25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

వ్యవస్థ లోనే గెలుపు - Lakshmi's Victory

వ్యవస్థతో పోరాటం అనే టపాలో, తన వ్యక్తిగత విషయంలో అడ్డదారులు తొక్కకుండా ఎంత కష్టమైనా వ్యవస్థ తో పోరాడి కొంత వరకైనా విజయం సాధించి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్న చేతన్ గురించి రాశాను. ఈ కధలో, సమాజం కోసం చేసే పనిలో ఎన్ని కష్టాలెదురైనా వ్యవస్థ మీద నమ్మకంతో పోరాడి గెలుపు సాధించిన లక్ష్మి గురించి రాస్తున్నాను. చదివి మీ స్పందననీ ఆలోచనల్నీ చెప్పండి.
-------------------------------------------------------------------------

లక్ష్మి 1997 లో ఒక NGO ని స్థాపించి మానసిక వికలాంగుల కోసం పనిచేస్తూ అనేక మందికి సేవలు అందిస్తున్నారు. ఈ సంస్థ తరుపున ఒక స్పెషల్ స్కూలూ, వొకేషనల్ ట్రైనింగ్ సెంటరూ ఇంకా అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూలులో దాదాపుగా ఒక వంద మంది ఉంటారు. వాళ్ళందరికీ వారి వారి సామర్ధ్యాన్ని బట్టి వేరు వేరు తరగతులూ, శిక్షణపొందిన ట్రైనర్లూ ఉన్నారు. చాలా మంది స్నేహితులూ, శ్రేయోభిలాషుల సహకారంతో మొదలుపెట్టబడిన ప్రయత్నం అది. కొన్నేళ్ళ తరువాత కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చి కొంత గ్రాంటు కూడా రావడం మొదలయ్యింది. ఆ స్కూలుకి 2006 లో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక బస్సుని స్పాన్సర్ చేయడంతో ఎంచక్కా ప్రతిరోజూ అందరినీ స్కూలుకి తేవడానికీ తిరిగి ఇంటిదగ్గర దిగబెట్టదానికీ చాలా అనువుగా ఉంది.

ఆ బస్సుని రిజిస్ట్రేషన్ చెయించినప్పుడు RTA వారు పొరపాటున దానిని కమర్షియల్ వాహనంగా రిజిష్టర్ చేశారు. అయ్యో ఇదేంటి ఇది స్కూల్ బస్సుకదా? మేము డాక్యుమెంటేషన్ సరిగ్గానే ఇచ్చాము కదా! టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో కూడా స్కూలు బస్సు అనే రాశారు కదా ఇప్పుడిలా రాశారేంటి అని మార్చమని అడిగారు. మీది స్పెషల్ స్కూలు కదా, ఇటువంటి వాటికి ఖైరతాబాదు RTA లో కమీషనరు కి ఒక లెటర్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు మినహాయింపు ఇచ్చేస్తారు అన్నారు

సరే అని లెటరు పెడితే, ఈ మధ్య రూల్స్ మారి పోయాయి. ఇలా ఎక్జెంప్షన్ ఇవ్వట్లేదు. మీరు కమర్షియల్ వాహనాన్నే స్కూలు వాహనంగా మార్పు చెయ్యమని అత్తాపూర్ లోని DTC కి అప్లికేషన్ పెట్టండి వాళ్ళు మార్పు చేస్తారు అన్నారు ఖైరతాబాదు RTA వాళ్ళు.

సరే వాళ్ళకి రూల్స్ ప్రకారం ఇబ్బందులున్నాయేమోలే మార్పు చేస్తామన్నారు కదా అని అత్తాపూర్ వెళ్ళి ఆ అప్లికేషన్ కూడా పెట్టారు. అత్తాపూర్ DTC వారు మేము అసలు అలా చెయ్యవచ్చా అని వివరాలు అడుగుతూ మళ్ళీ ఖైరతాబాద్ RTA వారికే ఒక లెటర్ రాసి వారినుండి సమాధానం రాగానే చేస్తాం పొమ్మన్నారు.

కొన్నాళ్ళ తరువాత వెళ్తే RTA నుండి ఇంకా సమాధానం రాలేదని చెప్పారు. సరే కనుక్కుందాం అని మళ్ళీ ఖైరతాబాదు వెళ్ళి RTA వారిని కనుక్కుంటే, వాళ్ళు మీది స్కూలు అనే గుర్తింపు ప్రత్రమూ, ఆడిట్ రిపోర్టులూ తెమ్మన్నారు. సరే అని ఆడిట్ రిపోర్టులూ, గ్రాంట్ ఇచ్చే కేంద్ర మంత్రిత్వ శాఖ వారి గురింపు పత్రమూ తీసుకెళితే, ఇది పనికిరాదు మామూలుగా స్కూళ్ళకి గుర్తింపు ఇచ్చే DEO నుండి పత్రం కావాలన్నారు. వాళ్ళకి సంబంధం లేదు దీనితో ఇది మామూలు స్కూలు కాదు ప్రత్యేకమైన పిల్లల కోసం పనిచేసే స్కూలు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ ఆఫీసు చుట్టూ కొన్నాళ్ళు తిరిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా ఏమాత్రం ఫలితం లేదు.

సరే మొదట పొరపాటుగా రిజిస్ట్రేషన్ చేసిన RTO దగ్గరికే వెళ్ళి విషయమంతా చెప్తే బావుంటుందని అక్కడికెళ్ళి విషయం చెప్తే వాళ్ళు, సరే ఈ మూడు సంవత్సరాలకీ కమర్షియల్ లెక్కన టాక్సు చెల్లించండి అప్పుడు స్కూలు బస్సుగా మార్పుకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు.

సరే ఇలాకాదని ఇంకొంచెం పై అధికారి దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తే ఒకరోజేమో అసలు మన ఫైలే కనిపించట్లేదన్నారు. ఆ అధికారి కోపగించుకోవడంతో మొత్తానికి రెండో రోజుకి ఫైలు దొరికిందిగానీ ఆ అధికారి కూడా ఇన్నిరోజులకీ కమర్షియల్ టాక్సు చెల్లించాల్సిందే అన్నారు.
ఇంక ఈ విషయం మీద తిరగడానికి ఆఫీసులూ అధికారులూ ఎవరూ మిగల్లేదు. మరేం చెయ్యాలి? ఇన్నిరోజులూ విషయాన్ని నానబెట్టిందీ వాళ్ళే, మళ్ళీ తిరిగి ఇన్నిరోజులకీ డబ్బు చెల్లించమంటుందీ వాళ్ళే! సరే ఇహ లాభం లేదని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పరిశీలనలో ఉండగానే ఇంకో చిక్కొచ్చి పడింది. అధికారులు ఒకరోజు బస్సుని దారి మధ్యలో ఆపి తనిఖీ చేసి కమర్షియల్ టాక్సు చెల్లించలేదని సీజ్ చేశారు. బస్సు లేకపోతే ఈ వందమందీ మానసిక వికలాంగుల పరిస్థితేంటి? తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాలకీ నాలుగు లక్షల పైన చెల్లించి బస్సు విడిపించుకొన్నారు.

ఈ విషయాన్ని కూడా మానవ హక్కుల సంఘంలో ఉన్న ఫిర్యాదుకి జత చేసి కేసు కొనసాగించారు. చివరికి మానవ హక్కుల సంఘం ఉన్నత స్థాయి అధికారుల్ని పిలిపించి ఇదేమి పాలన, ఇదెక్కడి చోద్యం అని నిలదీసింది. మాదే పొరపాటు అని వాళ్ళు ఒప్పుకొని బస్సుని స్కూలు బస్సుగా గుర్తించడానికి అంగీకరించారు. 4 వారాల్లోపు ఆ 4 లక్షల డబ్బూ తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలివ్వబడ్డాయి. మొత్తానికి ఇంకొద్దిగా కొన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బు తిరిగి రాబట్టుకొని రిజిస్ట్రేషన్ లోని పొరపాటుని కూడా సరి చేయించగలిగారు.

వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: ఈ కధలో అధికారులూ ఉద్యోగులూ ఎవరూ పూర్తిగా చెడ్డ వాళ్ళు కాదు. కానీ ఒక్కళ్ళు కూడా మంచిపనికోసం, రూల్స్ ని తెలుసుకొని పాటించే సాహసం చెయ్యలేదు. అదే, ఎవరైనా ఏదో ఒక విధంగా రూల్స్ ని దొడ్డిదారిలో అతిక్రమించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం ఇదే వ్యవస్థ భలే వేఘంగా పనిచేస్తుంది కదూ! ఈ కధలోని లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో తిరగాల్సి వచ్చింది కష్టపడింది అందులో ఆవిడ విజయమేంటి అనుకునే వాళ్ళుండొచ్చు. సరైన పద్దతి అవసరం లేదు అనుకుంటే ఆవిడ ఎంత సులువుగా ఈ గండం నుండి గట్టెక్కగలిగేదో నాకు బాగా తెలుసు కాబట్టే నేనీ కథ రాశాను. ఎంత కష్టమైనా పోరాడి చివరికి వ్యవస్థతో చెయ్యల్సిన పనిని చెయ్యించడంలో ఈమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకం.

19, ఫిబ్రవరి 2011, శనివారం

వ్యవస్థతో పోరాటం - Chetan's Fight

అబ్బే ఈ దేశం బాగుపడదు. సమాజం మరీ స్వార్థ పూరితమైపోయింది. ఈ జనాలు, ఈ రాజకీయాలు ఇంతే. వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు లాంటి వాటిని వినీ వినీ విసుగొస్తుంది కదూ. నాకు బాగా తెలిసిన ఒక మూడు వేరు వేరు అనుభవాలని టపాలుగా రాస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. ఇందులో మొదటిది చేతన్ కథ.
----------------------------------------------------------------------------------


2004 లో సంగతి ఇది. రోజూ ఉత్సాహంగా పని చేసి, సాయంత్రానికి చక్కగా అప్డేట్ ఇచ్చే చేతన్ ఒకరోజు అసలేమాత్రం సమాచారం లేకుండా మధ్యహ్నమే వెళ్ళిపోయాడు. ఏంటి విషయం, ఏమైనా సమాచారం ఇచ్చాడా అని మిగిలిన వాళ్ళని అడిగితే ఏదో ఫొన్ వచ్చిందనీ హడావిడిగా వెళ్ళాడనీ చెప్పారు. అరే ఏదైనా సమస్యొచ్చిందేమో కనుక్కోలేదా అని వెంటనే ఫొన్ చేశాను.. చేతన్, ఎక్కడున్నారు మీరు? ఈజ్ ఎవ్రీ థింగ్ ఆల్రైట్ అని? అప్పుడు తెలిసింది పాపం మా చేతన్ ప్రేమించి పెళ్ళడదామనుకుంటున్న అమ్మాయికి యాక్సిడేంట్ అయిందని. యాక్సిడెంట్ చేసినతనే హస్పటల్ లో చేర్పించాడట. కొంచెం ధైర్యం చెప్పి అవసరమైతే ఫొన్ చెయ్యమన్నాం.


మూడు నెలలపాటు హాస్పిటల్లో రకరకాల ప్రయత్నాలు చేసినా దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయి చనిపోయింది. ఆ మూణ్ణెల్లూ చేతన్ మాత్రం సెలవుపై వెళ్ళకుండా తనికిష్టమైన టైములో పనిచేసుకునే వెసులుబాటు అడిగాడు. నాకర్థమయ్యింది.. అదే బెటర్ తనకి కూడా వర్క్ కొంతవరకూ ఉపశమనం కలిగిస్తుందని. టైముకి ఆఫీసులకి వచ్చే చాలా మంది రోజంతా చేసే దానికంటే చాలా ఎక్కువే పనిచేశాడు. ఫగలు మాత్రం దాదాపుగా హస్పిటల్ దగ్గరే గడిపేవాడు.


మూడు నెలలపాటు హాస్పిటల్లో వైద్యం అంటే మాటలా? ఖర్చు లక్షల్లో అయ్యింది. ఎం ఎస్ అయ్యింతర్వాత కొద్ది నెలలు మాత్రమే అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడ ఉండడం ఇష్టంలేక ఇండియాకి వచ్చిన మా చేతన్ దగ్గర అంత డబ్బు లేదు కానీ, అదృష్టవశాత్తూ అమెరికాలో ఉన్నప్పటి క్రెడిట్ కార్డు ఉండబట్టి ఒక మూడు లక్షలు పైనే వైద్యానికి సర్దుబాటు చేసుకోగలిగాడు. నెల నెలా ఇక్కడ ఉద్యోగంతో అక్కడి అప్పు తీర్చడమంటే ఎంతకష్టం? కానీ అమెరికా నుండి వచ్చేశాం కదా అని లైట్ తీసుకునే చాలా మందిలా కాకుండా రెండేళ్ళు కష్టపడి ఆ అప్పు మొత్తం తీర్చేశాడు.


ఇదంతా వ్యక్తిగతం. తనకొచ్చిన అనుకోని పరిస్థితులూ, మనుషులతో ఉండే సంబంధాలమీద నిబద్ధతా, నిజాయితీ లాంటివి పుష్కలంగా ఉన్న ఒక మంచి వ్యక్తిగా చేతన్ అంటే నాతో పాటు మా ఆఫీస్ లో చాలా మందికి ఎంతో గౌరవం.


అసలు విషయానికి వస్తే, యాక్సిడెంట్ చేసినతను ఒక పెద్ద బ్యాంకు ఛైర్మన్. పలుకుబడిలోనూ, పరిచయాల్లోను, డబ్బులోనూ మన చేతన్ కి అసలేమాత్రం అందనంత స్థాయి. ఇక్కడినుంచే చేతన్ అసలు పోరాటం మొదలైయ్యింది. పోలిస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు ఫిర్యాదుకూడా తీసుకోకుండా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయినా అన్ని పోలీస్ స్టేషన్ లూ, తిరిగి తిరిగి, పై స్థాయి అధికారుల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళి ఫిర్యాదు నమోదు చేయించగలిగాడు. అప్పటికీ అవతలి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ.. ఈ కేసు తో వీళ్ళు మనల్నేమి చయ్యగలరులే అనే నమ్మకం అయ్యుండొచ్చు.


మొత్తానికి పోలీసులు చార్జ్ షీట్ పెట్టారు. కారు నడిపిన పెద్ద మనిషి స్థానంలో డ్రైవరు ఉన్నాడు చార్జ్ షీట్లో. శిక్ష ఏంటి? ఎవరికి? అనేదాన్ని పక్కన బెడితే అసలు తప్పు చేసిన వాడు బాధ్యత ఎందుకు తీసుకోడు? ఎంత డబ్బున్న వాడైతే మాత్రం!?


పోనిలే కేసు కోర్టుకి వెళ్ళిందికదా, చూద్దాం ఎక్కడిదాకా వెళ్తుందో అని చేతన్ ఒక లాయర్ ని పెట్టుకొని పొరాటం మొదలు పెట్టాడు. అక్కడినుంచీ ఎడతెరిపిలేని వాయిదాలూ, ఆలస్యాలతో కేసు రెండు సంవత్సరాలు సాగింది. బతుకు పోరాటానికే వ్యవధి సరిపోని మామూలు మనుషులు ఎంతకాలం ఇట్లా తిరగ్గలరు? అంటే కాగితం మీద ఉన్న న్యాయం చేతికందాలంటే కేవలం డబ్బున్న వాడికే సాద్యమా?


ఇంతా చేస్తే, ఒక వాయిదా కి నువ్వు రానవసరం లేదులే, ఈ రోజూ ఎలాగు వాయిదానే అని చెప్పాడు చేతన్ తరపు లాయరు. తరువాత కనుక్కుంటే, ఆరోజు చేతన్ రాలేదు కాబట్టి కేసు మూసేశారట! మరీ సినికల్ గా ఆలోచిస్తున్నాననుకునేరు. ఈ కోర్టుల వ్యవహారోల్లో రెండు వైపులా లాయర్లు కుమ్మక్కవడం నిజంగానే జరుగుతుంది.


సరే, ఇప్పుడేం చెయ్యాలని చేతన్ కనుక్కుంటే, ఇలా మూసేసిన కేసులని మళ్ళీ మూడు నెలల్లోగా తిరిగి తెరిపించే వెసులుబాటు ఉండటం ఆ గడువు ముగియడానికి ఇంకా కొద్దిరోజులే ఉండడంతో చేతన్ మరో లాయర్తో మళ్ళీ కేసు ఓపెన్ చేయించాడు.


మళ్ళీ ఒక సంవత్సరం పాటు వాయిదాలు జరిగి కేసు విచారణకొచ్చింది. సాక్షులు ఎవరంటే, ఆ దారిలో పోతూ యాక్సిడెంట్ చూసిన ఒక ప్రత్యక్ష సాక్షీ, హాస్పిటల్ లో వైద్యం చేసిన డాక్టరూ. ముందుగా ప్రత్యక్ష సాక్షి ని ప్రవేశ పెట్టాలంటే, పోలీసుల దగ్గర అతని పేరు, బంజారా హిల్స్ లోని ఒక బస్తీ పేరు మాత్రమె ఉన్నాయి. చేతన్ ఎలాగోలా కష్టపడి ఆ సాక్షిని కలిసి సహాయం అర్థిస్తే, పాపం అతను రోజు కూలీ చేసుకునే వ్యక్తి. తన కూలీ మానుకొని కోర్టు చుట్టూ తిరగడం అయ్యేపని కాదు. చేతన్ ఎన్ని రోజులు కోర్టుకి వస్తే అన్ని రోజుల కూలీ డబ్బులు ఇస్తాను, నాకోసం ఏమీ అబద్దం చెప్పొద్దు, మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి అని అతనిని ఒప్పించి సాక్ష్యం ఇప్పించాడు.


అవతలి వైపు వాళ్ళు ఒక కొత్త వాదన మొదలెట్టారు. ఆ అమ్మాయి చనిపోయింది ప్రమాదం జరిగిన మూడు నెలలకి కాబట్టి ఆమె మాములుగా ఆమెకుండే ఏదైనా అనారోగ్యంతొ చనిపోయుండొచ్చుకదా అని. సాక్ష్యం ఇవ్వడానికి రావలసిన డాక్టర్ తో మాట్లాడేదాకా చేతన్ స్థిమితంగా లేడనే చెప్పొచ్చు. డాక్టర్ గారు చాలా మంచి వారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. యాక్సిడెంట్ లో అయిన గాయాల వల్లే మూడు నెలల పోరాటం తరువాత చనిపోయింది అని.


తీర్పు చెతన్ కి అనుకూలంగా వచ్చింది. అవతలి పార్టీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పింది కోర్టు. ఆరోజు చేతన్ మొహంలో సంతృప్తి నాకు ఇంకా గుర్తుంది. డబ్బులు రాక పోయినా పర్వాలేదు కానీ మనం కేసు గెలిచాం. యాక్సిడెంట్ చేసిన వాడు ఎంత బలవంతుదైనా సరే బాధ్యత తీసుకోవలసిందే అని నిరూపించాం అన్నాడు.


అనుకున్నట్టుగానే అవతలి వాళ్ళు హై కోర్టుకి అప్పీలు చేశారు. ఏదో ఒక రోజు, అలసిపోరా వీళ్ళు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈ మొత్తం కథలో, అద్భుతమైన మంచి జరిగింది ఇక్కడే. హైకోర్టు మళ్ళీ కేసుని సాగదీయకుండా, వెంటనే సగం పరిహారం చెల్లించి కేసు కొనసాగించుకోమ్మని రూలింగ్ ఇచ్చింది. సగం పరిహారం కోర్టు ద్వారా చెల్లించ బడింది. కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అవును 2004 నుండి..but chetan is continuing his fight..


వీకెండ్ పొలిటీషియన్ వ్యాఖ్య: మన వ్యవస్థలో ఇన్ని లోపాలున్నాయి నిజమే. కానీ ఇన్ని లోపాలతో అందరూ ఇంత పోరాటం చెయ్యాలా? కొంతవరకైనా న్యాయం పొందడానికి అందరూ చేతన్ లా పోరాటం చెయ్యాలంటే జరిగే పనేనా? వ్యవస్థ అన్యాయంగా ఉందని, తలొంచుకోవడమో, అడ్డదారులు తొక్కడమో లాంటి బలహీనతలకి మనం లొంగితే ఈ వ్యవస్థ బాగు పడే అవకాశం అసలేమాత్రం ఉండదు. చేతన్ లా కొంతమందైనా పోరాటం చేస్తే వ్యవస్థ మారి తీరుతుంది. అంతేకాదు ఈ అనుభంతో, భవిష్యత్తులో ఎవరైనా పోలీసు, న్యాయ వ్యవస్థల్లో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తే, ఆప్రయత్నాన్ని అర్థం చేసుకొని సరిగ్గా అంచనా వెయ్యగలిగిన చేతన్ లాంటి ఒక పౌరుడు ఈ దేశానికి దొరికడం శుభ సూచికం. వచ్చే వందేళ్ళలో మనం నిర్మించబోయే నవీన భారతావనికి ఇలాంటివాళ్ళే పునాది రాళ్ళు.