తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎందుకడుగుతున్నారు? దేశం మీద ఈ అంశం ప్రభావం ఎలా ఉంటుంది? సమైక్య రాష్ట్రం మీదగానీ, రెండు ప్రత్యేక రాష్ట్రాల మీదగానీ దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతుంది? అసలీ సమస్య ఇంత జఠిలంగా ఎందుకు తయారయ్యింది? ప్రాంతాల వారీగా కాకుండా అసలు ఈ విషయం మీద వివిధ పార్టీల ఆలోచనా విధానం ఏంటి? తప్పో రైటొ ఇప్పుడున్న పరిస్థితి నుండి మార్గాంతరాలేంటి? ప్రత్యేక రాష్ట్రం వద్దనే వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు?
అన్నీ ప్రశ్నలే. సమాధానాలెక్కడ? నాకు వీలయినంత వరకూ నిష్పక్షపాతంగా(?) ఈ విషయం మీద నా ఆలోచనలు రాద్దామంటే, ఒక టపా సరిపోయేట్టులేదు. సరే వీలయినంతవరకూ మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకూ వరసగా టపాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. మీ అభిప్రాయాలు చెప్పి మంచి చర్చ చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ?
అసలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకడుగుతున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అనేక వాదనలూ, విశ్లేషణలూ చూస్తే స్థూలంగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కి కారణాలు 5. ఈ కారణాలన్నిటినీ పరిశీలిస్తే, అర్థమయ్యేదేంటంటే, ఇందులో కొన్నేమో గణాంకాల ఆధారంగానూ, డాక్యుమెంట్ల ఆధారంగానూ విశ్లేషణ చెయ్యడానికి వీలయ్యేవీ, మరికొన్నేమో అలా వీలు కానివీ. ఇందులో కొన్ని ఎక్కువా కొన్ని తక్కువా అనేదేమీ లేదు నాదృష్టిలో. అన్నీ బలమైన కారణాలే. వీటిల్లో నిజానిజాల్నీ, అపోహలనీ బేరీజు వేద్దాం.
ఎవరికి వీలయిన గణాంకాలు వాళ్ళు తీసుకొచ్చి, మధ్యలో ఒక కారణం నుంచి ఇతర కారణాల వైపు చర్చని దారి మళ్ళిస్తూ కలగాపులగం చెయ్యటం అనేది విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్న తంతే. మళ్ళీ మనమెందుకు అదే చెయ్యటం!! మనం అన్ని కారణాలనీ ఒక్కొక్కదాన్నీ విడివిడిగా, సరళంగా విశ్లేషిద్దాం.
1. తెలంగాణా ప్రాంతం అభివృధ్ధిలో వెనకబడి ఉండటం
ఇది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన కారణమా కాదా అనేది కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, ముందు వెనకబాటుతనం ఉంది అని నిరూపణ అవ్వాలి, తరవాత వెనకబాటుతనం ప్రత్యేక రాష్ట్రంగా లేకపోవడం వల్లే అని నిర్ధారింపబడాలి. ప్రభుత్వం వారి లెక్కలు గానీ లేదా అదే పనిగా ఈ విషయం కోసమే నియమించబడ్డ శ్రీక్రిష్ణ కమీటీ లెక్కలుగానీ చూస్తే 1956 తరవాత జరిగిన అభివృధ్ధిలో ఈ ప్రాంతం వెనకబడి లేదనేది కనిపిస్తుంది. స్థూలంగా వెనకబాటుతనం ఉన్నా అది అన్ని ప్రాంతాలలోనూ ఉంది. 1956 తరవాత హైదరాబాదు లో అన్ని ప్రాంతాల పెట్టుబడిదారుల డబ్బు వల్లా అన్ని ప్రాంతాల ప్రజల శ్రమ వల్లా ఎక్కువగా అభివృధ్ధి జరిగిందనేది నాకైతే బాగానే కనిపించింది.
2. ఆర్థికాంశాల్లోనూ, పరిపాలనాంశాల్లోనూ ఈ ప్రాంతం నిర్లక్ష్యం చెయ్యబడుతూ ఉంది
ప్రభుత్వ పరంగా జరిగిన కేటాయింపులూ, ఇతరత్రా వివరాలు చూస్తే ఈ కారణం కూడా పెద్దగా నిలబడలేదనే చెప్పొచ్చు. నీటి లభ్యత మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. ఉద్యోగాల విషయంలో ప్రైవేటు ఉద్యోగాల విషయంలో ఈ ప్రాంతవాసులకి మిగతావాళ్ళతో పోలిస్తే తక్కువ ఉద్యోగాలు లభించిన మాట వాస్తవమే అయినా, అది ప్రత్యేక రాష్ట్ర అంశానికి సంబంధం లేని విషయమే. నీటి వనరుల విషయంలో మాత్రం తేడా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే, ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ ఫలితాలు సాధించడం కంటే, ఈ ప్రాంతానికి వీలైన ఇతర రంగాల్లో నిధులు పెట్టి మంచి ఫలితాలు సాధించడమే మంచిది కదా ! ప్రకాశం జిల్లా గానీ, లేదా గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గానీ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్నీ నిర్లక్ష్యం అనలేము కదా !
3. 1956 లో ఒకే రాష్ట్రంగా ఏర్పడినప్పుడు చేసిన ఏర్పాట్లేవీ చిత్తశుద్దితో అమలు జరగలేదు కాబట్టి ఇక ముందైనా మధ్యేమార్గంగా చేసే ఏర్పాట్ల మీద ఈ ప్రాంత ప్రజలకి నమ్మకం లేదు.
శ్రీక్రిష్ణ కమీటీ ప్రకారం చూసుకున్నా మరే ఇతర ఆధారాల ప్రకారం చూసినా ఒప్పందాలు సరిగ్గా అమలు చెయ్యబడలేదు అనేది మాత్రం స్పష్టం. అసలు ఆ ఒప్పందాల్లోని షరతులే తప్పు కాబట్టి అవి అమలు జరక్కపోయినా తప్పేంలేదు అనే వాదన అర్థ శతాబ్దం తరవాత ఇప్పుడు చెయ్యడం మాత్రం అర్థంలేని పని. ఒకవేళ ఇప్పుడేదైనా పకడ్బందీ ఏర్పాటు చేద్దామన్నా ఈ ప్రాంత ప్రజలు దాన్ని విశ్వసించడానికి సిధ్ధంగా లేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ పరిస్థితుల్లో ఎవరున్నా అంతే కదా !
కేవలం ఒప్పందాల అమలులో లోపాలవల్లే తెలంగాణా కోసం ఇంత పోరాటం చేస్తున్నారా ? ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంత పోరాటం ఎందుకు జరుగుతున్నట్టు ? మిగతా ఏవైనా కారణాలుండే ఉండాలిగా. అయితే వాటిని ఇదమిధ్ధంగా తేల్చడం గణాంకాలూ, డాక్యుమెంట్ల తో అయ్యేపని కాదు. కానీ అవేమీ తక్కువ చేసి చూడాల్సిన అంశాలేం కాదని నేను అనుకుంటున్నాను.
4. సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకీ, ఆశలకీ, సమర్ధతకీ సరైన అవకాశాలు దొరకడం దుర్లభం అనే భావన
పైన చెప్పబడిన మొదటి రెండూ అంశాల ప్రకారం చూస్తే, ఈ భావన కలగడం ఎలా సాధ్యం ! కానీ ఈ భావనా, అభద్రతా చాలా బలంగానే ఉంది ఈ ప్రాంతంలో. ఏమై ఉండొచ్చు ? తెలంగాణా మీద మిగిలిన ప్రాంతాల సాంస్కృతిక ఆధిపత్యం వల్ల అవకాశాలూ తగ్గి ఇటువంటి భావన ప్రబలే అవకాశం ఉంది. మొదటి రెండూ అంశాల్లో కూడా గణాంకాల ప్రకారం అంతా సవ్యంగానే ఉన్నా, ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇంత బలంగా ఉందంటే, బహుశా గణాంకాల్లోని న్యాయం ప్రజలకి అనుకున్నంతగా అందలేదేమో !!
5. ఈ ప్రాంత ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉంది. పరిపాలనాపరంగా బానే ఉండి మిగిలిన వారికి నష్టం లేనప్పుడు ఎందుకివ్వకూడదు?
ఇదికూడా ఒక రకంగా బలమైన వాదనే. ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉందనేది నిజమే. ఇక తేలాల్సింది, పరిపాలనా పరంగా బానే ఉంటుందా మిగిలిన వారికి ఏమైనా నష్టాలున్నాయా అనే రెండు విషయాలు. అధికార వికేంద్రీకరణ అనే సూత్రం ప్రకారం మంచిదేగానీ, ఒక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే దానికి పరిష్కారం కాదు. స్థానిక సంస్థలని రాజ్యాంగ ప్రకారం నడిపితే ఇంకా మంచి ఫలితాలొస్తాయి. కాకపోతే ఆ పని సమైక్య రాష్ట్రంలో ఇప్పటివరకూ అనుకున్నంతగా జరగలేదు. అదట్లా ఉంచితే, దాదాపుగా 4 కోట్ల మంది జనాభా ఉన్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే పరిపాలనా పరంగా గానీ, వనరుల పరంగా గానీ బానే ఉంటుందనిపిస్తుంది.
ఏమీ నష్టం లేకుండానే మిగిలిన ప్రాంతాల్లో అంత వ్యతిరేకత ఎందుకుంటుంది? ముఖ్యంగా ఉపాధి అవకాశాలుగానీ, పెట్టుబడికి అనుకూలతలుగానీ హైదరాబాదు లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల అటువంటి అవకాశాలు కల్పించడంలో సమైక్య రాష్ట్రం విఫలమవ్వడం వల్ల హైదరాబాదుని ఒక్కసారిగా ఒదులుకోవడం మిగిలిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా నష్టమే, అభ్యంతరకరమె. మిగిలిన అంశాల విషయానికొస్తే, నీటి విషయంలోగానీ, హైదరాబాదు నుండి సమైక్య రాష్ట్రానికి ఒనగూరుతున్న ఆర్థిక వనరులనన్నిటినీ కోల్పోవడమంటే అది మిగిలిన ప్రాంతాలకి తప్పకుండా నష్టం కలిగించే అంశమే. మరీ ముఖ్యంగా తెలుసుకోవలసిందేంటంటే, రాష్ట్ర రాజధాని కాబట్టే ఇక్కడ మాత్రమే మిగిలిన ప్రాంతాలకంటే ఎక్కువ అభివృధ్ధి జరుగుతున్నా ఇంత కాలంగా అందరూ దాన్ని సహిస్తూ, సహకరిస్తూ వచ్చారనేది నిర్వివాదాంశం. కేవలం హైదరాబాదు మాత్రమే అభివృధ్ధి చెందడం అనేది తప్పైనా, ఇప్పుడు మనమున్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే.
ఇవి కాకుండా ఇంకేవైనా కారణాలు నేను గమనించలేకపోయున్నా, ఈ కారణాలని అర్థం చేసుకోవడంలో పొరపాట్లున్నా మీ అభిప్రాయాలు చెప్పండి.