19, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు - సుశాలమ్మ

రాజశేఖర రెడ్డి చనిపోయిన మొదట్లో కొంతమంది గ్రామీణ మహిళలతో మాట్లాడినప్పుడు నున్ను బాగా ఆలోచింపజేసిన ఒక సందర్భం ఇది.

నేను మాట్లాడిన వారిలో అందరూ పేదలు లేకపోతే నిరుపేదలైన వాళ్ళే. దాదాపుగా నిరక్షరాస్యులే అనుకోవచ్చు. అన్ని పధకాలూ అందుతున్నాయా? మీ దృష్టిలో ఎలాంటి పధకాలైతే మీకు బావుంటుంది? ఏ విషయాల్లో మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు లాంటి ప్రశ్నలడుగుతూ విషయాలు అర్థం చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయత్నమది.

పింఛన్లూ ఇంకా ఇతర పధకాలూ సరిగ్గా అమలవ్వట్లేదనీ, YSR ఉన్నప్పుడు బాగా అమలయ్యేవనీ చెప్పారు వాళ్ళు. ఇప్పుడున్నాయనకూడా అన్నీ చేస్తాను, చేస్తున్నాము అనే చెప్తున్నారు కదా ఏంటి ఇబ్బంది అని అడిగితే, అలాగే చెప్తున్నారు గానీ మా చేతికి మాత్రం అందట్లేదు అన్నారు.

సరే వీళ్ళు చెప్తున్నదాంట్లో కొంత నిజమూ కొంత వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతని తెలియజేసే ఉద్దేశ్యమూ ఉందని నాకు అనిపించి.. సరే మరి ఎలా చేస్తే పధకాలు సరిగ్గా అమలవుతాయి అని అడిగా. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తే అవుతాయన్నారు.

మరి సోనియాగాంధీ చెయ్యనంటుంది కదా, ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో అది ఆలోచిద్దాం అన్నాన్నేను. అప్పుడొచ్చింది ఒక బుల్లెట్లాంటి సమాధానం:

ఏందబ్బాయ్ నువ్వు చెప్పేది ? ఏందామి జేసేది బోడి.. ఆమిని జేసిందే మేవయితే ! ఆమినిజేసినోళ్ళం ఆయబ్బాయిని జెయ్యలేమా ?

ఈ ప్రజాస్వామ్యంలో తన సత్తా ఏంటో, తనేం చెయ్యగలదో ఎంత స్పష్టంగా చెప్పిందీ! తన శక్తి గురించీ తన పాత్ర గురించిన స్పృహ ఏంత స్పష్టంగా ఉందీమెలో !!

నేను: నీ పేరెంటమ్మా ?
సుశాలమ్మ: సుశాలమ్మ
నేను: ఉపాధి హామీ పనులందుతున్నాయా?
సుశాలమ్మ: అందుతున్నాయి. మా వూళ్ళో చానా మంది యెల్తన్నారు
నేను: ఎన్నిరోజులెళ్ళావ్ ఈ యేడు?
సుశాలమ్మ: నాకుండదు. 60 సం. దాటిన నాబోటి ముసలొళ్ళకి కాదు అది వయొసోళ్ళకే. మా కోడళ్ళు కొడుకులూ యెల్తన్నారు.
నేను: అక్కడ పనిజేసే వాళ్ళ వస్తువులూ, పిల్లల్ని చూసుకోటానికి నీ లాంటి ముసలోళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు పని రూలు ప్రకారం. నీ లాంటోళ్ళని తీసుకొని వెళ్ళి ఈ సారి అడుగు.

వోటెయ్యండి బాబూ అని చెప్పినప్పుడు.. ఆన్ లైన్లో వోటేసే పద్దతి పెట్టాలి. అన్నీ ఇంత కష్టంగా ఉంటే ఎవరేస్తారు? నేనొక్కణ్ణీ వేసినా రాజకీయ రాజకీయ పార్టీలు వోట్లు కొనుక్కుంటారు. మనమెంత చించికున్నా మనం మార్చలేము ఈ దేశాన్ని.అసలు ప్రెసిడెన్షియల్ సిస్టం పెట్టాలి మన దేశంలో. ప్రపోర్షనల్ రిప్రసెంటేషన్ ఉండాలి.. లాంటి సమాధానాలిచ్చిన ఎంతోమంది నాకు ఒక్కసారిగా గుర్తొచ్చారు.

వివిధ కారణాలతో వోట్లెయ్యకుండా ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్ని తిట్టుకుంటూ కూర్చునే వాళ్ళ ని చూసినప్పుడు కలిగే అసహనం, నిరుత్సాహం ఒక్కసారిగా పెనుగాలికి కొట్టుకుపోయింది. మన ప్రజాస్వామ్యానికి ఇంకేం భయం లేదు. సుశాలమ్మ లాంటి పౌరులున్నారు.. ఇంక మన పని మనం ధైర్యంగా చెయ్యడమే మిగిలింది అనిపించింది. రాజ్యాంగ నిర్మాతలు సామాన్య ప్రజల మీద పెట్టిన నమ్మకాన్ని వీళ్ళు వమ్ము కానీయరు. ఈ సుశాలమ్మే మన ప్రజాస్వామ్యానికి పెద్ద దిక్కు అనిపించింది.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే ఊరికి వెళ్ళినప్పుడు:


నేను: సుశాలమ్మా.. ఏంది సంగతులు ?
సుశాలమ్మ: అంతా బాగానే ఉందయ్యా. ఉపాది హామీ పనిస్తన్నారు నాక్కూడా
నేను: ఒహ్హో.. సామాన్యురాలివిగాదు.. ఏమన్నారు?
సుశాలమ్మ: మాక్కూడా ఇవ్వమని అడిగాం.. రూల్స్ లేవన్నారు. వస్తువులూ పిల్లల్నీ కనిపెట్టుకునుటానికి మాక్కూడా ఇవ్వాలి పని. అది రూలు అంటేనూ.. ఆయన నవ్వి..అబ్బో సుశాలమ్మో నీ రూల్స్ తో మేం పళ్ళేములే గానీ పనే ఇస్తాంలే అని పనిలో పెట్టుకున్నాడు.
నేను: నాయకురాలివయిపోయావ్ అయితే వూళ్ళో :)
సుశాలమ్మ: ఊరుకోబ్బాయ్.. ఇప్పుడుకే మా మనవళ్ళు కోడల్లు జోకులు జేత్తన్నారు నామీద
నేను: ఏమని ?
సుశాలమ్మ: సోనియాగాంధీ అని పేరు బెట్టారు నాకు.
నేను: ఛస్స్.. ఆ పేరు నీకెందుకు. సోనియాగాంధీ నే ఉంచాలో ఊడబెరకాలో డిసైడ్ చేసేది నువ్వయితె. నేజెప్తాలే ఆళ్ళకి నువ్వంతకంటే పవర్ ఫుల్లని :))

అవును, మన ప్రజాస్వామ్యానికి ఈ సుశాలమ్మే పెద్ద దిక్కు. జై హో సుశాలమ్మ..


8, ఆగస్టు 2011, సోమవారం

వాళ్ళ సరదా వాళ్ళిష్టం మధ్యన నా ఏడుపేంది? నేనంత కూల్ కాదు మరి, ప్చ్..

హైదరాబాద్ లో టమాటా ఫెస్టివల్ జరుపుకున్నారంట కుర్రాళ్ళు. స్నేహితుల దినం సందర్భంగా.. జీవితం మళ్ళీదొరకదని ఈ మధ్యే తెలుసుకున్న పిల్లగాళ్ళు వీళ్ళంతా. మనకున్న పిచ్చి చాలదన్నట్టు ప్రపంచంలోని పిచ్చినంతా ఈ ఉన్న ఒక్క జీవితంలోకి ఎక్కించేసుకోవాలనే సరదా వీరిది పాపం. అసలు జీవితమనేదే ఒకటుందని తెలియని కోట్ల మంది ఉన్న సమాజంలోని వనరుల్ని వాడుకుని మెరుగైన జీవితం అనుభవిస్తున్న అతికొద్దిమందిమి మాత్రమే తామనే స్పృహ వీళ్ళకి లేనట్టుంది.


సంస్కృతీ, తొక్క లాంటి వాటి గురించి పక్కనబెడితే.. అసలు తినే పదార్ధాలని కొంతమంది సరదాలకోసం వాడుకోవడం పబ్లిగ్గా కొన్ని టన్నుల టమాటాలను వ్యర్ధం చెయ్యడం మన సమాజంలో చెయ్యతగిన పనేనా ?

బానే ఉంది టమాటా రైతులకి ఇది మంచిదేగా అనుకోనూ వచ్చేమో. అలా అయితే మొత్తం సమాజం ఎలా ఉన్నా నాకనవసరం అని కొంతమంది సరదాగా దేశంలో ఉన్న ధాన్యమంతా తీసుకొచ్చి ఒక ఆట ఆడుకుంటే ?

ఇది చిన్న సరదానే కావచ్చు కానీ, చాలా లోతైన ప్రశ్నల్ని లేవనెత్తే అంశమే. సంబంధిత అధికారులు దీని మీద సరిగ్గా స్పందించుంటే బావుండేది. ఇది సరైన చర్య కాదు అని చెప్పే సందేశం ఇచ్చి ఉంటే బావుండేది అనిపిస్తుంది. మాలూలు జనాలమీదకి కాలుదువ్వే అధికార యంత్రాంగం తలుచుకుంటే ఏదో ఒక సెక్షన్ దొరకదూ.. కనీసం ఇది తప్పూ అని చెప్పడానికి !!

ఈ మధ్య ఎవడుజూసినా యూతో యూతో అని వెరెత్తి పోవడం ఒక ఫ్యాషనైపోయింది. మరి మన యూతేమో పరమ బూతులా ఉంది. ఒక పక్క అవినీతి, తెలంగాణా సమస్య, రైతుల సమస్యలు, ఉద్యోగాలూ, విద్య, వ్యవసాయం, న్యాయ వ్యవస్థ, అధిక ధరలు ఇన్నిటిమీద దేశం అట్టుడికి పోతుంటే అవేమీ తమకి పట్టనట్టు బీరు దినాలూ, టమాటా తద్దినాలు జరుపుకుంటున్న మన యూతు బూతుని చూస్తుంటే ఇదేనేమో కూల్ యూతంటే అనిపిస్తుంది మరి.

అయ్యా హజారే బాబూ, మీ దీక్షలు ఇట్టాంటి పనికిమాలిన పోకడలని దూరం చేసేలా చైతన్యం నింపడానికి చెయ్యండి సారూ.. రాజకీయాలు వాటంతటవే బాగుపడతాయి.. జనాలు ఇట్లా తయారవుతుంటే మీరేంది సారూ పాపం రాజకీయ నాయకుల మీద పడ్డారు ! సమాజంలో ఉన్న జనాల క్వాలిటీ ఇలా ఉంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. యధా ప్రజా తధా నాయకా...

PS: Image taken from Sakshi news paper..