20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు - మొదటి భాగం

ఉపోద్ఘాతం:
ఎదో ఒక చిట్ ఫండ్ లో చేరకపోయినా, ఆ మధ్య ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హౌసింగ్ లోన్ల పుణ్యమా అని ఒక ఇల్లు కొనుక్కున్నాం ఈ మధ్య. కొంచెం పెద్ద వెంచరే, మంచి మంచి ఫెసిలిటీలూ (మొదటి పది రోజులు తప్ప వాడక పోయినా) మాములే అనుకోండి. ఇల్లు ఆఫీసుకి దూరమవ్వడం, ఆప్పుడప్పుడూ అసొసియేషన్ మీటింగుల వల్ల ఇంట్లో అలకలూ షరా మాములే.


మొత్తం మీద రెసిడెంట్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళూ, జీవితంలో ఎన్నో చూసిన వాళ్ళూ, ఎంతో సాధించిన వాళ్ళూ, వీలయినంత వరకూ మంచిగా వుండాలనుకునే వాళ్ళే. రోడ్ల పైన పాన్ ఊసే వాళ్ళని తిట్టుకోవడం, క్యూ పద్దతి పాటించకుండా తోసుకునే వాళ్ళని చూసి నిట్టూర్చడం, రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి వీలయినంతవరకూ ప్రయత్నించడం, అప్పుడప్పుడూ సమాజ సేవ చెయ్యడం, జనాల్లో తగ్గిపోతున్న సివిక్ సెన్సు గురించి బాధ పడటం వంటి మంచి లక్షణాలు మా కాంప్లెక్స్ పౌరుల్లో పుష్కలంగా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటా.
------------------------------------------------------------
భాషతో తంటాలు:
మా సర్వ సభ్య సమావేశంలో ఒకసారి ఒకాయన తెలుగులో మాట్లాడగానే, Please talk in a language which everyone can understand అని ఒక సూచన రావడం దానికి చాలా మంది మద్దత్తు తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి. అంటే ఇంగ్లీషు గానీ హిందీగానీ అని దాదాపు తీర్మానించినంత పని చేశారు. NRI పిల్లల తల్లిదంద్రులు కొందరు ఇబ్బందిగా చూశారే గానీ పాపం మాట్లాడె చొరవ చూపలేదు.


నా లాంటి రాజకీయ వాది అక్కడ ఉండగా మాట్లాడలేని వాళ్ళకు అన్యాయం జరగదనుకోండి :-) వెంటనే మైకుచ్చుకొని, బాబులూ ఎవరికి వీలుగా వున్న బాషలో వాళ్ళు మాట్లాడండి, సారాంశాన్ని మాత్రం మరొ బాషలో కూడా ఎవరొ ఒకరు చెప్పండి అని ప్రతిపాదించడంతో ఆ గండం గడిచింది.


సరే వీధులకి పేర్లు చర్చించి మా కమిటీ వాళ్ళు, చక్కని తెలుగు పేర్లు తయారు చేసి పర్లేదనిపించారు. (అంటే, అల్లూరి సీతా రామ రాజు వీధి, లక్ష్మీ బాయి మార్గము అలా అలా..) చక్కగా తెలుగులో బోర్డులు తయారైపోయాక ఇక చూస్కో నా సామిరంగా... మొదలైపోయాయి సిద్ధాంత పరమైన చర్చలూ, అభిప్రాయాలూ. బోర్డులు ఇంగ్లీషు లో లేకపోతే కష్టమని కొంతమందీ, ఆ ఏం పర్లేదు కింద ఇంటి నంబర్లున్నాయిగా అని ఇంకొందరూ, అసలు తెలుగులోనే పెట్టడం కరెక్టు అని మరికొందరూ, ఒక రెండుమూడు బాషల్లో రాయాలని మరికొందరూ లాజిక్కులు ఇరగ దీసేసారు.


అయ్యా బాబులూ ఇప్పటికి మా మట్టి బుఱ్రలు చించుకొని ఇది చేసేశాం కాబట్టి ఈసారికిలా కానిచ్చేయండని కమిటీ మెంబర్లు మొత్తుకోవడం మొదలెట్టేశారు. అసలిలాంటివి చేసే ముందు అందరినీ అడిగి చెయ్యాలని దాడి కమిటీ వాళ్ళ వైపుకి మళ్ళింది. ఆవేశపరుడైన మా కమిటి సెగట్రీ అప్పటివరకూ నూరుకుంటున్న పళ్ళకి కొంత విరామం ఇచ్చి, అసలేంటి, ఇలా ప్రతి చిన్న విషయానికీ అందరితో చర్చలు చేయాలంటే నాతోని గాదు, నాకు చెతనైనంత వరకూ నేను చెశా.. అలా అందరినీ అడిగి అన్నీ చేసేంత తీరిక వున్నవాళ్ళు ఉండండి అని రాజినామాస్త్రం ప్రయోగించేశాడు. ఆ దెబ్బకి మావాళ్ళంతా కొంచెం వెనక్కి తగ్గారు. ఇంకో బకరాని ఒప్పించడం అంత తేలికా చెప్పండి!!


సీను కట్ చేస్తే నేనిల్లు చేరి, మా అబ్బాయి మేడ మీదికి రాకుండా, ఎప్పట్లాగే అర్ధాంగిని ఫీల్డింగ్ చెసుకోమని బతిమాలుకొని మెడమీదికెళ్ళి సిగిరెట్టు తాగుతూ ఆలోచించడం మొదలెట్టా.. ఏం ఆలోచించానో తరువాతిటపాల్లో చెప్తాగానీ ఈ లోపు మీరు ఊహించడానికి ప్రయత్నించండి.


(ఇంకా బోలెడు కబుర్లున్నాయి.. తరువాతి టపాలో..)

3 కామెంట్‌లు: