంత బాగానే స్టడీలూ, కన్సల్టేషన్లూ చేశారనుకోండి). ఎంతయినా పాపం వాళ్ళ జీతాలు వాళ్ళే నిర్ణయించుకోవడం కొంచెం ఇబ్బందే (వాళ్ళకీ మనకీ కూడా). ఇండిపెండెంట్ అథారిటీ ఎవరైనా నిర్ణయించే ఏర్పాటు వుంటే బావుంటుంది. (For example, Supreme Court Chief Justice )

ఎలా చేస్తే బావుంటుందంటారు? మీరేమంటారు? ఏంది అబ్బాయా, అన్నీ నువ్వే చెప్పేసి మమ్మల్నడుగుతావు అనకండేం! ఎందుకంటే మీ అందరిదగ్గరా చాలా పెద్ద ఆలోచనల ఖజానా ఉందని నాకు తెల్సు. ఒక్కసారి అప్ప్రైసల్ టైం లో మీరు ఎలా ఆలోచిస్తారో యాద్కి తెచ్చుకోండి.. ఆలోచనలు పరిగెత్తుకుంటూ రావూ!

25, ఆగస్టు 2010, బుధవారం

పెన్సిళ్ళ చాటున దాచేస్తే దాగని భావదారిద్ర్యం...

ఎవరైనా ఒక విషయం మీద వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు ఇతరులు దానితో విభేదించడమో, అంగీకరించడమో లేక వేరే కోణంలోంచి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమో లేక విని ఊరుకుండడమో చేస్తారు అని అనుకునే వాణ్ణి. అయితే ఈ మధ్య కొత్త కొత్త పోకడలు కొన్ని వచ్చినట్లున్నాయి.. అంటే తమ అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఇంకేదో విషయంలో వాళ్ళ స్పందన చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒక కుహనా మేధావులు అని ఒక ముద్ర తగిలించేసి హాయిగా తప్పుకొని విషయాన్ని పక్కదారి పట్టించడం. ఈ పోకడ ఇంటర్నెట్లోనూ బాగానే ప్రబలుతున్నట్లుంది.


ఉదాహరణకు, స్త్రీవాదానికి మద్దత్తుగా మాట్లడామో అంతే.. మహిళల వైపునుంచి జరిగే పొరపాట్లన్నిటికీ నువ్వే బాధ్యత తీసుకోవాలి లేదంటే నువ్వొక కుహనా స్త్రీవాదివి అంటారు. మీరు ఏదైనా మతపరమైన విషయం మీద మాట్లాడారో, ఇంక అంతే.. వచ్చేస్తారు మన వాళ్ళు.. ఫలానా  మతంలొ జరిగిన విషయాన్ని నువ్వు ఖండించలేదు కాబట్టి నువ్వు చెప్పేదాంట్లొ అర్థం లేదు అంటారు. ఒక విషయం మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళు అన్నింటిమీదా గుత్తాధిపత్యం తీసుకోవాలి అన్నట్లు. అదేదో వీళ్ళే ఖండించొచ్చు కదా!!


ఏవో కొన్ని ప్రశ్నించరాని సూత్రాలూ, నమ్మకాలూ మనసులో పెట్టేసుకోని వాటిని ఎవరైనా ప్రశ్నించడమో లేక కొత్త దృక్పధాన్ని తేవడమో చేస్తే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వారి మీద విపరీతమైన ద్రోహులుగా ముద్ర వెయ్యడం లాంటివి చేస్తారు. ఇంక చూస్కో నా సామిరంగా విమర్సల జడివాన, వ్యక్తిగత దాడి..నషాలానికి అంటుద్ది వేడి.


అవతలి వ్యకి యొక్క వ్యక్తిత్వం మీద  దాడి చేసి వాళ్ళు చెప్పే విషయాన్ని మరుగు పరచెందుకు ప్రయత్నించడం కూడా ఈ కోవలోకే వచ్చే ఇంకో పద్దతి. ఉదాహరణకు.. కె సి ఆర్ మొదట్లో తెలంగాణా వాదన వినిపించినప్పుడు, ఆ వాదం గురించి చర్చ చెయ్యకుండా, ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్నాడనీ, బాగా తాగుతాడనీ (అంతకుముందు తెలియనట్లు!!) చిత్ర విచిత్ర మైన ప్రయత్నాలు చేశారు. తప్పనిసరి పరిస్థితులొచ్చాక మాత్రమే అసలు విషయం (తెలంగాణా వాదం) గురించి చర్చ మొదలయ్యింది. అప్పటికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది.


పోనీ అతి జాగ్రత్తగా విషయాన్ని వివరించామో, అయ్యుండొచ్చు కానీ.. మా మనోభావాలు దెబ్బతిన్నాయంటారు. లేదంటే, సగటుమనిషి అనే మిథికల్ క్రీచర్ వెనకాల దాక్కుంటారు. ఎలాగంటే.. అప్పటి దాక చూపటానికి ప్రయత్నించిన మేధావితనాన్ని పక్కన పెట్టి, సగటు మనిషి కి ఇలా చెప్పకూడదు అది సమాజానికి మంచిది కాదు అనటం, లేదంటే.. నేను ఒక మామూలు డీసెంట్ సగటు మనిషిని నేనింతే అంటారు.


ఇలాంటి వాళ్ళకు ఆలోచించే ఓపికా, అర్థం చేసుకొనే సహనం లేకపోవడం వల్ల ఒకరకమైన నూతిలో కప్ప మనస్తత్వం అలవాటై పోయుంటుంది. తమకు తెలిసిన దాన్ని ప్రశ్నించినా లేక వేరే ద్రుక్కోణం చూపించినా అది తమపై జరిగిన వ్యక్తిగత దాడిగా భావించి ఒకరకమైన ఆత్మన్యూనతలో మునిగిపోతుంటారు. వెంటనే తమకు చిన్నప్పటినుంచీ ఎలా అన్ని వర్గాల ప్రజలతో స్నెహం ఉండేదో, తాము చిన్నప్పుడు ఎంత మందికి పెన్సిళ్ళు గట్రా ఇచ్చేసి ఉధ్దరించేశారో ఏకరువుపెట్టి, తమ భావదారిద్ర్యాన్ని వ్యక్తిగత మంచితనం వెనక దాచేస్తుంటారు.


ఇలాంటి అనుభవాలు మీకూ ఎదురయ్యే వుంటాయికదూ! ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు అని ఉండరేమోగానీ, ఈ రకమైన బలహీనతకి చాలామంది కొన్ని కొన్ని సందర్భాలలో లోనవుతుంటారేమో అనిపిస్తుంది. ఈ బలహీనత నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి.. ఆరోగ్యకరమైన చర్చా, అర్థవంతమైన ప్రశ్నలూ లేకపోతే ఆ సమాజం తిరోగమనంలో పడిపోయినట్టే..

24, ఆగస్టు 2010, మంగళవారం

సోనీ TV శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరడం ఒక చారిత్రక అవసరం


శ్రీరాం అదేదో పాటల పోటీలో గెలిచాడు. మంచి సింగర్. మన తెలుగువాడే అవటం మరింత ఆనందంగా వుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద మన తెలుగు బ్లాగర్లు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. బ్లాగు బాబ్జీ SMS మోసాన్ని ఎత్తి చూపడం, మరో బ్లాగరెవరో, శ్రీరాం తమిళంలో మాట్లాడాడనే విషయాన్ని కూడా లేవనెత్తారు. మొత్తమ్మీద అనేక దృక్కోణాలు వెలుగులోకి వచ్చాయి. నాకు మాత్రం ఇంకా అర్థం కాని విషయాలు చాలా వున్నయి.


అసలు తెలువాడిని గెలిపించమని అంత వెఱ్ఱెత్తి పోవడం అవసరమా? బాగా పాడుతున్నాడు అని ప్రచారం చేసుంటే బావుండేది.


ఇక మనవాడు హైదరాబాదు వస్తే అద్భుతమైన స్వాగతం ఇచ్చారు. ఒక విజయ యాత్ర తరహాలో. అది సరిపోనట్టు మన ముఖ్యమంత్రి దారినపోయే దానయ్యగారు, విలువైన సమయాన్ని బాగానే కేటాయించి అదేదొ అవార్డు కూడా కట్టబెట్టారు. సోనీ TV లో గెలిస్తే అర్జంటుగా అవార్డ్ ఇవ్వాల్సిన అవసరం వుందా? అసలు పాటల పోటీ లో గెలిచినందుకు ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? పోటీలో గెలిచి ఆల్రెడీ డబ్బు సంపాదించు కున్నాడు. మన తెలుగు వాడూ,  పైగా మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కదా!
ఆయినా ఇతగాడు ఆ విజయ యాత్ర చేయడం మాత్రం మరీ టూమచ్. అదీ ఈ పరిస్థితుల్లో .. అసలేమనుకుంటున్నారు? ఏదైనా యాత్ర చెయ్యాలంటే ఇలాగేనా చేసేది? ముందు అహ్మద్ పటేల్ సోనీTV వాళ్ళతో చర్చించాలి, తరువాత శ్రీరాం తల్లిదండ్రులు వీరప్ప మొయిలీ ని కలవాలి, ఆ తరువాత వీహెచ్, కేకే,కాకా, శంకర్రావు మొదలైన వాళ్ళ జట్టు తో అంబటి రాంబాబు, సురేఖ జట్టు కబడ్డీ మాచ్ ఆడాలి, ఆ తరువాత రోశయ్య జనాలని వెళ్ళవద్దని చెప్పాలి, ఆ తరువాత వీలైతే గెలిచిన కప్పుని ఒక చోట పెట్టి అందరూ ఒకేసారి చూసే అవకాశం వుందేమో పరిశీలించాలి. ఇవన్నీ లేకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు యాత్రలు చేస్తే ఈ దేశం ఏమైపోవాలి? కనీసం, శ్రీరాం జగన్ దగ్గర ట్యూషన్ చేరుండాల్సింది. 


రాజకీయ యాత్రలకి జనాలు వస్తున్నారా, తరలిస్తున్నారా అని బోలెడంత ఆశ్చర్యం వ్యక్తం చేసే వాళ్ళకి మాత్రం కళ్ళు తెరుచుకొనే విషయం బోధపడి వుండొచ్చు. పాటలపోటీ విజయ యాత్రకే వెఱ్ఱెత్తి పొయే జనాలని చూశాక!!

16, ఆగస్టు 2010, సోమవారం

బూజు పట్టిన వరకట్న చట్టం-మరోసారి బస్సు మిస్సయిన చట్ట సభలు


లేటెస్టు గా మరొక్కసారి తామేం చేయాలో సుప్రీం కోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది మన రాజకీయాలకి.  వరకట్న నిషేద చట్టాన్ని సవరించమని లా కమీషన్ నీ, న్యాయ శాఖ నీ సుప్రీం కోర్టు ఆదేశించింది. IPC సెక్షన్ 498-A  (for dealing with cruelty of husband and relatives over dowry) చాలా ఉపయోగ పడింది, అయితే చాలా దురుపయోగం కూడా జరిగింది అని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. 
గృహ హింస నిరోధక చట్టం ఉన్న నేపధ్యం లో ఈ చట్టాన్ని సవరించడం వల్ల, దురుపయోగాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. అయితే చేయవలసిన సవరణల రూపురేఖల గురించి అన్ని వర్గాలతో చర్చ చాలా అవసరం.
రాజకీయ నాయకులు ఇప్పటికే దీని మీద చర్చ లేవనెత్తక పోవడం చాలా దురదృష్టకరం. 
మన రాజకీయాలు, ప్రజలని ఆలోచింప చేసి, మార్గనిర్దేశం చేసే పాత్రని చెయ్యవలనంత చెయ్యట్లేదు. కేవలం, ప్రజలు బజార్నబడి బస్సులు ధ్వంసం చెయ్యడమో లేక ఇదిగో ఇలా సుప్రీం కోర్టు మొత్తితేనో హడావిడిగా సంస్కరణలు చేయ వలసి వస్తుంది. 
తీరా   పీకలమీదికి వచ్చాక ప్రజాస్వామ్య పద్దతిలో చర్చ చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే వెసులుబాటు ఉండదు. మళ్ళీ తప్పులు చేసే అవకాశాలు, కొన్ని వర్గాల ఆమోదం లేక పోవడం వంటి ప్రమాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యత దెబ్బతినాల్సి రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

13, ఆగస్టు 2010, శుక్రవారం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇవ్వకపోతే మా రాజకీయ ప్రవృత్తికి తీరని ద్రోహం చేసినట్టే. పైగా మీరంతా నన్ను వీకెండ్ పొలిటీషియన్ కాకుండా వీకెన్ డ్ పొలిటీషియన్ గా అనుకునే ప్రమాదం ఉంది. ఏమాటకామాటే చెప్పుకొవాలి, సందేశాలు ఇవ్వటం, పెద్ద పెద్ద చర్చలు మొదలుపెట్టడం మనకి సహజంగానే ఉన్న ఈక్ నెస్సేలెండి:)
అసలు విషయానికి వస్తే, స్వాతంత్ర్యం ఇంకా రాలేదనీ, వచ్చింది నిజమైన స్వాతత్ర్యం కాదనీ, లేక అంతా బ్రహ్మాండంగా ఉందనీ, మనమొక్కళ్ళమే ప్రపంచంలోకెల్లా అతి గొప్ప వాళ్ళమనీ బోలెడు ఉపన్యాసాలు వస్తాయి. వాటి కైపు లో పడి అవేశమో, ఆనందమో తెచ్చుకొని ఒక రోజంతా గుండెలనిండా స్వేచ్చా వాయువులు పీల్చుకొని మళ్ళీ ఎప్పట్లాగే బండి లాగించెయ్యడం, చిన్న చిన్న జెండా బొమ్మలూ గట్రా కొని కార్లలో పెట్టేసి దేశభక్తి చాటి చెప్పెయ్యడం, అప్పడప్పుడూ సమాజ సేవ కార్యక్రమాలు కూడా చెయ్యడం, బ్లాగులు రాసుకోవడం ఇంతేనా ఇంకేమీ చెయ్యలేమా అనిపించింది.


ఆలోచిస్తే అర్థమయ్యింది, ఇదేంటి ఎమైనా చేసేదుంటే చెయ్యాలి... దానికి ప్రత్యేకంగా స్వాతంత్ర్య దినోత్సవం తో సంబంధం లేదనీ, ఈ సింబాలిక్ అకేషన్, అనుభవాలని నెమరు వేసుకొని, పరిస్థితిని అంచనా వేసుకోని, స్వాతంత్ర్యాన్ని పెంపొందించే ఆలోచనలకు శ్రీకారం చుట్టే ఒక మంచి అవకాశం అనీ. So.. let me share some of my thoughts with you all..  
 
The moment of Independence for this country was a moment of truimph, sombreness and a moment of resolve. We, the people of this country have delivered a great message to the world, learned a few lessons ourselves and started our journey into the unknown future with a resolve to continue on the path of truth and justice.

We have acheived a lot durring all these years and still have a long way to go. Our freedom has ensured a bettter life for many. Still there are many who are waiting to taste the fruits of Freedom. for those, we have succeeded in establishing Hope. To realize this hope into concrete reality, as a nation we need to work on a new kind of freedom now. That is the freedom to come out of our own self doubt, freedom from lack of trust in our fellow countrymen.


Yes we need to inculcate a spirit of trust in each other and work on freeing our minds from narrow, cynical and parochial way of looking at things. If we take a vow now to work on this new freedom our children, their children and every future child will remember us on this day in future. Yes, if we can achieve this new freedom we will continue to be a great nation and will pass on a much greater legacy to the future generations.


అయ్ బాబోయ్, వీకెండ్ పొలిటీషియన్ లో, వీకెండ్ తగ్గి పోయి పొలిటీషియన్ పెరిగిపోయాడేంటి !! 


కాబట్టి మితృలారా, బ్లాగరులారా, గేలారా, బై లారా, రౌడీల్లారా, కత్తుల్లారా, బ్లేడుల్లారా మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


PS: కొంచెం హెవీ అయినా సందర్భం అలాంటిది కాబట్టి అర్థం చేసుకొని సర్దుకు పొండి:) 

12, ఆగస్టు 2010, గురువారం

మరీ బోడి గుండయ్యేదాకా జుట్టు పీక్కోవద్దని సవినయంగా మనవి

ఈ మధ్య ఒక కామెంట్లో అడిగారు ఎవరు మన రాష్ట్రానికి సరైన నాయకుడు అని. ఇదేందబ్బా.. ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా అడిగేశారు అనిపించింది. పోనీ బ్లాగర్లనడితే ?? అమ్మో..


రౌడీ గారొచ్చి LooooL అని పోతారు. ఆ పేరుండే వాళ్ళని మనం వెదకలేం. శరత్ గారు చూశారంటే, ఈసారి అవకాశం గేలకి ఇమ్మంటాడు. కాకపోతే.. నాయకత్వం కోసం అందరూ నేను గే నేను గే అంటారెమో !! మహేష్ గారికి తెలిసిందో.. అసలు తాడిత, పీడిత జనాలకి తెలియకుండా ఏంటీ ఈ బ్లాగు selection అంటారేమో అని అనుమానం..ఇంకెవరైనా వచ్చి అసలిదంతా.. రామోజీ రావూ, సోనియా గాంధీ, నకిలీ కణిక వ్యవస్థ చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తారేమో అనే జంకు..  అమ్మో ఇంకా ఎంతమంది హేమాహేమీలు  వచ్చి ఏమేమంటారో ! ఎందుకులే..


సరే మనమే చెప్పేద్దాం. మనకేంటి భయం.. అని ఒక్కసారి చుట్టూ చూస్తే, ఆ విషయం తెలియకే..ప్రజలేమో జుట్టు పీక్కుంటున్నారు. అసలు తేల్చిపారెయ్యల్సిందే అని విపరీతంగా బుర్ర చించుకొని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ మీద దృష్టి పెట్టానో లేదో..


మహా రాష్ట్ర పోలీసులూ, ఉప ఎన్నికల ఫలితాలూ, వాళ్ళ బామ్మర్దులూ కలసి మూకుమ్మడిగా ఒక పేరు కొట్టేశారు.


ఇంకొకాయనేమో, నా ముక్క నాకు పడేస్తే నే పోతా..నీ బోడి లిస్టులో నా పేరేంది? అని నా పేపరు చింపుకెళ్ళిపోయాడు.


సరే వీళ్ళంతా ఎందుకులే, ఆల్రెడీ సీటు మీద ఉన్నయన్నే ఖరారు చేద్దామంటే.. ఆయనకేమో ఉద్యోగం మాత్రమే కావాలంట. నేను నాయకుణ్ణి కాదుగానీ, నువ్వు నాయకుణ్ణి ఎలాగు కనిపెట్టలేవు కాబట్టి.. ఆ వంకతో నేనలా నడిపించేస్తానంటున్నాడు. చిరాకేసి ఈ పేరు నేనే కొట్టేశా.


ఇంకొకాయనొచ్చాడు..ప్లీజ్ ప్లీజ్ నన్ను సెలెక్టు చెయ్యవా అని. అదేంటంటే నా పరిస్థితేం బాగోలేదు ఏదొ ఒక దారి నువ్వే చూపించాలి అని మరీ ఇబ్బంది పెట్టేసాడు. ఇంతకుముందేదో సిన్మాల్లో చేసిన అనుభవం ఉందంట.. పైగా కావాలంటే ఢిల్లీ వాళ్ళ కాళ్ళూ గడ్డాలు పట్టుకునైనా రికమండేషన్ తెస్తానంటాడు. పోనీ కనీసం నువ్వు సెలెక్ట్ చేసే వాళ్ళ టీం లోనైనా పెట్టుకునేట్టు చూడూ అంటాడు. మనదసలే జాలి గుండె కదా.. కరిగి పోయి పేపరు వైపు చూసి, చెప్పలేక చెప్పేశా.. సారీ బాస్.. అసలు నా లిస్టులో నీ పేరే లేదు అని. ఉండే వుంటుంది.. ఆ ముక్క చింపుకెళ్ళినోడి వల్ల పోయుంటుంది అనుకుంటూ తిరుమల వైపు వెళ్ళి పోయాడు పాపం..


ఇంకొకాయన పాపం నా దగ్గరకి రాలేదు కానీ, పోన్లే మంచోడని నేనే పేరు రాశా లిస్టులో.. పోనీ ఆయన్నే చేద్దాం అంటే.. జుట్టు పీక్కుంటున్న ఫ్రజలందరూ ఒక్క సారిగా, ఆ పని ఆపేసి .. ఆ హ మేమాటైపు కాదు మాకిట్లా మంచోళ్ళు పనికిరారు..కొట్టేయ్ పేరు అన్నారు...ఏం చేస్తాం.. ఈ పేరుకి సత్తా ఉన్నా పత్తాలేకుండా పోయింది.


సరే.. చచ్చో పుచ్చో.. ఆ మిగిలిన పేరునన్నా ఖాయం చేద్దామంటే... ఆయనేమో, ఈ సమస్య మీద జుట్టు పీక్కున్నొళ్ళ నందర్నీ ఓదార్చే పనిలో ఉన్నాడు. ఆ డిల్లీ వాళ్ళేమో అసలు ఆ ఊడిపోయిన జుట్టంతా మాది.. నీకేం సంబంధం ఓదార్చడానికి అంటున్నారు.


మొత్తం మీద అర్థం అయ్యిందేమిటంటే, ఈ సమస్య తీరాలంటే రెండు గొడవలు తేలాల్సిందే.. ఒకటి, ఈ ఓదార్పు గొడవ, రెండు ఆ ముక్క చింపుకెళ్ళేవాడి గొడవా.. ఈ రెండూ తేలేదాకా..నా నిర్ణయాన్ని పెండింగులో పెడుతూ.. ఆ లోపు మరీ బోడి గుండయ్యేదాకా జుట్టు పీక్కోవద్దని ప్రజలకి ఒక ప్రకటన విడుదల చేస్తున్నా.

11, ఆగస్టు 2010, బుధవారం

మావోయిస్టులు-మానవ హక్కులు-మామూలు ప్రజలు

అసలేంటి ఈ గోల? ఏం కావలి వీళ్ళకి? రాజకీయనాయకుల పాత్ర ఏంటి? మనమేం చేయాలి? మధ్యలో ఈ మానవ హక్కుల వాళ్ళ గొడవేంటి? ఒకడేమో హింస వద్దు అంటాడు, ఒకడేమో, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటాడు. చట్టం తన పని తను చేస్తే ఇన్ని గొడవలెందుకసలు? 


హ్మ్.. చాలా ప్రశ్నలు. చాలా వరకు నా ఆలోచనల్ని నా ఆంగ్ల బ్లాగులో ఒక 3 టపాలు రాశానింతకు ముందు.
ఈ రోజే ఒక ఆసక్తికరమైన సర్వే చూసాను. ఆ సర్వె అన్నా తెలుగు బ్లాగ్లోకంతో పంచుకుందామనే ఈ పోస్టు..