ఏందో ఈ తెలంగాణా వాదులూ, సమైక్య వాదుల పరిస్థితి చూస్తుంటే ఏదో సినిమాలో ఉండే ఈ డైలాగ్ తెగ గుర్తొచ్చేస్తుందీ మధ్య.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లో ఎన్ని సమస్యలున్నాయో, ఒకే రాష్ట్రంగా కలిసి ఉండడంలో ఎవరెవరికి ఏ ఏ ఇబ్బందులున్నాయో ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. బానే ఉంది. ఈ మొత్తం వ్యవహారం లో భావోద్వేగాలు శృతి మించాయనేది తెలిసిన విషయమే.
సామాన్య ప్రజల దగ్గరినుండీ నాయకుల వరకూ మొత్తం అందరూ ఒక రకమైన ఉన్మాదానికి లోనయ్యారనేది మరీ బాధాకరం. ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్న ఈ పరిస్థితుల్లోనుండి బతికి బయట పడాలంటే ఏంచేయాలనేది అందరూ ఆలోచించ వలసిన విషయం. రాజకీయ పార్టీలూ నాయకులూ ఆ పని చెయ్యట్లేదు. పోనీ కనీసం మేధావి వర్గం అన్నా చేస్తుందా అంటే అదీ లేదు. సరే మనోళ్ళు బ్లాగుల్లో బరికేస్తారేమో అనే ఆశ కూడా గల్లంతే. ఎక్కడ చూసినా ఎవరిక్కావలసింది వాళ్ళు గుడ్డిగా సమర్ధించుకోవడం, అవతలి వాళ్ళనీ దుమ్మెత్తి పోయడమే కనిపిస్తుంది. కావాలంటే చూడండి..
తెలంగాణా వాదులు భాగో అన్నప్పుడూ, నాలుకలు కోస్తాం అన్నప్పుడూ సమైక్య వాదులంతా తెగ గింజుకుని పదజాలాల గురించి బాధపడిపోతారు. తెలంగాణా మద్దత్తుదారులు నోరు మెదపరు, మెదిపినా పై పై మాటలు చెప్పి అందులో ఆవేదన అర్థం చేసుకొమ్మని కాకమ్మ కథలు చెప్తారు.
అసలు తెలంగాణా వాళ్ళకి కష్టపడే గుణంలేదు, మేమొచ్చాకే వీళ్ళకి నాగరికత అబ్బింది అని సీమాంధ్రులు వాగినప్పుడు తెలంగాణా వాదులేమో రోడ్లమీదా, మీడియాలోనూ శివాలెత్తి పోతారు. సీమాంధ్ర మద్దత్తు దారులేమో లోలోన సంతోషిస్తూ పళ్ళికిలిస్తూ పైకి గభీరంగా వేరే విషయాలు మాట్లాడుతారు.
వేర్పాటు వాదులు అన్నప్పుడో, ఏ కాశ్మీర్ సమస్యతోనో పోల్చినప్పుడు తెగ బాధ పడిపోతారు. బ్రిటీష్ వలస వాదంతో సీమాంధ్రులని పోల్చినప్పుడు మాత్రం అవ్. కదా అని నోరెళ్ళ బెడతారు. సీమాంధ్రులూ అంతే వేర్పాటు వాదం అనేప్పుడు ఏనొప్పీ ఉండదు, వలస వాదం అన్నప్పుడు రోషం పొడుచుకొస్తుంది మరి.
దాడులు చేస్తాం తరిమి కొడతాం అని ఒకళ్ళంటే, సాయుధ ముఠాలు తయారు చేస్తాం ఆత్మాహుతి దాడులు చేస్తాం అని ఒకళ్ళంటారు. మళ్ళీ మనం మామూలే.. ఒకసారి మౌనం మరోసారి ఆగ్రహం.. మనదేప్రాంతం అనేదాన్ని బట్టి.. ప్రాంతీయాభిమానం మరి !
ఇలా మన వెధవతనం పెంచుకుంటూ పోటీ పడుతున్నంతకాలం ఈ సమస్య తీరదు. కాకపోతే..మొత్తం అందర్నీ కలిపి వెధవతనం జాయింట్ విన్నర్స్ అని ఆ ఢిల్లీ వాళ్ళు జమకట్టేస్తారు :( అయినా పర్లేదులే.. ఆ ఢిల్లీ వాళ్ళ యెదవతనంతో పోల్చుకుంటే మన వెధవతనమూ ఒక వెధవతనమేనా !!!!