30, జూన్ 2010, బుధవారం

జనాభా గణనలో కులాల వివరాలతో కొత్తగా వచ్చే ముప్పేంటి? ఎందుకీ రాద్ధాంతం?

2011 సెన్సెస్ లో కులాల లెక్కలు సేకరించే అంశం మీద అధ్యయనం చేసే మంత్రుల బృందం రేపు (01 Jul 2010) సమావేశమవబోతుంది.


అసలీ విషయం మీద ఇంత రాద్ధాంతం అవసరమా? ఇరువైపులా అనేక వాదనలు వినిపిస్తున్నయి. ఇరువైపులనుంచీ చాలా వరకు ఉద్దేశ్యాలు మంచివే. నాకయితే, మౌలికంగా ఏదయినా సమాచారాన్నీ, నిజాన్నీ దాచి పెట్టి చెయ్యాలనుకునే మంచి అంతమంచిది కాదనిపిస్తుంది.


కొన్ని వర్గాల వాళ్ళు దీనివల్ల తమకేదో అన్యాయం జరిగిపోతుందనీ, మరికొన్ని వర్గాల వాళ్ళు తమకేదొ ఇబ్బడిముబ్బడిగా మేలు జరిగిపోతుందనీ అపొహలో ఉన్నారు. మరికొంతమందైతే, దీనివల్ల సమాజం పాడైపోతుందేమో, కుల రాజకీయాలు పెరిగిపోతాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇది కేవలం అపోహ మాత్రమే. కుల రాజకీయాలు ఇప్పుడు లేవా? కాకపోతే ఇక ముందు అరిచి గోల చెయ్యడం కాకుండా, సమాచారం మీద ఆధార పడతాయి. ఇది కొంత మంచి పరిణామమే కదా!
కులగణన వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు పైగా విలువైన సమాచారం, దానివల్ల ఒనగూడే ప్రయోజనాలు చాలా ఉన్నయి! గత 80 సంవత్సరాలుగా కులాలని లెక్కించలేదు. సమాజంలో కులాల పాత్ర తగ్గిపోయిందా? ఎన్నో పనులకీ, ప్రభుత్వ పధకాలకీ, సాంఘీక అంశాలకీ కులం అనేది ప్రాతిపదికగా ఉన్నప్పుడు, ఒక లెక్కా పత్రం లేకపోతే ఎలా!
అసలు కుల రహిత సమాజం నిర్మించాలనుకున్నప్పుడు ఈ లెక్కలెందుకు? ఇది కుల భావాలని పెంచే చర్య కాదా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.


కులరహిత సమాజాన్ని నిర్మూలించాలంటే కాగితం మీద మాత్రం కులం అనేది లేనట్లు నటిస్తే సరిపోదు (Like an ostrich). నా దృష్టిలో ఈ క్రింది అంశాలు అతి ముఖ్యమైనవి. వీటిని సాధించిన తరువాత కుల నిర్మూలన ప్రారంభమయినట్లు లెక్క. ఆ తరువాత కులాల సమాచారం అవసరం ఉండకపోవచ్చు.


1. సామాజిక న్యాయాన్ని కొలిచేందుకు కులం కన్నా మంచి ప్రాతిపదిక తయారు చెయ్యాలి
2. అన్ని కులసంఘాలనీ  రద్దు చేయాలి. (ముందు రాజకీయ నాయకులు ఈ మీటింగులకు వెళ్ళడం మానుకోవాలి)
3. మనలో మార్పుకు సూచికగా మాట్రిమోనియల్ కాలం లో కుల ప్రస్తావన పూర్తిగా నశించిపోవాలి
4. రిజర్వేషన్లూ, ఇతర సంక్షేమ పధకాలూ మరింత టార్గెటెడ్ గా అమలయ్యి, వాటి అవసరం తీరిపోవాలి లేదా మనం పైన చెప్పిన క్రొత్త ప్రాతిపదిక ప్రకారం అమలు చేయబడాలి (ముందు ఈ అంశాల మీద చర్చ ప్రారంభం అవ్వాలి)


ప్రస్తుతం మన సమాజంలో కులం అనేది, ఒక Social reality. దీని గురించిన సమాచారం సేకరించడం ఒక అవసరం.

28, జూన్ 2010, సోమవారం

హేవార్డ్స్, రాయల్ ఛాలేంజి Vs నజర్ సురక్షా ,కుబేర్ కుంజ్

హేవార్డ్స్, రాయల్ ఛాలేంజి అంటే పాపం సోడాలు, పేకముక్కలూ, మంచినీళ్ళ బాటిళ్ళూ అమ్ముకుంటూ చిన్న చిన్న అడ్వర్టయిజ్మెంట్లు వేసుకుంటున్నారు అని నమ్మేవాళ్ళు వుంటారా అని నా సందేహం. మద్యం ఒక వ్యసనం కాబట్టి దాన్ని ప్రోత్సహించే ప్రకటనలు ఉండకూడదు అని ప్రభుత్వాల ఉద్దేశ్యం అయిండొచ్చు.

ఈమధ్య టీవీల్లో వస్తున్న కొన్ని వ్యాపారప్రకటనలు చూస్తుంటే ఈ మద్యం అమ్మే కంపెనీలే బెటరేమో అనిపిస్తుంది. ఒకడేమో, అదేదో నజర్ సురక్షా యంత్రం (దిష్టి తగలకుండా కాపాడే తాయత్తన్నమాట)అంటాడు, ఇంకొకడేమో కొత్తగా కుబేర్ కుంజ్ (కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకొని ధనలాభం పొందడానికి మరి! మన యాడ్ ఏజెన్సీల దృష్టి లో లక్ష్మీ దేవి రేటింగ్ తగ్గిపోయినట్లుంది!)అంటాడు. విరామం లేకుండా గంటపాటు కుమ్మేస్తున్నారు టీవీల్లో.. మన టీవీ చానల్స్ వాళ్ళు మరీ చొద్యం.. ప్రజల్లో మూఢనమ్మకాల మీద, పెరిగిపోతున్న వ్యాపార ధోరణి మీదా, తరిగి పోతున్న మానవీయకోణం మీదా చచ్చు కవితలల్లిమరీ ప్రోగ్రాంలు వేసిన వెంటనే మొదలు పెట్టేస్తారు ఈ కమర్షియల్స్ ని.

ఈవిషయాల్లో పాలసీలు చేసే వాళ్ళ పని పాపం చాలా కష్టమే కదూ!

24, జూన్ 2010, గురువారం

ఇన్నేళ్ళకు గుర్తొచ్చిన రూపాయి..

మన రూపాయికి ఒక చిహ్నం ఉంటే బావుంటుంది అని, కాలేజీ రోజుల్నుంచీ అనుకుంటూ ఉండే వాళ్ళం మేము. ఇన్నాళ్ళకి అది నిజమవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఐదింట్లోంచి ఒకదాన్ని ఒకట్రెండ్రోజుల్లో ఎంపిక చేస్తారు మనవాళ్ళు.  పెద్ద గొప్ప విషయమేమీ కాకపోవచ్చు కానీ, నేనైతే ఒక మంచి మైలురాయి అవుతుందని ఆశిస్తున్నా! ఏమో..ఎవరికి తెలుసు..

1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం పోషించబోయే ముఖ్యపాత్రకి ఒక సంకేతం అయ్యుండొచ్చు..
2. వాడకానికి అనువుగా (ease of use) ఉండే పద్దతులమీద మన ప్రభుత్వాలు ద్రుష్టి పెట్టడంలో మొదటి అడుగు ఐయ్యుండొచ్చు..
3. ఆత్మవిశ్వాసం, ఆనందం నిండిన భారతావనికి ఒక ముందస్తు సూచనా అయ్యుండొచ్చు.. 
 

23, జూన్ 2010, బుధవారం

ఇన్నాళ్ళనుంచీ మనం కోరుకున్నదే..ఒడిసి పట్టుకోవడమే తరువాయి..

రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ ఏమీ చెయ్యట్లేదనీ, జనాలంతా అవినీతిపరులైపొయారనీ తెగ బాధపడిపోయే చాలా మంది గమనించారో లేదో గానీ, ఈ మధ్యే మన వాళ్ళు చాలా మంచి చట్టం ఒకటి తీసుకొచ్చారు. అదే ప్రాధమిక విద్యా హక్కు చట్టం (Right To Education Act). రాజ్యాంగం Art. 45 లో ఇచ్చిన ఆదేశిక సూత్రం ప్రకారం నిర్భంద, ఉచిత ప్రాధమిక విద్య ప్రతి భావిపౌరుడికీ ఇప్పుడొక హక్కు. ఈ చట్టం అమలులో నిధులు ఎంత మాత్రం అడ్డంకి కాబోవని సాక్షాత్తూ ప్రధాన మంత్రి గారు భరోసా ఇవ్వడం అభినందనీయం. ఆమధ్య నా ఆంగ్ల బ్లాగులో RTE గురించి వీలయినంత సరళంగా వివరించే ప్రయత్నం చేశా. ఒక లుక్కెయ్యండి. (http://weekendpolitician.blogspot.com/2010_04_01_archive.html )


ఈ చట్టం అమలు చెయ్యటం కోసం స్టేట్ లెవెల్లో కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా తయారు చెసారు. ఈ ముసాయిదా మీద ప్రజలు తమ అభిప్రాయాలనూ, సూచనలనూ ఈ నెల 30 లోపు తెలియ చేయవచ్చు.( Draft at http://ssa.ap.nic.in/RTEAct2009/RTE_Model_Rules.pdf    feedback to apssahyd@yahoo.co.in  )




నిరాశావాదుల్నందరినీ కొంచెం సేపు పక్కకునెట్టి, మనమంతా కొద్దిగా participation చేస్తే ఈ చట్టానికి దేశ భవిష్యత్తుని మార్చే శక్తి వస్తుంది. ఈ చట్టం అమలులో సాధ్యమైనంత రోల్ పోషిద్దాం. లేదంటే.. ఎప్పట్లాగే కడుపులో చల్ల కదలకుండా కూర్చోని, మనం తప్ప అందరూ ఈ దేశాన్ని నాశనం చెసేస్తున్నారని ఆయాసపడదాం..

22, జూన్ 2010, మంగళవారం

జై జై సంతలో బానిసలు ...మీకే మా వోట్లు ..

కీలకమైన నిర్ణయాలు చేసే చాలా సందర్భాలలో మన MLA లు హోటళ్ళలోనూ, రిసార్ట్స్ లోనూ గుంపుగా బందింపబడి అసెంబ్లీ లో వోట్లు వేయడం మనకు అలవాటై పోయినట్లుంది. నాయకులమని చెప్పుకొనే వాళ్ళకు కూడా అదో పెద్ద విషయం అనిపిస్తున్నట్లు లేదు. వీళ్ళల్లో ఇంకాస్త పెద్ద నాయకులు మాత్రం, ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఈ బందిఖానాలను ఏర్పాటు చేసి, చూసారా నా దగ్గర ఎంతమంది బానిసలున్నారో!! అన్నట్లు స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు.


సర్లే మనకర్థంగానిదేదో ఉండి వుంటుందిలే అని సరి పెట్టుకుందామన్నా, నాకు ఆశ్చర్యం కలిగించేదేంటంటే, ఇన్నేళ్ళలో ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా "ఇది నా ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తుంది" అని చెప్పి ఆ హోటళ్ళ నుండి బయటకు రాలేదు. వీళ్ళే సంతలో బానిస బ్రతుకులు వెళ్ళదీస్తూ మళ్ళీ ప్రజలకు మాత్రం నాయకులు గా బండి నడిపించేస్తున్నారు.


ఈ మధ్య అన్ని పార్టీల వాళ్ళకీ, "అధిష్టానం ఏం చెప్తే అదే", "ప్రజలేం కోరుకుంటే అదే" అని చెప్పటం fashion అయిపోయింది.


బాబులూ.. ముందు మీరు అధిష్టానానికి ఏమి చెప్తున్నారో, ప్రజలకి ఏం సూచిస్తున్నారో చెప్పి, తర్వాత మీ బానిసత్వం కంటిన్యూ చేసుకుంటే బావుంటుందేమో ఆలోచించండి..

14, జూన్ 2010, సోమవారం

'రావణ్ ' - అదే కథ.. ఒక వర్షన్లో హీరో, ఇంకో దాంట్లో విలన్?

మణిరత్నం గారి 'రావణ్ ' సినిమాలో తమిళ సూపర్ స్టార్ విక్రం హిందీ వర్షన్లో హీరో ట, అదే కథ.. తెలుగు/తమిళ వెర్షన్లలో విలనట! ఇదేదే గమ్మత్తుగా ఉందే.. అనుకుంటున్నాను..


ఇంటినుండి ఫోన్.. ఈ టైం లో చేయరే అని మీటింగ్ లోంచి బయటకి వచ్చి చూస్తే.. మా పిల్లలు ..


ఇద్దరూ కొట్టుకుని ఫోన్ చేసారు. ఇంటికెళ్ళాక, అమ్మాయి మొదట చెప్పిన కథ వింటే 'అయ్యో .. చెల్లి అని చూడకుండా వీడెంత కష్టపెడుతున్నాడు ' అని హృదయం ద్రవించిపోయింది. కోపం గా వాడి వంక తిరిగి చూస్తే.. వాడు అంతకన్నా హృదయ విదారకమైన కథ చెప్పాడు.. విన్నాక నా సింపతీ కాస్తా వాడి మీదకి మళ్ళింది. ఇద్దరూ పెద్ద సత్య సంధులు కారు కాబట్టి ఇద్దరి కథా విని దాని మీద మా పిల్లల్ని చూసే ఆవిడ దృష్టికోణం కూడా అప్లై చేసాకే ఏది కరెక్టో ఒక నిర్ధారణకి రావాల్సి వచ్చింది..


చిన్నపిల్లలతో అయితే .. ఇలాగ కుదురుతుంది కానీ..


ఈరోజు మనం ఒక వార్త సత్యాసత్యాల నిర్ధారణ కి 3-4 దిన పత్రికలు చూడవలసి వస్తుంది. అదే కథ, పాత్రల పేర్లూ అవే.. కానీ ఈనాడు, జ్యోతిల్లో ఒకరు కథానాయకుడు/రాలు ఇతే.. సాక్షి లో వారు ప్రతికథానాయకులు.. అదేవిధంగా వైస్ వెర్సా !


ఏదైనా ఒక పత్రిక లో ఒక పారా చదివి ఒక విషయాన్ని సత్యానికి దగ్గరగా తెలుసుకోగలిగిన రోజొస్తే ఎంత బాగుంటుంది.?

12, జూన్ 2010, శనివారం

వాట్ వుయ్ థింక్ ఈజ్ వాట్ వుయ్ గెట్...

మన రాజకీయాలనీ, రాజకీయ చర్చలనీ చూస్తె నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే, అసలు విషయాన్ని వదిలి, ఎవరో పనికిమాలిన వాళ్ళు మన నెత్తిన రుద్దే మసాలా కబుర్లనే అమాయకంగా రాజకీయ అజెండాగా స్వీకరించేస్తున్నాం చాలా వరకూ!


ఉదాహరణకు, గత రెండు నెలల్లో ప్రాధమిక విద్యా హక్కు చట్టం కంటే, ఏనాయకుడు ఏవర్గంలో ఉన్నాడనే దానిమీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది (విద్యా హక్కు చట్టం ప్రాముఖ్యత ఏంటో తెలిసి కూడా). సంక్షేమం,అభివృధ్ది ల గురించి కంటే ఎవరు ఏ పార్టీ లో చేరతారనే దాని మీదే ఎక్కువ చర్చ జరిగుంటుంది కదూ!


అవగాహనా లోపం వల్లో, అలక్ష్యం వల్లో ఎంతోమంది మేధావులూ, విజ్ఞులూ కూడా ఈ ఉచ్చులో పడుతుండడం దురదృష్టకరం . రాజకీయం ఏ విషయాల మీద నడవాలో అజెండా ప్రతిపాదించాల్సింది మనం కాదా? రాజకీయాల ఉచ్చులో మనం పడకుండా మనమే అజెండా నిర్ణయించి, నాయకులే మన దారిలో నడిచేలా చేస్తే ఎంత బాగుంటుందో కదా!  గాడి తప్పుతున్న మన ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రజల ఆదీనంలోకి తెచ్చుకోవడానికి ఏం చెద్దామో, బ్లాగర్లూ మీరే చెప్పండి...

10, జూన్ 2010, గురువారం

2010 లో 1910 నాటి అభిజాత్యం.. సిగ్గుచేటు!

నితిన్ గడ్కారీ గారు హైదరాబాద్ కి వచ్చారు భేష్! సాఫ్ట్ వేర్ ఇంజినీర్లని కలిసి, మాట్లాడి, లాప్ టాప్ బహుమతి పొందారు.. నైస్! పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.. మంచి పని...
అసలే మధ్య తరగతి వాళ్ళు రాజకీయాల నుండి దూరంగా వుండటం నచ్చని నేను, ఎదోలే కనీసం పార్టీలన్నా వీళ్ళ దగ్గరకి వచ్చే ప్రయత్నం చెస్తున్నాయి అని ఆనందపడుతూ టీవీ పెట్టా.. హైదరాబాదు యాత్రలో గడ్కారి గారు ఒక దళిత వాడలో సహపంక్తి భోజనం చేశారనే ఐటం చూసి, నివ్వెరపోయి అర్జెంటుగా కేలండరు చూసా! ఇది 2010 లేక 1910అని.


అన్నీ బాగానే ఉన్నాయి.. దళితులతో (పెద్ద మనసు చేసుకుని..) పెద్ద ఎత్తున చేపట్టిన ఈ 'సహపంక్తి భోజనమే ' మింగుడు పడట్లేదు... అసలేంటి వీళ్ళ ఉద్దేశ్యం? ఈయన గారితోనో లేక ఈయనగారిలాంటి వాళ్ళ తోనో సహపంక్తిలో కూర్చోగలిగితే అదే పదివేలు దళితులకి అనా! లేక చూడండి మేము ఎంత ఉదార స్వభావులమో అనా!
దళితులు గానీ ఇతర అణగారిన వర్గాలు గాని అడిగేది ఆత్మ గౌరవం, సమానత్వం, సమాన అవకాశాలే గానీ ఇతర వర్గాల దయా దాక్షణ్యాలు కాదు కదా!