29, సెప్టెంబర్ 2010, బుధవారం

సున్నీ వక్ఫ్ బోర్డ్ Vs. రామ జన్మభూమి న్యాస్


రేపు రాబోయే తీర్పు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తీర్పు తదనంతరం తలెత్తే అవకాశం ఉన్న దుష్పరిణామాల దృష్ట్యా ప్రభుత్వాలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అభినందనీయమే. ప్రధాన పార్టీలన్నీ, తీర్పు ఏవిధంగా వున్నా గౌరవిస్తామనీ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలనీ, ఆవేశకావేశాలకు దూరంగా ఉండాలనీ ప్రజలకు పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. అన్ని పార్టీలూ ఇటువంటి వైఖరి తీసుకోవడం, మొత్తంగా మన రాజకీయ వ్యవస్థ పరిణతిని సూచిస్తుందనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. 1992 లోని మనకీ 2010 లోని మనకీ ఎంతో తేడా ఉంది అనేదానికి ఇంతకంటే ఉదాహరణలింకేం కావాలి?


మన జనాలంతా రేపేదో భయంకరమైన ఉన్మాదంలోకి వెళ్ళి పోతారేమో అనిపించే కధనాలు మీడియా కొంచెం తగ్గిస్తే బావుండేది కదూ? కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహం చూస్తుంటే, రేపేమీ జరగక పోతే బాధ పడేట్టున్నారు. ఒకటీ అరా అక్కడక్కడా జరిగే చెదురు మదురు సంఘటనలని ఎక్కువ చేసి చూపి, మొత్తం సమాజాన్ని ఉన్మాదులుగా చిత్రీకరించేంత దుస్సాహసానికి ఒడిగట్టరనే ఆశిద్దాం.


అయోధ్యలోని మందిరం లేక మసీదు మాత్రమే ఈ దేశం లోని హిందువులకూ, ముస్లీములకూ తమ సగర్వమైన అస్థిత్వాన్ని చాటి చెప్పే ఏకైక మార్గం కాదు. భారతీయులుగా మన జీవితాల్లోనూ, హిందూయిజం లోనూ, ఇస్లాంలోనూ అంతకంటే విలువైనవెన్నో వున్నాయి.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

చవితి నాడు కథ చదవని జగన్...

మంచి రాజకీయ భవిష్యత్తూ, కోరుకున్న పదవి దక్కాలంటే ఏం చేయాలో అధిష్ఠాన దేవత ఉపదేశించారు. జగనూ, రోశాయ్యా ఊపిరిబిగబట్టి శ్రద్ధగా విన్నారు. ఉపదేశం సారాంశం ఏంటంటే, గ్రామ గ్రామానా ఉన్న ప్రజలందరినీ దర్శించు కుంటే పదవులు దక్కే యోగం పడుతుందట. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందుగా ఆ పని పూర్తి చేసుకొస్తారో వారికి అధిష్ఠానం అనుగ్రహం లభిస్తుందట.


యువకుడూ, ఉత్సాహవంతుడూ అయిన జగన్ పరుగు పరుగున ఆ పని  ప్రారంభించేశాడు. వయోవృద్ధుడైన రోశయ్య దిగులుగా బయటకొచ్చి, ఆప్తుడైన అహ్మద్ పటేల్ దగ్గర, ఈ పోటీలోని అన్యాయం గురించి వాపోయారు. ఇటువంటివెన్నో చూసిన అహ్మద్ పటేల్ చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోగానే రోశయ్య గారికి చటుక్కున ఙానోదయమయ్యింది. ఊరూరూ తిరగడమెందుకని అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్ కేమో ఒక్కో వూరు వెళ్తుంటే, ఆ వూరి నుండి రోశయ్య గారు అప్పుడే బయటకెళ్ళినట్టు కనిపించడం మొదలయ్యింది. 


సందేహం: హిందూత్వ భావనలని ఇంత చక్కగా వంటబట్టించుకొని అవలంబిస్తున్న కాంగ్రేసెక్కడా!! ఎప్పుడు చూసినా ఒక్క రాముడి గురించే సోది చెప్పే BJP ఎక్కడ?


Source: one of my friend shared this joke seen on one of the channels.. Liked it very much. Posted just for the fun and satirical value :) With thanks to google image search...

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

మా గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు - రెండవ భాగం


బస్సు తో తంటాలు:
అసలే ఊరికి దూరం అవడంతో, మా కాంప్లెక్స్ కి దగ్గర్లోనే కేంద్రీయ విద్యాలయా ఉండడంతో చాలా మంది పిల్లల్ని అక్కడే చెర్పించారు. ఆటోల్లో పిల్లల్ని కుక్కి కుక్కి పంపే అవస్థ చూసి మా కమిటీ వాళ్ళు కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక బస్సుని 'నో ప్రాఫిట్ నో లాస్' పద్దతిలో నడపడానికి ఏర్పాట్లు చేసి, అబ్బో.. సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు.  
 
సరే ఇంకేముంది ఏర్పాట్లన్నీ చక చకా జరిగి పోయాయి. ప్రజలనుంచి అనూహ్య స్పందన వచ్చి 33 సీట్లున్న మా బస్సుకి దాదాపు 45 మంది పిల్లల ఆదరణ లభించింది.  కొంత మంది పిల్లల భద్రత గురించి పాపం చాలా ఎంక్వయిరీ చేశారు. బస్సు డ్రైవర్ కీ, కండక్టర్ కీ మార్గ నిర్దేశాలూ జాగ్రత్తలూ తయారు చేసేసారు. పిల్లల లెక్క చూసుకోవడం, తలుపులు, కిటికీలూ సరిగ్గా మూయడం లాంటివన్న మాట. ఇంకొంత మందైతే కాంప్లెక్స్ దాటగానే మైన్ రోడ్డు మీద వేరే వాహనాలొస్తాయికదా, ప్రమాదాలు నివారించడం ఎలాగో చర్చించాల్సిందే అన్నారు.   
 
అన్ని ఇళ్ళలోని పిల్లలకీ వీలుగా ఉండడంకోసం ఒక రూట్ మ్యాప్ (అంటే కాంప్లెక్స్ లోపల ఎలా గిరికీలు కొట్టాలనే స్పెసిఫికేషన్ అన్న మాట) కూడా తయారు. ప్రత్యేకంగా ఈ బస్సు సంగతి చూసుకోవడానికి ఇద్దరితోనో ముగ్గురుతోనో ఒక సబ్ కమిటీ కూడా వేసేశారు. ఇంకజూస్కోండి పొద్దున్నే హడావిడి, పాపం ఆ సబ్ కమిటీ సభ్యులంతా మోటార్ సైకిళ్ళ మీద బస్సు ముందో వెనకో ఒకటే చక్కర్లు. పాపం అంతా సజావుగా జరిపించాలనే తపన వాళ్ళది! నాకెలా తెలుసు వాళ్ళ ఉద్దేశ్యం అనుకుంటున్నారు కదూ! మరదే.. తెలిస్తుందంతే, మీరు నమ్మాల్సిందే.
 
ఒక్క రోజు అనుభవం నేర్పిన పాఠాలు ఏంటంటే ఈ రూట్ మ్యాప్ మొదట్లో వుండే పిల్లల్ని ముందుగానే తయారు చేసి బస్సెక్కించాల్సి వసుంది. చివర్లో ఎక్కే పిల్లలకేమో సీట్లు దొరకవు. పైగా కొన్ని లేన్లలో బయటే పార్క్ చేసిన కార్ల వల్ల బస్సుని గిరికీలు తిప్పడం కష్టమయి పోతుందని మా డ్రైవర్ ఇబ్బంది పడడం. ఈ మధ్యలో మా సుపుత్రుడు చివర్లో ఎక్కే వాడి ఫ్రెండ్ కోసమని పక్క సీట్లో పుస్తకాల సంచీ పెట్టి బ్లాక్ చేశాడు. వెధవ్వేషాలెయ్యొద్దని చెప్పి ఎలాగో తీసేయించాం లేండి.   
 
ఈ గుణ పాఠాల పుణ్యమాని రెండో రోజుకి రూట్ మ్యాప్ ని పక్కన పడేసి మైన్ స్ట్రీట్ లో మాత్రమే బస్సు వెళ్ళేట్టూ, అన్ని లేన్స్ వాళ్ళూ, వాళ్ళ లేన్ చివర్లో ఎక్కేట్టు మార్పు చేసేశాం. రెండు మూదు రోజుల తరవాత గమనిస్తే, అందరూ బస్సు ఎక్కడ వుంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని ఎక్కించడం మొదలెట్టారు. ఒక వారం పొయ్యాక, చాలా మంది బస్సు స్టార్టింగ్ ప్లేస్ కే వెళ్ళి ఎక్కిస్తున్నారు. కారణం ఏంటంటే పిల్లలకి సీట్లు దొరకడానికన్న మాట.
[50 మంది పిల్లలకి 30 సీట్లున్న బస్సుంటే, సహజంగానే క్యూ పద్దతులూ గట్రా హుష్ కాకి అవుతాయి. పోనీ రెండు ట్రిప్పులు తిప్పడం లేక రెండు బస్సులు వెయ్యడం లాంటి వాటికి మా అసోసియేషను ఆర్ధిక వనరులు సరిపోవు. మన సమాజంలో పరిస్థితి కూడా అదేకదా!]
పారిశుధ్యం, మన్నూ, మశానం :
కాంప్లెక్స్ లోపలి గార్డెన్ చూసుకోవడానికి ఒక కాంట్రాక్టూ, రోడ్లూ అవీ ఊడ్చడానికి ఒక కాంట్రాక్టూ ఇచ్చేసి అవుట్ సోర్సింగ్ ద్వారా కాలనీ ప్రజల జీవన్ ప్రమాణాలు మెరుగు పరిచే కార్యక్రమం కూడా బానే అమలవుతుంది లేండి.
 
ఈ మధ్యే ఒక మంచి ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతుంది మా కమిటీ వాళ్ళలో. అదేంటంటే, మన వాళ్ళు కొంత మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు, వాటిని రోడ్ల మీదికి వాకింగ్ అనే హార్మ్ లెస్ పేరుతో తిప్పుతున్నారు. వచ్చిన చిక్కేంటంటే, పాపం అవికూడా ప్రాణులే కదా! రోడ్లు ఖరాబు చేస్తున్నాయి. ఎలా చెప్పాలి, కుక్కల హక్కు దారులకి మార్గాంతరం ఏం చూపించాలి అని!
 
ఒకరిద్దరు మాత్రం, ఆ.. ఏంటి, మనం పాశ్చాత్య దేశాల్లో చూడట్లేదా, వాళ్ళ లాగా వీళ్ళని కూడా చేతులకి డిస్పోసబుల్ కవర్లు తొడుక్కోమని చెప్పేయడమే, లేకపోతే ఈ అవుట్ సోర్సింగులూ ఇవన్నీ ఎందుకు దండగ అన్నారు.  ముందు కాలనీలోని సూపర్ మార్కెట్టు వాడిని అటువంటి కవర్లు అందుబాటులో వుంచమని చెప్పి, తరువాత వీళ్ళకి చెప్తే బెటర్ అనె దిశ లో సాగుతున్నాయి ఆలోచనలు. (నిజమే కదా అమెరికా వాడి దగ్గరుండే మంచి లక్షణాలు మాత్రం వదిలేసి, వాడి దగ్గరుండే అవలక్షణాలు మాత్రమే పట్టుకొచ్చేస్తున్నారు మనవాళ్ళు)
 
సారాంశం:
నేను గమనించిన విషయాలు అర్థం చేసుకునే ప్రక్రియలో రాశానే గానీ మా వాళ్ళంతా స్వతహాగా చాలా మంచి వాళ్ళండోయ్. కాకపోతే ఇంతమంది కలిసి పనులు చేయడంలో ఉండే ఇబ్బందులూ, సౌకర్యాలూ, అసౌకర్యాలూ తెలుస్తున్నాయంతే. అందరూ చదువుకున్న వాళ్ళూ, రీజనబుల్ వాళ్ళూ ఉన్న ఒక చిన్న కాంప్లెక్స్ లోనే ఇంత క్లిష్టంగా ఉంటే ఒక 100 కోట్లమంది అనేక రకాల నేపధ్యాల వాళ్ళు ఉండే దేశాన్ని నడపడమంటే మాటలా!!!

20, సెప్టెంబర్ 2010, సోమవారం

మా గేటెడ్ కమ్యూనిటీ కబుర్లు - మొదటి భాగం

ఉపోద్ఘాతం:
ఎదో ఒక చిట్ ఫండ్ లో చేరకపోయినా, ఆ మధ్య ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హౌసింగ్ లోన్ల పుణ్యమా అని ఒక ఇల్లు కొనుక్కున్నాం ఈ మధ్య. కొంచెం పెద్ద వెంచరే, మంచి మంచి ఫెసిలిటీలూ (మొదటి పది రోజులు తప్ప వాడక పోయినా) మాములే అనుకోండి. ఇల్లు ఆఫీసుకి దూరమవ్వడం, ఆప్పుడప్పుడూ అసొసియేషన్ మీటింగుల వల్ల ఇంట్లో అలకలూ షరా మాములే.


మొత్తం మీద రెసిడెంట్స్ అంతా బాగా చదువుకున్న వాళ్ళూ, జీవితంలో ఎన్నో చూసిన వాళ్ళూ, ఎంతో సాధించిన వాళ్ళూ, వీలయినంత వరకూ మంచిగా వుండాలనుకునే వాళ్ళే. రోడ్ల పైన పాన్ ఊసే వాళ్ళని తిట్టుకోవడం, క్యూ పద్దతి పాటించకుండా తోసుకునే వాళ్ళని చూసి నిట్టూర్చడం, రూల్స్ ప్రకారం నడుచుకోవడానికి వీలయినంతవరకూ ప్రయత్నించడం, అప్పుడప్పుడూ సమాజ సేవ చెయ్యడం, జనాల్లో తగ్గిపోతున్న సివిక్ సెన్సు గురించి బాధ పడటం వంటి మంచి లక్షణాలు మా కాంప్లెక్స్ పౌరుల్లో పుష్కలంగా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటా.
------------------------------------------------------------
భాషతో తంటాలు:
మా సర్వ సభ్య సమావేశంలో ఒకసారి ఒకాయన తెలుగులో మాట్లాడగానే, Please talk in a language which everyone can understand అని ఒక సూచన రావడం దానికి చాలా మంది మద్దత్తు తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి. అంటే ఇంగ్లీషు గానీ హిందీగానీ అని దాదాపు తీర్మానించినంత పని చేశారు. NRI పిల్లల తల్లిదంద్రులు కొందరు ఇబ్బందిగా చూశారే గానీ పాపం మాట్లాడె చొరవ చూపలేదు.


నా లాంటి రాజకీయ వాది అక్కడ ఉండగా మాట్లాడలేని వాళ్ళకు అన్యాయం జరగదనుకోండి :-) వెంటనే మైకుచ్చుకొని, బాబులూ ఎవరికి వీలుగా వున్న బాషలో వాళ్ళు మాట్లాడండి, సారాంశాన్ని మాత్రం మరొ బాషలో కూడా ఎవరొ ఒకరు చెప్పండి అని ప్రతిపాదించడంతో ఆ గండం గడిచింది.


సరే వీధులకి పేర్లు చర్చించి మా కమిటీ వాళ్ళు, చక్కని తెలుగు పేర్లు తయారు చేసి పర్లేదనిపించారు. (అంటే, అల్లూరి సీతా రామ రాజు వీధి, లక్ష్మీ బాయి మార్గము అలా అలా..) చక్కగా తెలుగులో బోర్డులు తయారైపోయాక ఇక చూస్కో నా సామిరంగా... మొదలైపోయాయి సిద్ధాంత పరమైన చర్చలూ, అభిప్రాయాలూ. బోర్డులు ఇంగ్లీషు లో లేకపోతే కష్టమని కొంతమందీ, ఆ ఏం పర్లేదు కింద ఇంటి నంబర్లున్నాయిగా అని ఇంకొందరూ, అసలు తెలుగులోనే పెట్టడం కరెక్టు అని మరికొందరూ, ఒక రెండుమూడు బాషల్లో రాయాలని మరికొందరూ లాజిక్కులు ఇరగ దీసేసారు.


అయ్యా బాబులూ ఇప్పటికి మా మట్టి బుఱ్రలు చించుకొని ఇది చేసేశాం కాబట్టి ఈసారికిలా కానిచ్చేయండని కమిటీ మెంబర్లు మొత్తుకోవడం మొదలెట్టేశారు. అసలిలాంటివి చేసే ముందు అందరినీ అడిగి చెయ్యాలని దాడి కమిటీ వాళ్ళ వైపుకి మళ్ళింది. ఆవేశపరుడైన మా కమిటి సెగట్రీ అప్పటివరకూ నూరుకుంటున్న పళ్ళకి కొంత విరామం ఇచ్చి, అసలేంటి, ఇలా ప్రతి చిన్న విషయానికీ అందరితో చర్చలు చేయాలంటే నాతోని గాదు, నాకు చెతనైనంత వరకూ నేను చెశా.. అలా అందరినీ అడిగి అన్నీ చేసేంత తీరిక వున్నవాళ్ళు ఉండండి అని రాజినామాస్త్రం ప్రయోగించేశాడు. ఆ దెబ్బకి మావాళ్ళంతా కొంచెం వెనక్కి తగ్గారు. ఇంకో బకరాని ఒప్పించడం అంత తేలికా చెప్పండి!!


సీను కట్ చేస్తే నేనిల్లు చేరి, మా అబ్బాయి మేడ మీదికి రాకుండా, ఎప్పట్లాగే అర్ధాంగిని ఫీల్డింగ్ చెసుకోమని బతిమాలుకొని మెడమీదికెళ్ళి సిగిరెట్టు తాగుతూ ఆలోచించడం మొదలెట్టా.. ఏం ఆలోచించానో తరువాతిటపాల్లో చెప్తాగానీ ఈ లోపు మీరు ఊహించడానికి ప్రయత్నించండి.


(ఇంకా బోలెడు కబుర్లున్నాయి.. తరువాతి టపాలో..)

9, సెప్టెంబర్ 2010, గురువారం

గతిలేక కొంతమంది, గత్యంతరం లేక కొంతమందీ, దురాశతో కొంతమందీ...

మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా దేశంలోని అవినీతి మీద వెల్లడించిన అభిప్రాయాలు కొత్తవేం కాకపోయినా, చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువివ్వాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన విషయాలూ అభిప్రాయాలు కొంతైనా మంచి పరిణామాలకు దారి తీస్తాయనే ఆశిద్దాం. ఆయన చెప్పిన వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఒకసారి చూద్దాం.


1. దేశంలో మూడోవంతు మంది పూర్తి అవినీతిపరులుగా మారిపోగా దాదాపు సగం మంది అవినీతి మకిలి అంటించుకున్న వాళ్ళేనట! ఇరవై శాతం మంది ప్రలోభాలకీ పరిస్థితులకీ లొంగకుండా నిజాయితీ పరులుగానే ఉన్నారనేది శుభ పరిణామమే.


2. కొన్నేళ్ళక్రితం అవినీతికి పాల్పడిన వారికి సమాజంలో గౌరవం ఉండేది కాదు. ఒక రకమైన సామాజిక నిరసనా, సాఘీక నిరాదరణా ఎదురయ్యేవి. అయితే ఈ మధ్య కాలంలో అది కూడాలేకుండా పోయిందనీ, అవినీతి కి సాంఘీక ఆమోదం లభించడం అనేది ఒకింత చేదు నిజం.


3. మారుతున్న సామాజిక విలువలని కూడా CVC ప్రస్తావించారు. ఒకప్పుడు మనిషి సత్ప్రవర్తనని బట్టో, లేక సమర్ధతని బట్టో సమాజంలో గౌరవం లభించేది. అయితే ఈ మధ్య కాలంలో కేవలం ఎంత ధనవంతుడు అనేది మాత్రమే గౌరవానికి కొలబద్దగా మారటం కూడా ఒక పెనుప్రమాదమని CVC అభిప్రాయ పడ్డారు.


ఇంతమంది ప్రజలు అవినీతికి అమోదముద్ర వెశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. పైన సిన్హా గారు చెప్పిన అభిప్రాయల ద్వారా గానీ ఇతరత్రా మన అవగాహన వల్ల కానీ గత్యంతరంలేని పరిస్థితుల్లో అవినీతి పరులుగా మారేవాళ్ళూ, గతిలేక అవినీతి పరులుగా మారేవాళ్ళూ చాలా మంది ఉన్నారనేది మనకందరికీ తెలిసిందే. వీరితో పాటు దురాశతో అవినీతి చేసే వాళ్ళూ బానే వున్నారు.


పై స్థాయిల్లో జరిగే రాజకీయ అవినీతి అతి ప్రమాదకరమైనదీ, పైగా అవినీతిని కింది స్థాయి వరకూ పెంచి పోషించేదీనూ. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే అవినీతి చేస్తే తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఉంది. పై స్థాయిలన్నీ అవినీతి మయమైనప్పుడు ఇలాగే జరుగుతుంది మరి అని సరిపెట్టుకోలేమనిపిస్తుంది. చాలా వరకూ అది నిజమే అయినా, ముఖ్యంగా అవినీతికి సమాజంలో అమోదం లభించడం గానీ, లేక కేవలం డబ్బు ద్వారానే ఒక మనిషికిచ్చే విలువ నిర్థారించబడడం కానీ ఇవి మనలో గూడు కట్టుకుంటున్న సామాజిక రుగ్మతనే సూచిస్తున్నాయి. దీన్ని నిర్మూలించడం అంత సులభమేం కాదు.


వారంలో 6 రోజులు పనిచెయ్యడానికి సిద్దమైన వాళ్ళందరూ కనీస జీవన ప్రమాణాలని అందుకునే పరిస్థితి నెలకొల్పితే గతిలేక చేసే అవినీతిని చాలావరకు అరికట్టవచ్చు. మిగిలిన అవినీతిని అరికట్టడానికి ఒక మార్గం దొరుకుతుంది.


అన్నిటికంటే ముందు రాజకీయ అవినీతిని అంతం చెయ్యాలి అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎలా? ధనవంతుడు కానివాడు రాజకీయాల్లో నెగ్గుకురాగలడనే విశ్వాసం లేదు కదా మనలో! ఏ పార్టీలు నింపుతాయి ఆ విశ్వాసాన్ని? ఏ నాయకులు కల్పిస్తారు ఆ మాత్రం నమ్మకాన్ని?


మనవంతుగా, మరీ సంఘసంస్కర్తలుగా అవతారమెత్తక్కరలేకుండా, వీలయినంతవరకూ ఎదుటి మనిషికి వారివారి ప్రవర్తనని బట్టి మాత్రమే గౌరవం ఇవ్వడం, మనకెదురయ్యే అవినీతి పరులకి గౌరవాన్ని ఇవ్వకపోవడం లాంటివి చెయ్యొచ్చేమో. ఈ సారి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపినప్పుడు, ఎంతిస్తే వదిలేస్తాడు అని కాకుండా, మన వయొలేషన్ కి ఫైన్ ఎంత అని కూడా ఆలోచించొచ్చు. ఇంత డబ్బులిచ్చి ఈ పని చేయించాను, ఫలానా వాడు ఎంతబాగా (పైడబ్బులొచ్చే పోస్టు మరి) సంపాదించాడో అని పిల్లల ముందు మాట్లాడడం ఆపెయ్యొచ్చు. కొద్దిగా ఇబ్బందైనా వీలయినంతవరకూ లంచాలు ఇవ్వకుండా మన పనులు చేసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు.