19, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు - సుశాలమ్మ

రాజశేఖర రెడ్డి చనిపోయిన మొదట్లో కొంతమంది గ్రామీణ మహిళలతో మాట్లాడినప్పుడు నున్ను బాగా ఆలోచింపజేసిన ఒక సందర్భం ఇది.

నేను మాట్లాడిన వారిలో అందరూ పేదలు లేకపోతే నిరుపేదలైన వాళ్ళే. దాదాపుగా నిరక్షరాస్యులే అనుకోవచ్చు. అన్ని పధకాలూ అందుతున్నాయా? మీ దృష్టిలో ఎలాంటి పధకాలైతే మీకు బావుంటుంది? ఏ విషయాల్లో మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు లాంటి ప్రశ్నలడుగుతూ విషయాలు అర్థం చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమది.

పింఛన్లూ ఇంకా ఇతర పధకాలూ సరిగ్గా అమలవ్వట్లేదనీ, YSR ఉన్నప్పుడు బాగా అమలయ్యేవనీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడున్నాయనకూడా అన్నీ చేస్తాను, చేస్తున్నాము అనే చెప్తున్నారు కదా ఏంటి ఇబ్బంది అని అడిగితే, అలాగే చెప్తున్నారు గానీ మా చేతికి మాత్రం అందట్లేదు అన్నారు.

సరే వీళ్ళు చెప్తున్నదాంట్లో కొంత నిజమూ కొంత వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతని తెలియజేసే ఉద్దేశ్యమూ ఉందని నాకు అనిపించి.. సరే మరి ఎలా చేస్తే పధకాలు సరిగ్గా అమలవుతాయి అని అడిగా. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తే అవుతాయన్నారు.

మరి సోనియాగాంధీ చెయ్యనంటుంది కదా, ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో అది ఆలోచిద్దాం అన్నాన్నేను. అప్పుడొచ్చింది ఒక బుల్లెట్లాంటి సమాధానం:

ఏందబ్బాయ్ నువ్వు చెప్పేది ? ఏందామి జేసేది బోడి.. ఆమిని జేసిందే మేవయితే ! ఆమినిజేసినోళ్ళం ఆయబ్బాయిని జెయ్యలేమా ?

ఈ ప్రజాస్వామ్యంలో తన సత్తా ఏంటో, తనేం చెయ్యగలదో ఎంత స్పష్టంగా చెప్పిందీ! తన శక్తి గురించీ తన పాత్ర గురించిన స్పృహ ఏంత స్పష్టంగా ఉందీమెలో !!

నేను: నీ పేరెంటమ్మా ?
సుశాలమ్మ: సుశాలమ్మ
నేను: ఉపాధి హామీ పనులందుతున్నాయా?
సుశాలమ్మ: అందుతున్నాయి. మా వూళ్ళో చానా మంది యెల్తన్నారు
నేను: ఎన్నిరోజులెళ్ళావ్ ఈ యేడు?
సుశాలమ్మ: నాకుండదు. 60 సం. దాటిన నాబోటి ముసలొళ్ళకి కాదు అది వయొసోళ్ళకే. మా కోడళ్ళు కొడుకులూ యెల్తన్నారు.
నేను: అక్కడ పనిజేసే వాళ్ళ వస్తువులూ, పిల్లల్ని చూసుకోటానికి నీ లాంటి ముసలోళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు పని రూలు ప్రకారం. నీ లాంటోళ్ళని తీసుకొని వెళ్ళి ఈ సారి అడుగు.

వోటెయ్యండి బాబూ అని చెప్పినప్పుడు.. ఆన్ లైన్లో వోటేసే పద్దతి పెట్టాలి. అన్నీ ఇంత కష్టంగా ఉంటే ఎవరేస్తారు? నేనొక్కణ్ణీ వేసినా రాజకీయ రాజకీయ పార్టీలు వోట్లు కొనుక్కుంటారు. మనమెంత చించికున్నా మనం మార్చలేము ఈ దేశాన్ని.అసలు ప్రెసిడెన్షియల్ సిస్టం పెట్టాలి మన దేశంలో. ప్రపోర్షనల్ రిప్రసెంటేషన్ ఉండాలి.. లాంటి సమాధానాలిచ్చిన ఎంతోమంది నాకు ఒక్కసారిగా గుర్తొచ్చారు.

వివిధ కారణాలతో వోట్లెయ్యకుండా ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్ని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళ ని చూసినప్పుడు కలిగే అసహనం, నిరుత్సాహం ఒక్కసారిగా పెనుగాలికి కొట్టుకుపోయింది. మన ప్రజాస్వామ్యానికి ఇంకేం భయం లేదు. సుశాలమ్మ లాంటి పౌరులున్నారు.. ఇంక మన పని మనం ధైర్యంగా చెయ్యడమే మిగిలింది అనిపించింది. రాజ్యాంగ నిర్మాతలు సామాన్య ప్రజల మీద పెట్టిన నమ్మకాన్ని వీళ్ళు వమ్ము కానీయరు. ఈ సుశాలమ్మే మన ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు అనిపించింది.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే ఊరికి వెళ్ళినప్పుడు:


నేను: సుశాలమ్మా.. ఏంది సంగతులు ?
సుశాలమ్మ: అంతా బాగానే ఉందయ్యా. ఉపాది హామీ పనిస్తన్నారు నాక్కూడా
నేను: ఒహ్హో.. సామాన్యురాలివిగాదు.. ఏమన్నారు?
సుశాలమ్మ: మాక్కూడా ఇవ్వమని అడిగాం.. రూల్స్ లేవన్నారు. వస్తువులూ పిల్లల్నీ కనిపెట్టుకునుటానికి మాక్కూడా ఇవ్వాలి పని. అది రూలు అంటేనూ.. ఆయన నవ్వి..అబ్బో సుశాలమ్మో నీ రూల్స్ తో మేం పళ్ళేములే గానీ పనే ఇస్తాంలే అని పనిలో పెట్టుకున్నాడు.
నేను: నాయకురాలివయిపోయావ్ అయితే వూళ్ళో :)
సుశాలమ్మ: ఊరుకోబ్బాయ్.. ఇప్పుడుకే మా మనవళ్ళు కోడల్లు జోకులు జేత్తన్నారు నామీద
నేను: ఏమని ?
సుశాలమ్మ: సోనియాగాంధీ అని పేరు బెట్టారు నాకు.
నేను: ఛస్స్.. ఆ పేరు నీకెందుకు. సోనియాగాంధీ నే ఉంచాలో ఊడబెరకాలో డిసైడ్ చేసేది నువ్వయితె. నేజెప్తాలే ఆళ్ళకి నువ్వంతకంటే పవర్ ఫుల్లని :))

అవును, మన ప్రజాస్వామ్యానికి ఈ సుశాలమ్మే పెద్ద దిక్కు. జై హో సుశాలమ్మ..


17 కామెంట్‌లు:

  1. WP గారు,

    వారసత్వ రాజకీయాలని మీరు సమర్ధిస్తున్నారా ? ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటున్న ఆ అమాయకులకి మీరు ఏం చెప్పారు? వాళ్ళలో ఏ మార్పు తెచ్చారు? ఆ విషయాలు చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. వరల్డ్ బ్యాంక్ విధానాల పేరుతో వెనుక ఎంత గోల్‌మాల్ జరుగుతున్నాదో ఆ పల్లెటూరి ఆమెకి తెలియదు. వేలి ముద్రలు వేసేవాళ్ళలో ఎంత మందైనా రాజశేఖరరెడ్డి & జగన్ అభిమానులు ఉంటారు.

    రిప్లయితొలగించండి
  3. :) సుసీలమ్మని నాయకురాలిని చేసి౦దెవరూ.

    రిప్లయితొలగించండి
  4. మొదలు లేదు తుదలు లేడు అంతా మిధ్య అన్నట్టు ఉంది మీ ఈ సంభాషణ.

    నాకు అర్ధం అయ్యింది ఒక్కటే వాళ్ళు కూడా రాజకీయ నాయకుల లాగే డబ్బు, అధికారం గురించే మాట్లాడుతున్నారు అని.

    రిప్లయితొలగించండి
  5. సుశీలమ్మ గారు తన హక్కుని తెలుసుకుంది, సోనియా ని దేవతని చేసినా, ఆ స్థానం నుండి కిందకి లాగేసినా తానే (లేదా తన లాంటి వాళ్లు) అని తెలుసుకుంది. at the same time,.. వై యెస్ తర్వాత జగనే తమ కష్టాలు తీర్చగలడు.. అని చెప్పటం ద్వారా, నాకైతే ప్రజాస్వామ్యాన్ని అనువంశిక పాలన లోకి దింపటానికి ఏవిధం గా నిరక్ష్యరాస్యత కూడా తోడవుతుందో అర్థమవుతోంది.

    ****************వివిధ కారణాలతో వోట్లెయ్యకుండా ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్ని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళ ని చూసినప్పుడు కలిగే అసహనం, నిరుత్సాహం ఒక్కసారిగా పెనుగాలికి కొట్టుకుపోయింది*********

    Though you have a point, I don't completely agree with you.. ఓటు హక్కు వినియోయించుకుని కూడా పెద్దగా ఉపయోగం ఉండదన్న నిస్పృహ వల్లో మరే కారణం వల్లో వినియోగించుకోక పోవచ్చు కానీ మిగిలిన విషయాల్లో literate urban citizens are definitely on par, if not better than them.

    రిప్లయితొలగించండి
  6. తాను ఓటేస్తేనే నాయకులు నాయకులయ్యేది అనే సంగతి తెలుసు సుశాలమ్మకు. ఆ వివేకానికీ చదువుకూ సంబంధం లేదని ఆమె విషయంలో మరోసారి తెలుస్తోంది.

    మీకు అభినందనలు -మీకు వీలైన స్థాయిలో జనంతో కలుస్తున్నందుకు, మీ ప్రవరలో చెప్పుకున్న పని చేస్తున్నందుకు.

    రిప్లయితొలగించండి
  7. నిన్న వ్యాఖ్య రాసినప్పుడు మొదటి పారా చదివి మీ టపా ద్వారా చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసినట్టు ఇప్పుడు చదివితే అనిపిస్తుంది.

    మీరన్నది నిజమే.. ఊర్కే మన కనీస బాధ్యత మరచి అస్తమానూ వ్యవస్థ ని దుయ్యబట్టే వారికన్నా.. వ్యవస్థ మీద నమ్మకం ఉన్న సుశాలమ్మ లాంటి వాళ్లే వ్యవస్థ ని కదిలించ గలరు..

    రిప్లయితొలగించండి
  8. ప్రజాస్వామ్యం అంటేనే అత్యధిక ప్రజల అభిప్రాయాన్ని అమలు చేయడమని.. సుశాలమ్మ తన పరిధిలో తన బాధ్యత గా ప్రజాస్వామ్యం లో పాలు పంచుకుంటూనే, తన శక్తి ఏమిటో కూడా తెలిసిన వ్యక్తి. వరల్డ్ బ్యాంకులు,నిరక్షరాస్యతలు గురించి మాట్లాడుకుంటూ బ్లాగర్లం అన్నిటి లోనూ వంకలు వెతికే వైనం నన్ను విస్మయానికి గురి చేస్తోంది.. మొన్నా మధ్య ఎన్నికల రోజున వోటు వేయాడానికి మా పోలింగ్ బూత్ వెతుక్కొని వోటు వేయాల్సి వచ్చిందని చెప్తే , మా పక్కింటి వాళ్ళు .. "ఏమిటి? మీరు పోలింగ్ బూత్ వెతికి మరీ వోటు వేస్తారా" అంటూ వెటకారాలు పోయారు... భావోద్వేగాలు (emotions) విషయానికి వస్తే, ఎంత చదువులు చదివినా ఎన్ని దేశాలు తిరిగినా కుల మత రాజకీయ మైన emotions నాకు పట్టణ ప్రజల్లోనే ఎక్కువ అనిపిస్తాయి..ప్రవాస భారతీయుల్లో మరీ ఎక్కువగా చూసాను.. నిజం చెప్పాలంటే ఇక్కడ రాసే వాళ్లకి, చదివే వాళ్లకి ప్రభుత్వ విధానాల వల్ల పెద్దగా కూటికి వచ్చిన తిప్పలేమి లేవు... అందుకే ఆ 'పై' విషయాల గురించి తెగ చర్చించేస్తూ ఉంటాము..ప్రభుత్వ విధానాల వలన జీవితాలు ఉండడమో ఊడడమో తేలే వాళ్లకి వాటి పట్ల ఉండే దృక్పధం వేరు గా ఉంటుంది.. వాళ్ళకెందుకు వరల్డ్ బ్యాంకు విధానాలు.. ? బియ్యం కేజీ ముప్ఫై రూపాయలు దాటితే, inflation అంటూ వాపోతాం. .. ఒక రైతు రెండేళ్ళ నుంచి పండించిన ధాన్యం కనీస మద్దతు ధరకు అమ్ముకోలేక విలవిల లాడితే, అది మనకు పట్టని విషయం.. సుశాలమ్మ లాంటి డెబ్భై కోట్ల మందిని మనతో పాటు ముందుకు తీసుకు వెళ్ళనంత వరకు, రాజకీయ యవనిక మీద అభివృద్ధి కంటే సంక్షేమ పధకాలే ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.. సుశాలమ్మ కి ఉన్నపాటి రాజకీయ చైతన్యం, ఆసక్తి అందరికీ ఉంటే కావల్సిందేముంది.? పత్రికలూ, ప్రసార సాధనాలు ప్రచారం కల్పించాల్సింది ప్రజల హక్కులు బాధ్యతలకే..

    రిప్లయితొలగించండి
  9. @అజ్ఞాత,

    లేదండీ. వారసత్వం మాత్రమే అర్హతగా చూసే రాజకీయాల్ని నేను సమర్ధించట్లేదు. ఇక్కడ నేను చెప్పదల్చుకున్న విషయం ప్రజాస్వామ్య వ్యవస్థలో నిస్పృహకి లోను కాకుండా తమ శక్తి తాము గుర్తించిన పౌరుల గురించీ వాళ్ళ ఆవశ్యకత గురించేగానీ వాళ్ళ అన్ని అభిప్రాయాలూ సరైనవి అని చెప్పడం నా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు.

    @Praveen Sarma గారూ,

    నేను మాట్లాడిన జానాల అన్ని ఆలోచనల్నీ వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతలనీ సమర్ధించట్లేదు. వరల్డ్ బ్యాంక్ విధానాల గురించీ, మిగిలిన అనేక రకాలైన సైధ్ధాంతిక రాధ్ధాంతల గురించీ ఇలాంటి సామాన్య ప్రజలకి తెలిసుండక పోవచ్చు. కానీ వాళ్ళ జీవితాల గురించీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ పాత్ర గురించీ మన దేశంలో సామాన్య ప్రజలకి ఉన్న అవగాహనని చూస్తే బహుశా మీలానే చాలా మంధికి ఆశ్చర్యం కలగక తప్పదు. There was a huge debate and detailed discussion in the constituent Assembly on Unversal Adult Franchise. Makers of our constitution reposed a lot of faith in the commonsense and the collective judgement of the ordinary village people of this country. If you observe the trend of political changes and pattern of voting since independence you would know how the common people of this country has shown exemplary maturity time and again.

    @ Mauli గారూ, :)

    రిప్లయితొలగించండి
  10. @అజ్ఞాత (19 ఆగస్టు 2011 8:49 సా),

    Thank You.

    @Jwala Narasimha rao గారూ,

    నా బ్లాగుకి స్వాగతం. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది :)

    రిప్లయితొలగించండి
  11. కృష్ణప్రియ గారూ,

    అయితే రెండుసార్లు చదివారన్న మాట :)

    అదేం లేదులెండి. నేను బహుశా టపా సరిగ్గా వ్రాయలేదనుకుంటా. ఆసలు విషయాన్ని ఇంకొంచెం సూటిగా రాసుండాల్సింది. ప్చ్. ఏం చేస్తాం. I am constrained by the poor writer in me.

    Anyway, My main intent is not to highlight the other points and their political choices. The things that impressed me are:

    1. She having the awareness of her own power
    2. After knowing the rules the way she backed herself and demanded her due share from the Govt.

    మీరు వ్యాఖ్యానించినప్పుడు ఆలోచించి విషయం మీద మీ అభిప్రాయాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు. మీ లాంటి వారు రాసే వ్యాఖ్యలు విభేదించినప్పుడు మరింత విలువైనవని భావిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. Chenna Kesava Reddy Madduri గారూ,

    సవివరమైన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అవును మీరన్నట్టూ ..

    "సుశాలమ్మ లాంటి డెబ్భై కోట్ల మందిని మనతో పాటు ముందుకు తీసుకు వెళ్ళనంత వరకు, రాజకీయ యవనిక మీద అభివృద్ధి కంటే సంక్షేమ పధకాలే ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.. సుశాలమ్మ కి ఉన్నపాటి రాజకీయ చైతన్యం, ఆసక్తి అందరికీ ఉంటే కావల్సిందేముంది.? "

    రిప్లయితొలగించండి
  13. మేము తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రోజులవి. రాజోలు బస్ డిపో ఎదురుగా ఒక వ్యక్తి తాగిన మత్తులో చంద్రబాబుకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నాడు. చంద్రబాబు చేపట్టిన ప్రైవేటీకరణ విధానాల వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోతుంతోనని భయంలో ఉన్న ఒక RTC డ్రైవర్‌కి కోపం వచ్చింది. అతను ఆ తాగుబోతుని కొట్టబోయాడు. వాణ్ణి కొట్టకు, తాగిన మత్తులో ఉన్నవాణ్ణి ఎంత కొట్టినా ప్రయోజనం ఉండదు అని ఇంకో డ్రైవర్ అన్నాడు. పల్లెటూర్లలో ఇప్పటికీ సఘం మంది చదువురానివాళ్ళే ఉన్నారు. చదువురానివాళ్ళు & కొద్దికొద్దిగా చదువుకున్నవాళ్ళు దేశాన్ని అమ్మేస్తున్న రాజకీయ నాయకులకి వోట్లు వేసి గెలిపిస్తోంటే అంతా తెలిసినవాళ్ళకి బాధ కలుగుతోంది.

    రిప్లయితొలగించండి
  14. చదువరి గారు,

    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. Profile ని తెలుగులో "ప్రవర" అంటారని మీ వ్యాఖ్య వల్ల నేర్చుకున్నాను :)

    రిప్లయితొలగించండి
  15. ప్రవీణ్ గారు, మీరు అండమాన్ లో ఎపుడైనా వున్నారా? అక్కడ జాలారోళ్ళని మీరు చేసిన ఇంటర్వ్యూ లాంటిదేమైనా చేసివుంటే చెప్పండి, వినిపెడతాం.

    రిప్లయితొలగించండి